జగన్‌ వెంటే సకల జనులూ

KSR Manasulo Maata With Actor Prudhvi Raj - Sakshi

కొమ్మినేని శ్రీనివాసరావుతో టాలీవుడ్‌ నటుడు పృథ్వీరాజ్‌

మనసులో మాట

మనకోసం ఎంత వీలైతే అంత సహాయం చేస్తానంటున్న లీడర్‌ పక్షానే నిలుద్దామన్న ప్రగాఢ కోరిక కాపు సమాజంలో ఉందని టాలీవుడ్‌ నటుడు పృథ్వీరాజ్‌ అంటున్నారు. ముద్రగడ ఒక్కరు జగన్‌ను వ్యతిరేకించడం అంటే కాపు సమాజం మొత్తం వ్యతిరేకిస్తోందని కాదనీ, జగన్‌ చంద్రబాబులా అబద్దాలు చెప్పే ఉంటే ఈ నాలుగేళ్లు తానే అధికారంలో ఉండేవారన్నారు. 16 సీట్లలో మాకు బలం ఉందనుకుంటే అగ్రతాంబూలం జగన్‌కే ఇస్తామని గోదావరి జిల్లాల కాపు సమాజం చెబుతోందని, ఈసారి బాబుకు కాపులు ఓట్లేయడం కల్లోమాటేనని చెప్పారు. కాపులే కాదు.. అన్ని కుల వృత్తుల వారు జగన్‌కే ఓటేస్తారు అని పండు ముదుసళ్లు సైతం చెబుతున్నారు. జనం నాడి అలాగే ఉందంటున్న పృథ్వీరాజ్‌ అభి్రప్రాయం ఆయన మాటల్లోనే...

థర్టీ ఇయర్స్‌ ఇండస్ట్రీ అనే పేరు మీకు ఎలా వచ్చింది?
కృష్ణవంశీ దర్శకత్వం వహించిన ఖడ్గం సినిమాలో పాత్ర అది. ఆ సినిమాలో నా పాత్రకు మొదట్లో డైలాగ్‌ సరిగా రాకపోవడంతో మొత్తం తిరిగి రాశారు. దాన్ని పలికే క్రమంలో ‘థర్టీ ఇయర్స్‌ ఇండస్ట్రీ అమ్మా ఇక్కడ’ అన్నాను. నా డైలాగ్‌ విరుపు చూసి ప్రొడక్షన్‌ వాళ్లు ఒకటే నవ్వడం చూశారాయన. వాళ్లు నవ్వుతున్నారంటే ఇక్కడేదో మ్యాజిక్‌ ఉంది. ఆ డైలాగ్‌ నువ్వు ఇలాగే చెప్పు. దాని డబ్బింగ్‌ కూడా నేను దగ్గరుండి ఇలాగే చెప్పిస్తాను అనేశారు. ‘ఆ లైట్‌ ఏంటి? ఏం మాకు తెలీదా.. థర్టీ ఇయర్స్‌ ఇండస్ట్రీ ఇక్కడ’ అనే మేనరిజంను తెలుగు సమాజంలో అందరూ తమ సొంతం చేసుకున్నారు. అంత పాపులర్‌ అయింది. పరిశ్రమలో నన్ను నిలబెట్టి బతుకునిచ్చినవారు ప్రభాకరరెడ్డి, రావుగోపాలరావు కాగా, ఉన్నదున్నట్లుగా మాట్లాడుతూ, నెత్తిమీద కొండ పడి ఈ క్షణంలో నువ్వు చచ్చిపోతావు అని చెప్పినా సరే.. రైట్‌ రాజా అంటూ ధీమాగా ఉండే వ్యక్తి పోసాని కృష్ణమురళి. బెసకడు, భయపడడు. తన చదువు, రాజకీయాలు, సినిమాలు తప్ప మరి దేంట్లోనూ జోక్యం చేసుకోడు.

జనసేన భవిష్యత్తు ఎలా ఉంటుంది?
జనసేన భవిష్యత్తు గురించి నేను చెప్పలేను కానీ వైఎస్సార్‌ సీపీ భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుంది. మండువేసవిలో రోహిణీ కార్తె సమయంలో ప్రజాసంకల్పయాత్ర 175వ రోజున వైఎస్‌ జగన్‌ని పాదయాత్ర సందర్భంగా కలిశాను. కొన్ని వేల కిలోమీటర్లు దూరం అలుపు లేకుండా నడుస్తూ జగన్‌ వెళుతుంటే పండు వృద్ధులు కలిసి నిన్ను చూసి వైఎస్‌ రాజశేఖరరెడ్డిని చూసినట్లే ఉంది. ఇక మేం చనిపోయినా చాలు అంటూ ఆయనతో మాట్లాడటాన్ని నేను స్వయంగా పాదయాత్రలో చూశాను. ఈ మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కడ ఎవరిని కలిసినా అందరూ అంటున్న మాట ఒకటే. ఈసారి సీఎం జగనే. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రభుత్వ వైఫల్యమే ఇన్ని లక్షలమందితో పాదయాత్ర. జగన్‌ పాదయాత్రకు వస్తున్న జనం ఎవరో మొబిలైజ్‌ చేస్తే వచ్చినవారు కాదు. బాహుబలి సినిమా తీస్తున్నాం.. భారీగా జనం కావాలి అంటే ఒక అయిదువేల మందినైనా తీసుకొస్తాం. కానీ పాదయాత్ర అలాంటిది కాదు. కొన్ని లక్షల మంది హృదయాల్లోనుంచి వస్తున్న ఆవేదన, బాధ ప్రతిరూపమే అది. రాజశేఖరరెడ్డి ఉన్నప్పుడు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వల్ల మా అక్క డాక్టర్‌ అయింది అని చెబుతున్నారు జనం. పాదయాత్రలో ఒక మహిళ నాతోనే అంది. అన్నా ఇప్పుడు మేం తెలుగుదేశం పార్టీ వాళ్లం అని రుజువులు చూపిస్తున్నప్పటికీ మాకు ముక్కి ముక్కి 35 వేల రూపాయలు మాత్రమే ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కింద ఇస్తున్నారు. ఇతరుల మాట చెప్పడానికే లేదు అంటూ సొంతపార్టీ వాళ్లే టీడీపీ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఏపీ పల్లెల్లో చంద్రబాబు ప్రభుత్వంపై మామూలు వ్యతిరేకత లేదు. నాలుగేళ్లు బీజేపీతో సంసారం చేసి ఇప్పుడు ధర్మపోరాటాల పేరిట అధర్మపోరాటాలు చేస్తున్నారు. కానీ నాలుగేళ్ల పాటు ప్రత్యేక హోదా కోసం తీవ్రంగా ప్రయత్నించిన ఏకైక వ్యక్తి వైఎస్‌ జగన్‌ మాత్రమే.

వైఎస్‌ జగన్‌తో మీకు పరిచయం ఎలా కలిగింది?
2014లో దూరం నుంచి ఆయన్ని చూసి నమస్కారం పెట్టాను. ఇప్పుడు పాదయాత్రలో నేరుగా కలిశాను. ఇప్పుడు బంధం మరింతగా పెరిగింది. పాదయాత్రలో కొన్ని లక్షలమందిలో ఆయన్ని చూస్తున్నాను. జనంతో ఆయన మాట్లాడటం, ఆ విధానం చూసి ఈయన ఇంత సింపుల్‌గా ఉన్నాడే అనిపించేది. లోటస్‌పాండ్‌లో ఇంటిలో కూర్చోబెట్టి, మజ్జిగ తాగుదువుగానీ రా అన్నా అని పిలిచాడు. అంతే.. ఓపిక ఉన్నంతవరకు నా ప్రయాణం జగన్‌తోటే అని నిర్ణయించుకున్నాను. వైఎస్సార్‌ లేనిలోటు జగన్‌ తీరుస్తున్నాడంటూ ఒక నాటకం కూడా రూపొందించాం. దాన్ని ఏపీలో ప్రదర్శిస్తాం.

చంద్రబాబుపై మీ అభిప్రాయం?
చంద్రబాబుది అపర చాణక్యుడి కోవ. ఒక మనిషిపై వ్యతిరేక అభిప్రాయాన్ని ఎప్పుడూ బయటకు చెప్పకుండానే లోపల సెగ పెడుతుంటాడు. బాబు గురించి ఇదే నాకు తెలుసు. పైగా కేంద్రంతో నాలుగేళ్లు అంట కాగి ఇప్పుడు మాత్రం కేంద్రంపై ధర్మపోరాటం అంటే కుదురుతుందా. జనం అసలు నమ్ముతారా?

బాబును, జగన్‌ని, పవన్‌ని... కాపు సమాజం ఎలా చూస్తోంది?
తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలను మొత్తంగా తిరిగేశాను. మనకోసం ఎంత వీలైతే అంత సహాయం చేస్తాను అంటున్న నాయకుడి పక్షానే నిలుద్దామన్న ప్రగాఢమైన కోరిక కాపు సమాజంలో ఉంది. ముద్రగడ ఒక్కరు జగన్‌ను వ్యతిరేకించడం అంటే కాపు సమాజం మొత్తం వ్యతిరేకిస్తోందని కాదు. అయితే జగన్‌ బాబులాగా అబద్ధాలు చెప్పే ఉంటే 2014 నుంచి ఇంతవరకు నాలుగేళ్లు ఆయనే అధికారంలో ఉండేవారు. 16 సీట్లలో మాకు బలం ఉందనుకుంటే అగ్రతాంబూలం జగన్‌కే ఇస్తామని కాపు సమాజం చెబుతోంది. ఇక బాబుపట్ల జనం పైకి నవ్వుతున్నా లోపల మాత్రం ఇప్పటికే నిర్ణయానికి వచ్చేశారు. ఈసారి బాబుకు కాపులు ఓట్లేయడం కల్లోమాటే. కాపులే కాదు ఎస్సీలు, బీసీలు, అన్ని కులవృత్తుల వారు జగన్‌కే ఓటేస్తామని పండు ముదుసళ్లు చెబుతున్నారు. జనం నాడి అలాగే ఉంది.

(ఇంటర్వ్యూ పూర్తి పాఠం కింది లింకుల్లో చూడండి)
https://bit.ly/2P1uanX
https://bit.ly/2P1erFD

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top