శత్రువు శత్రువు మిత్రుడేనా!

Pentapati Pullarao Article On Delhi Assembly Elections - Sakshi

విశ్లేషణ

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో త్రిముఖ పోరాటం జరుగుతోంది. మూడు పార్టీలూ బలంగానే ఉన్నాయి. ఈ మూడు పార్టీలకు మధ్య తీవ్రమైన వైరభావం ఉంది. వీటిలోనూ బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు అత్యంత శత్రుభావంతో ఉంటున్నాయి. ఇక కాంగ్రెస్, కేజ్రీవాల్‌కు ఒకరంటే ఒకరికి పడదు. కాగా.. బీజేపీ, కేజ్రీవాల్‌ మధ్య అంత వైరభావం లేదు. మరోవైపున ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే కాంగ్రెస్‌ పెద్దగా పట్టించుకోదు. అలాగే కాంగ్రెస్‌కు బదులుగా కేజ్రీవాల్‌ గెలిస్తే బీజేపీ పెద్దగా పట్టించుకోదు. అదే సమయంలో కేజ్రీవాల్, బీజేపీ ఇద్దరూ కలిసి ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలుపును అసలు కోరుకోవడం లేదు. కొన్నిసార్లు ఓటమి కూడా విజయాన్నే కలిగిస్తుంది. మీరు గెలవడం కంటే మీ బద్ధ శత్రువు ఓడిపోవడం ఇంకా మంచిదన్నమాట. శత్రువు శత్రువు మనకు మిత్రుడే అనే సూత్రం ఈ దఫా ఢిల్లీ ఎన్నికల్లో స్పష్టంగా ప్రతిఫలించనుంది.

ఢిల్లీ శాసనసభ ఎన్నికలు ఫిబ్రవరి 8న జరుగనున్నాయి. ఢిల్లీ చిన్న రాష్ట్రమే అయినా, దాని ప్రభావం చాలా పెద్దది. కేజ్రీవాల్‌ ఈ దఫా ఎన్నికల్లో ఓడిపోతే ఆయన భవిష్యత్తు ముగిసినట్లే. ఇక కాంగ్రెస్‌ పార్టీ ఢిల్లీ ఎన్నికల్లో గెలిస్తే, అప్పుడు ఆ పార్టీ 2021లో బీజేపీని నిలువరించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తుంది. ఎందుకంటే ఢిల్లీ దేశ రాజధానిని నియంత్రిస్తుంది, ప్రజలపై, వనరులపై, మానవ శక్తిపై అజమాయిషీ చేయడమే కాకుండా ప్రతిరోజూ మీడియాలో సోనియాగాంధీ కుటుంబానికి ప్రచారం కల్పిస్తుంది. కాగా ఢిల్లీలో గెలవడం బీజేపీకి పెద్ద విషయం ఏమీ కాదు. కానీ ఆప్‌ అధినేత కేజ్రీవాల్‌ తక్కువ మెజారిటీతో గెలిచి, కాంగ్రెస్‌ ఘోరంగా ఓడిపోతే బీజేపీకీ అది చాలా మంచిపరిణామం అవుతుంది. బీజేపీకి కాంగ్రెస్‌తోనే పెనుప్రమాదం ఉంది. ఢిల్లీలో కాంగ్రెస్‌ ఘోరపరాజయం పొందితే ఆ పార్టీ పని ముగిసినట్లేనని దేశవ్యాప్తంగా సందేశం పంపినట్లవుతుంది. కేజ్రీవాల్‌ మరో దఫా అధికారంలోకి వస్తే తాను కాంగ్రెస్‌కు పెద్ద అవరోధంగా మారతాడు కాబట్టి బీజేపీకి అది పెద్ద విషయమేమీ కాదు. పైగా బీజేపీకి ఢిల్లీలో బడా నేతలు ఎవరూ లేరు. అందుకే గత 21 ఏళ్లుగా అది ఢిల్లీలో పరాజయం పొందుతూనే వచ్చింది. నరేంద్రమోదీ ప్రతిష్ట వల్లే అది ఢిల్లీ పార్లమెంటు స్థానాల్లో గెలుపు సాధిస్తోంది.

మూడు ముక్కలాటలో గెలుపెవరిది?
ఏ. ఆప్‌ :  ప్రకటనలు, మీడియా కథనాలు, ప్రచారాన్ని చూస్తే కేజ్రీవాల్‌ ఢిల్లీ ఎన్నికల్లో గెలుపు సాధించడం తథ్యమని కనిపిస్తోంది. కేజ్రీవాల్‌ ఢిల్లీలో అనేక ప్రజాకర్షక పథకాలు అమలు చేశారు. ఉపాధి, మౌలిక వసతుల కల్పనను కేంద్రప్రభుత్వానికే వదిలేసిన కేజ్రీవాల్‌ నిరుద్యోగం, పోలీసుల అతి చర్యలు వంటి అంశాలపై కేంద్రంపైనే బాణాలు గుప్పిస్తూ వచ్చారు. పైగా మోదీ పంథాకు వ్యతిరేకత ప్రకటించడం ద్వారా మైనారిటీలను గెల్చుకోవడానికి తీవ్రంగా ప్రయత్నించారు. ఇది కొంతమేరకు ఫలించింది కానీ 2019 ఎంపీ ఎన్నికల తర్వాత మైనారిటీలు కాంగ్రెస్‌ పక్షం వహించారని గ్రహించిన కేజ్రీవాల్‌ తర్వాత మోదీపై దాడులు ఆపివేశారు. కేజ్రీవాల్‌ ఈ దఫా కూడా ఢిల్లీ ఎన్నికల్లో విజేత అవుతారని అంచనాలు ఉన్నప్పటికీ కాంగ్రెస్‌ పార్టీ గత సార్వత్రిక ఎన్నికల్లో సాధించిన 22 శాతం ఓట్లను ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో నిలుపుకుంటే కేజ్రీవాల్‌కు గెలుపు సాధించడం కష్టమవుతుంది.

బీ. కాంగ్రెస్‌ : ఢిల్లీలో బీజేపీ మాత్రమే పోటీలో ఉంటే కాంగ్రెస్‌ పార్టీ ఏ ఎన్నికల్లోనైనా బీజేపీని సులువుగా ఓడించగలదు. ఎందుకంటే కాంగ్రెస్‌ పార్టీకి 12 శాతం మైనారిటీల ఓట్లు ఉన్నాయి. పైగా బీజేపీ ఢిల్లీలోని అనేక వర్గాల ప్రజల హృదయాలను ఎప్పుడూ గెల్చుకోలేదు. కేజ్రీవాల్‌ రంగంలోకి వచ్చిన తర్వాతే బీజేపీ ఢిల్లీలోని ఎంపీ స్థానాలన్నింటినీ గెల్చుకోగలిగింది. ఎందుకంటే కేజ్రీవాల్‌ కాంగ్రెస్‌ పునాదిని కబళించేశారు. అయితే 2019 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ 22 శాతం ఓట్లు సాధించి కేజ్రీవాల్‌ను మూడోస్థానంలోకి నెట్టేయడంతో కాంగ్రెస్‌ మహదానంద పడింది. పైగా ఈ దఫా ఎన్నికల్లో కేజ్రీవాల్‌ ఓడిపోయి బీజేపీ గెల్చినట్లయితే కాంగ్రెస్‌ చాలా సంతోషిస్తుంది. ఎందుకంటే తన ఓటు బ్యాంకు తనకు దక్కుతుంది మరి. పైగా కేజ్రీవాల్‌ కనుమరుగవడం లేక నష్టపోవడం కాంగ్రెస్‌కు చాలా అవసరం.

సీ. బీజేపీ : ఢిల్లీని తాను గెల్చుకుంటానని బీజేపీ 1998 వరకు పూర్తి విశ్వాసంతో ఉండేది. కానీ జనాభా కూర్పులో మార్పులు, ఉత్తరప్రదేశ్, బీహార్, ఇతర ప్రాంతాలనుంచి ప్రజలు వలస రావడంతో బీజేపీ తన పునాదిని కోల్పోయింది. ప్రస్తుతం 70 మంది సభ్యులున్న ఢిల్లీ శాసనసభలో బీజేపీకి ముగ్గురు ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. అయితే 2019 లోక్‌సభ ఎన్నికల్లో తాను సాధించిన ఓటు షేరును కాంగ్రెస్‌ పార్టీ నిలబెట్టుకుంటే ఢిల్లీలో మెజారిటీ సాధించడం బీజేపీకి కష్టసాధ్యమే అవుతుంది. అలాంటి పరిస్థితిలో కేజ్రీవాల్‌ ఓటమి తప్పదు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఢిల్లీలో బీజేపీ 56 శాతం సాధిం చింది. కానీ అసెంబ్లీ ఎన్నికల్లో అంత శాతం ఓట్లు బీజేపీ ఎన్నడూ సాధించలేదు. పైగా అసెంబ్లీ ఎన్నికలు అంటే మోదీ ఎన్నికలు కాదు కదా!

తీవ్ర వైరభావం పర్యవసానం!
ఢిల్లీలో ఈసారి త్రిముఖ పోరాటం జరుగుతోంది. మూడు పార్టీలూ బలంగానే ఉన్నాయి. ఈ మూడు పార్టీలకు మధ్య తీవ్రమైన వైరభావం ఉంది. వీటిలోనూ బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు అత్యంత శత్రుభావంతో ఉంటున్నాయి. ఇక కాంగ్రెస్, కేజ్రీవాల్‌కు ఒకరంటే ఒకరికి పడదు. అయితే బీజేపీ, కేజ్రీవాల్‌ మధ్య అంత వైరభావం లేదు. మరోవైపున ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే కాంగ్రెస్‌ ఏమీ అనుకోదు. అలాగే కాంగ్రెస్‌కు బదులుగా కేజ్రీవాల్‌ గెలిస్తే బీజేపీ ఏమనుకోదు. అదే సమయంలో కేజ్రీవాల్, బీజేపీ ఇద్దరూ కలిసి ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలుపును అసలు కోరుకోవడం లేదు. మరోవైపున ఢిల్లీ సింహాసనం అపరూపమైనదిగా కాంగ్రెస్‌ పార్టీ భావిస్తోంది. కాంగ్రెస్‌ ఢిల్లీని గెల్చుకుంటే, తర్వాత ఆ పార్టీ యావద్దేశంపై అజమాయిషీ చేయడానికి నడుం కడుతుంది. 1998లో ఢిల్లీ సింహాసనాన్ని షీలా దీక్షిత్‌ గెల్చుకున్న తర్వాత మాత్రమే కాంగ్రెస్‌పార్టీ సోనియాగాంధీ నాయకత్వంలో పునరుజ్జీవం పొందడం ప్రారంభించింది. 

కాంగ్రెస్‌ పార్టీ ఇప్పుడు ఢిల్లీలో 12 శాతం మైనారిటీ ఓట్లపై, మరికొన్ని ప్రజాబృందాలపై పట్టు సాధించింది. మధ్యతరగతి ప్రజలు మాత్రం కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఉన్నారు. పైగా షీలాదీక్షిత్‌ లాగా అనేక తరగతుల ప్రజల హృదయాలను గెల్చుకోగలిగిన నాయకులు ఇప్పుడు కాంగ్రెస్‌లో లేరు. మరోవైపున కేజ్రీవాల్‌ గత అయిదేళ్లలో తాను చేసినట్లు భావిస్తున్న ‘మంచి పనుల’పై నమ్మకం పెట్టుకున్నారు. కానీ వివిధ తరగతుల ప్రజానీకాన్ని తాను దూరం చేసుకున్నారు. పథకాల పేరుతో కేజ్రీవాల్‌ అందించిన నజరానాలు ప్రజలం దరికీ కాకుండా ఆదాయం, కులం ప్రాతిపదికన అందించారు. దీంతో ప్రభుత్వం నుంచి ఎలాంటి లబ్ధీ పొందని వారు కేజ్రీవాల్‌ పట్ల సంతోషంగా లేరు. పైగా వీరే మెజారిటీగా ఉన్నారు. మళ్లీ కేజ్రీవాల్‌ అధికారంలోకి వస్తే తాను హామీ ఇచ్చిన పథకాల అమలుకు ప్రభుత్వ భవనాలను కూడా అమ్మివేసే ప్రమాదముందని వీరు భీతిల్లుతున్నారు. మరోవైపున బీజేపీ కేంద్రప్రభుత్వాన్ని నిర్వహిస్తోంది కానీ రాష్ట్ర స్థాయి నాయకత్వం దానికి తగినంతగా లేదు. పైగా బీజేపీకి ఢిల్లీలో గద్దె ఎక్కగలిగే స్థాయి నాయకులు లేరు. బీహార్‌–ఉత్తరప్రదేశ్‌ ప్రాంతాల నేతలకే అది ప్రాధాన్యత ఇస్తూవచ్చింది. అయితే వీరి సంఖ్య తగినంతగా లేదు.

బద్ధశత్రువు ఓడిపోవటం అంత మంచిదా?
బీజేపీ ముందు ఉన్న సవాళ్లు ఇవే. 1. బీజేపీ తొలి ఎంపిక ఢిల్లీలో అధికారం సాధించడమే. 2. తాను గెలవనిపక్షంలో ఢిల్లీ ఎన్నికల్లో కేజ్రీవాల్‌ గెలవాలని, కాంగ్రెస్‌ని అధికారంనుంచి దూరంగా పెట్టాలని కోరుకోవడమే. 3. కాంగ్రెస్‌ పార్టీ ఢిల్లీ ఎన్నికల్లో తన ఓటు షేరు పెంచుకుంటే బీజేపీకి దుష్పరిణామాలు తప్పవు. బీజేపీ విషయానికి వస్తే కేజ్రీవాల్‌ తక్కువ మెజారిటీతో గెలిస్తే తనకు మేలని భావి స్తోంది. అలాగైతేనే ఢిల్లీలో తన స్థాయిని ఆ పార్టీ మెరుగుపర్చుకుంటుంది. అలాకాకుండా కాంగ్రెస్‌ ఘనవిజయం సాధించి తన ఓటు షేరును మెరుగు పర్చుకున్నట్లయితే అప్పుడు బీజేపీకీ, నరేంద్రమోదీకి నిజమైన రాజకీయ పీడకల మొదలయినట్లే లెక్క. కాబట్టి తీవ్ర నష్టం కలిగించే విజయాలను గెలవడమెందుకు? కొన్నిసార్లు ఓటమి కూడా విజయాన్నే కలిగిస్తుంది. మీరు గెలవడం కంటే మీ బద్ధ శత్రువు ఓడిపోవడం ఇంకా మంచిదన్నమాట.

బీజేపీ నిజంగా తెలివిగా వ్యవహరించి ఉంటే దానికి శివసేన అతిపెద్ద శత్రువుగా మారి ఉండేది కాదు. ఢిల్లీ ఎన్నికల్లో కేజ్రీవాల్‌ గెల్చినట్లయితే బీజేపీ పెద్దగా కోల్పోయేది ఏదీ ఉండదు. కానీ కాంగ్రెస్‌ గెలిస్తే మాత్రం బీజేపీకి అది పిడుగుపాటే. ఇక బీజేపీ విషయానికి వస్తే ఢిల్లీ అనేది మహారాష్ట్ర కాదు. బీజేపీ ప్రధాన శత్రువు కాంగ్రెస్సే. కేజ్రీవాల్‌ ఢిల్లీకి మాత్రమే పరిమితం. అదే సమయంలో కేజ్రీవాల్‌ కాంగ్రెస్‌ పట్ల తీవ్రవిమర్శలు చేస్తున్నారు. రాజకీయ వైఫల్యాన్ని దృష్టిలో పెట్టుకుంటే, మహారాష్ట్రను ప్రస్తుతం ఏలుతున్న బద్ధశత్రువులను బీజేపీ తనకుతానుగా సృష్టించుకుంది. అయితే చిన్న శత్రువైన కేజ్రీవాల్‌ గెలిస్తే బీజేపీ సంతోషిస్తుంది. శత్రువు శత్రువు మిత్రుడే కదా!

పెంటపాటి పుల్లారావు
వ్యాసకర్త ప్రముఖ రాజకీయ విశ్లేషకులు

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top