చిన్నప్పుడే విడిపోవడంతో తల్లి ఎలా ఉంటుందో ఆ కూతుళ్లకు తెలియదు. కూతుళ్లు ఎలా ఉంటారో ఆ తల్లికి తెలియదు.
హైదరాబాద్: చిన్నప్పుడే విడిపోవడంతో తల్లి ఎలా ఉంటుందో ఆ కూతుళ్లకు తెలియదు. కూతుళ్లు ఎలా ఉంటారో ఆ తల్లికి తెలియదు. అయితే ఓ ఘటన ఈ తల్లీకూతుళ్లను కలిపింది. హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నం. 10లోని జహీరానగర్‌లో నివసించే పద్మ, రమేష్ దంపతులకు మౌనిక అనే కూతురు ఉంది. రోడ్డు ప్రమాదంలో రమేష్ మృతి చెందిన తర్వాత పద్మ తమ ఇంటి సమీపంలో ఉండే గోవిందును వివాహం చేసుకుంది. వీరికి మరో కూతురు సోని జన్మించింది. దాదాపు 13 ఏళ్ల క్రితం.. పెద్ద కూతురు వయసు ఆరేళ్లు, చిన్న కూతురు వయసు ఆరు నెలలు ఉన్నప్పుడే మద్యానికి బానిసై పద్మ ఇల్లు విడిచి వెళ్లిపోయింది. దీంతో గోవిందు లక్ష్మీ అనే మహిళను రెండో వివాహం చేసుకున్నాడు. అప్పటికే లక్ష్మికి ఓ కొడుకు ఉన్నాడు.
గోవిందుతో మళ్లీ ఓ కొడుకు.. కూతురు.. పుట్టారు. వీరికి పిల్లలు కలగగానే పద్మకు పుట్టిన ఇద్దరు పిల్లలపై వివక్ష చూపడం ప్రారంభించారు. ఈ క్రమంలో గత అయిదేళ్లుగా మౌనికను నెలలో 20 రోజుల పాటు వ్యభిచారానికి పంపించసాగారు. మౌనిక ఎదురుతిరిగితే చావబాదేవారు... తిండి పెట్టకుండా పస్తులుంచేవారు. ఇటీవల చిన్న కూతురు సోనిని కూడా వ్యభిచారం వైపు నెట్టారు. దీంతో మౌనిక ఇంట్లో నుంచి పారిపోయి రెండు రోజుల క్రితం పోలీసులను ఆశ్రయించింది. ఇదంతా పత్రికల్లో చూసిన అసలు తల్లి పద్మ శనివారం పోలీస్ స్టేషన్‌కు వచ్చింది. కూతుళ్ల పరిస్థితిని చూసి కన్నీటిపర్యంతం అయింది. చిన్న కూతురిని చదివిస్తానని.. పెద్ద కూతురికి వివాహం చేస్తానని పద్మ పోలీసులకు తెలియజేసింది.