గడప దాటని చేతలు.. కోటలు దాటిన మాటలు

Turaga Nagabhushanam Article On Telugu States Politics - Sakshi

సందర్భం

ఎన్నికల్లో పాల్గొనే అధికారపక్షం పార్టీ తను ఇప్పటి వరకు చేసిన అభివృద్ధి, ప్రజాసంక్షేమ పనులు చెప్పుకుంటుంది. తనకు ఓటేయమని అభ్యర్ధిస్తుంది. కానీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో అధికార పార్టీల తీరు ఇందుకు విరుద్ధంగా ఉంది. తెదేపా నాయకుడు చంద్రబాబు, తెరాస నాయకుడు చంద్రశేఖరరావులు తాము చేసిన అభివృద్ధి పనులు చెప్పకుండా కేంద్ర ప్రభుత్వం, ప్రతిపక్షం కలసి తమను మోసం చేస్తున్నాయని ఆరోపిస్తూ ప్రచారం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి చెందనీయకుండా కేసీఆర్‌ అడ్డుకుంటున్నారని, పోలవరాన్ని అడ్డుకునేందుకు కేసులు వేస్తున్నారని, కేసీఆర్‌తో ఆంధ్రప్రదేశ్‌ ప్రతిపక్షనాయకుడు జగన్‌ కలిసి తెదేపాకు వ్యతిరేకంగా కుట్రలు పన్నుతున్నారని చంద్రబాబు మతిలేని విమర్శలు చేస్తున్నారు. అందులో ప్రధాని మోదీని కూడా చేర్చారు.
 
2018 తెలంగాణ ఎన్నికల్లో తెలంగాణలో సెంటిమెంట్‌ ఓటు పనిచేసింది. చంద్రబాబు, కాంగ్రెస్‌ల కూటమి ఇక్కడ పోటీచేసింది. ఆమరావతి నుంచి తెలంగాణలో పాలన జరుగుతుందని, ఆంధ్రులు తెలంగాణ ప్రాంతానికి ద్రోహం చేశారని ఆరోపిస్తూ కేసీఆర్‌ తెలంగాణలో  ప్రచారం చేశారు.  తాను చేసిన అభివృద్ధి పనులు ఆయన చెప్పలేదు. దాంతో తెలంగాణ ప్రజలంతా తెలంగాణను కాపాడుకోవాలనే కేసీఆర్‌ అసత్య ప్రచారాన్ని నమ్మి సెంటిమెంటుతో తెరాసను బలపరిచారు. అందువల్లే తెరాస అక్కడ గెలిచింది. 

ఇదేదారిలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ ప్రజల మధ్య చిచ్చుపెట్టి ఎన్నికల్లో లబ్ధి పొందాలని చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌ చూస్తున్నారు. సెంటిమెంట్‌ను ఉపయోగించుకోవాలని చూస్తున్నారు. అందుకే జగన్, తెరాస, భాజపా కలసి ఆంధ్రప్రదేశ్‌పై కుట్ర చేస్తున్నారని అసత్య ప్రచారం చేస్తున్నారు. హైదరాబాద్‌లో నివాసం ఉంటున్న ఈ ఇరువురు నాయకులు చెప్పేవన్నీ అబద్ధాలే. హైదరాబాద్‌లో ఉంటున్న ఆంధ్రులను తెలంగాణ ప్రజలు కొట్టారని, అవమానించారని ఆరోపించే పవన్‌కల్యాణ్‌ అలాంటి ఒక్క సంఘటనను చూపించగలరా? ఏదైనా పోలీస్‌స్టేషన్‌లో నమోదైన ఒక్క కేసు ఉదహరించగలరా? తెరాసతో పోరాడుతున్న భాజపా ఏ రకంగా తెరాస, వైఎస్‌ఆర్‌సీపీలతో కలిసిందని వీరు ఆరోపిస్తున్నారు. దీని వెనుక రుజువులు చూపించగలరా? 

చంద్రబాబు తను పాలించిన 2014 నుంచి 2019 వరకు అయిదేళ్లలో ఆంధ్రప్రదేశ్‌కు ఏమీ చేయలేదు. సుమారు 600లకు పైగా హామీలిచ్చి దేనిని సరిగా అమలుచేయలేదు. పరిష్కరించలేదు. కేంద్ర ప్రభుత్వం అమలుచేసిన పథకాలను తన కార్యకర్తలతో ఏర్పాటుచేసిన జన్మభూమి కమిటీల ఆదాయపు వనరులుగా మార్చివేశారు. అందినకాడికి దోచుకున్నారు. అంతేకాదు ఆయా పథకాల్లో తన స్టిక్కర్‌ వేసుకుని తను అమలుచేసినట్లు ప్రచారం చేసుకుంటున్నారు. చంద్రన్నబీమా, ఎన్టీఆర్‌ హౌసింగ్, కిసాన్‌ సమ్మాన్‌ యోజన ఇలా కేంద్రం అమలుచేసిన 126కు పైగా పథకాలన్నీ తను చేసినట్లే అబద్ధాలు చెుతున్నారు.
 
టీడీపీతో చేతులు కలిపి తెలంగాణలో చావుదెబ్బతిన్న కాంగ్రెస్‌ ఏపీలో కూడా కలిసి పోటీ చేస్తే జనం ఛీ కొడతారని గ్రహించి,  ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో విడివిడిగా పోటీ చేస్తున్నట్లు నటిస్తున్నాయి. ఏపీలో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చి, టీడీపీ విజయానికి దోహదపడాలని కాంగ్రెస్‌ నేతలు ప్రయత్నం చేస్తున్నారు. అందుకు కృతజ్ఞతగా చంద్రబాబు పలువురు సీనియర్‌ కాంగ్రెస్‌ నేతలను తమ పార్టీలో చేర్చుకొని వారికి లోక్‌సభ సీట్లు ఇస్తున్నారు. కోట్ల సూర్యప్రకాశరెడ్డి, పనబాక లక్ష్మి వంటి వారికి తెదేపా టికెట్‌ ఇవ్వడం అందులో భాగమే. తెలం గాణ అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్‌ అభ్యర్థులకు ప్రచార నిధులను సమకూర్చిన చంద్రబాబు ఇప్పుడు ఏపీలో తమకు వ్యతిరేకంగా పోటీ చేస్తున్న కాంగ్రెస్‌ అభ్యర్థులకూ అవసరమైన వనరులు సమకూర్చుతున్నట్లు ఆరోపణలు. పైగా కేసీఆర్, ఏపీలో జగన్‌కు ప్రచార నిధులు ఇచ్చారని ఆరోపిస్తున్నారు. 

రాష్ట్రంలోని అత్యధిక పార్లమెంటు స్థానాల్లో తమను గెలిపిస్తే కేంద్రంలో చక్రం తిప్పుతామని, ఢిల్లీ నుంచి అత్యధిక నిధులు తెస్తామని కేసీఆర్, చంద్రబాబు ప్రగల్భాలు పలుకుతున్నారు. కేంద్రం నుంచి రాబట్టిన నిధులతో ఇరు రాష్ట్రాల్లోని వెనుకబడిన ప్రాంతాల్లో ఏమాత్రం అభివృద్ధి సాధించారో చెప్పరు. ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాలు ఇప్పటికీ వెనుకబడిన ప్రాంతాలుగా కొనసాగడం వీరి వైఫల్యానికి నిదర్శనం కాదా? మోదీ అనేక విప్లవాత్మక నిర్ణయాలు తీసుకొని దేశ సర్వతోముఖాభివృద్ధికి పాటుపడుతున్నారు. అవినీతి రహిత పాలన, సంక్షేమ పథకాల అమలు, మౌలిక వసతుల పెంపు, పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ లాంటి కీలకమైన నిర్ణయాలు దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో దేశానికి మోదీ పాలన అవసరం ఎంతైనా ఉంది.


తురగా నాగభూషణం 
వ్యాసకర్త రాష్ట్ర ఉపాధ్యక్షులు, భారతీయ జనతాపార్టీ

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top