సెప్టెంబర్‌లో ‘2011 గ్రూప్-1’ మెయిన్స్ | 2011 Group -1 mains in september | Sakshi
Sakshi News home page

సెప్టెంబర్‌లో ‘2011 గ్రూప్-1’ మెయిన్స్

Aug 5 2016 3:58 AM | Updated on Aug 18 2018 5:57 PM

వివాదాల కారణంగా ఆగిపోయిన 2011 గ్రూప్-1 మెయిన్స్ పరీక్షను సెప్టెంబర్‌లో నిర్వహించాలని రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) ప్రాథమికంగా నిర్ణయానికి...

ఏపీతోపాటే రాష్ట్రంలోనూ నిర్వహణకు టీఎస్‌పీఎస్సీ కసరత్తు
* సీఎస్, సీఎంతో చర్చించిన చైర్మన్ ఘంటా చక్రపాణి
* ఆమోదం కోసం లేఖ.. అనుమతి రాగానే షెడ్యూల్
* సెప్టెంబర్ 6 నుంచి 17 వరకు పరీక్షలు ఉండే అవకాశం

సాక్షి, హైదరాబాద్: వివాదాల కారణంగా ఆగిపోయిన 2011 గ్రూప్-1 మెయిన్స్ పరీక్షను సెప్టెంబర్‌లో నిర్వహించాలని రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) ప్రాథమికంగా నిర్ణయానికి వచ్చింది. ఈ అంశంలో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే మెయిన్స్ పరీక్షల షెడ్యూల్ విడుదల చేసింది.

అయితే రెండు రాష్ట్రాల్లోనూ ఒకేసారి పరీక్షలు నిర్వహించాలన్న సుప్రీం ఆదేశాల మేరకు... సెప్టెంబర్ 6 నుంచి 17వ తేదీ వరకు తెలంగాణలోనూ ఆ పరీక్షలను నిర్వహించేలా టీఎస్‌పీఎస్సీ చర్యలు చేపడుతోంది. దీనిపై టీఎస్‌పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి ఇటీవలే సీఎం కేసీఆర్, సీఎస్ రాజీవ్‌శర్మలతో చర్చించారు. ప్రభుత్వానికి లేఖ కూడా రాశారు. రెండు మూడు రోజుల్లో ప్రభుత్వ ఆమోదం లభించే అవకాశాలుఉన్నట్లు తెలిసింది. ఆ వెంటనే టీఎస్‌పీఎస్సీ షెడ్యూల్‌ను ప్రకటించే అవకాశముంది. పాత సిలబస్ ప్రకారమే ఈ పరీక్షలు నిర్వహిస్తారు.
 
వివరాలు ఇవ్వాలని కోరిన టీఎస్‌పీఎస్సీ
2011 గ్రూప్-1 మెయిన్స్ నిర్వహణకు సంబంధించి విద్యార్థుల వివరాలు, దరఖాస్తులను తమకు అందజేయాలని ఏపీపీఎస్సీని టీఎస్‌పీఎస్సీ కోరింది. ఈ మేరకు ఏపీపీఎస్సీ చైర్మన్‌తో ఘంటా చక్రపాణి సమావేశమై.. పరీక్ష నిర్వహణకు సంబంధించిన అంశాలపై చర్చించారు. అర్హులైన అభ్యర్థులకు సంబంధించిన అన్ని రకాల డాక్యుమెంట్లు అందజేయాలని కోరారు. త్వరలోనే ఏపీపీఎస్సీ నుంచి వివరాలు వచ్చే అవకాశముంది.
 
నాలుగేళ్ల ఆందోళనకు తెర
ఈ పరీక్షలపై నాలుగేళ్లుగా అభ్యర్థుల్లో నెలకొన్న ఆందోళనకు త్వరలో తెరపడనుంది. 2011లో అప్పటి ఏపీపీఎస్సీ 312 గ్రూప్-1 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. 2012 మే 27న ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించింది. ఆ పరీక్షకు 1.70 లక్షలమంది హాజరయ్యారు. అనంతరం మెయిన్స్‌కు 1:50 నిష్పత్తి చొప్పున 15,600 మందిని ఎంపికచేశారు. అందులో 8,600 మంది మెయిన్స్ రాయగా.. వారిలోంచి మెరిట్ ప్రకారం 1:2 నిష్పత్తిన 606 మందికి ఇంటర్వ్యూలు నిర్వహించారు.

అయితే ఈ ప్రక్రియ సాగుతున్న సమయంలోనే ప్రిలిమ్స్ పరీక్ష ‘కీ’లో ఆరు తప్పులున్నట్లు అభ్యర్థులు అభ్యంతరాలు లేవనెత్తారు. వాటిపై ట్రిబ్యునల్, హైకోర్టు, చివరకు సుప్రీంకోర్టు వరకు వెళ్లారు. దాంతో ఆ ఆరు ప్రశ్నలను తొలగించి.. మిగతా మార్కులతో మెరిట్ జాబితా రూపొందించి, మెయిన్స్ పరీక్షలు, ఇంటర్వ్యూలు నిర్వహించాలని కోర్టు ఆదేశించింది. 144 ప్రశ్నలతో పునర్ మూల్యాంకనం చేయడంతో.. పలువురు అనర్హులుగా తేలగా, మరికొందరు అర్హులుగా మారారు. మొత్తంగా అభ్యర్ధుల సంఖ్య 16,966 కి పెరిగింది. అయితే అప్పట్లో మెయిన్స్ పరీక్షలకు హాజరైన, కొత్తగా అర్హత పొందిన వారికి మాత్రమే పరీక్ష నిర్వహిస్తారా, మొత్తంగా 16,966 మందికి పరీక్ష నిర్వహిస్తారా అన్నది తేలాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement