వ్రతం చెడినా ఫలం దక్కేనా?

K Ramchandramuethy Article On Congress And TDP Alliance - Sakshi

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు (కేసీఆర్‌) ఎన్నికలకు రంగం సిద్ధం చేశారు. అసెంబ్లీ రద్దుకు మంత్రివర్గం నిర్ణయించడం, గవర్నర్‌ కేంద్రానికి పంపించడం చకచకా జరిగిపోయాయి. రాజకీయ నిర్ణయాలు తీసు కోవడంలో కేసీఆర్‌ ప్రదర్శించే వేగం, తేజం తాజా నిర్ణయాలలో సైతం కళ్ళకు కట్టాయి. అన్ని మతాలకూ, కులాలకూ, వర్గాలకూ చెందినవారికి లబ్ధి చేకూర్చే విధంగా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామన్న ధైర్యంతో గడువుకు ఎనిమిది మాసాల 26 రోజులు ముందుగానే అసెంబ్లీని రద్దు చేశారు. ఒకే విడత 105 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించి చరిత్ర సృష్టించారు.

ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్‌ సైతం రంగంలో దిగి సమరసన్నాహాలు చేస్తున్నది. ఒక సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకుడు పార్టీ అధిష్ఠానవర్గానికి ప్రతిపాదిం చిన మూడు అంశాల సూత్రం ఇది:  1) ముఖ్యమంత్రి అభ్యర్థిని ముందుగానే ప్రకటించాలి 2)టీడీపీతో పొత్తు పెట్టుకోవాలి 3) ఎంఐఎంతో సఖ్యత కోసం అసదుద్దీన్‌తో సమాలోచనలు జరపాలి. మొదటి సూత్రం అమలు చేస్తే అసలుకే ముప్పు. ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటిస్తే ఆ పదవిని ఆశిస్తున్న అరడజనుకు తగ్గని ఇతర ముఖ్యనేతలు ఎన్నికలలో పార్టీ విజయం కోసం పని చేయకపోగా ముఖ్యమంత్రి అభ్యర్థిని ఓడించేందుకు శక్తి వంచన లేకుండా ప్రయత్నిస్తారు. ఈ సంగతి కాంగ్రెస్‌ అధిష్ఠానవర్గానికి తెలుసు. ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌తో మాట్లాడి ప్రయోజనం లేదు. కేసీఆర్‌తో అసద్‌ అనుబంధం బలమైనది.   ముస్లిం బాలబాలికలకోసం గురుకుల పాఠశాలలు నెలకొల్పడం, వారి ఉన్నత విద్యను ప్రోత్సహించడం, రిజర్వేషన్ల తీర్మానం అసెంబ్లీ చేత ఆమోదింపజేసి కేంద్రానికి పంపించడం వంటి కార్యక్రమాలు కేసీఆర్‌ చేశారు. వచ్చే ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రిగా మళ్లీ కేసీఆర్‌ కాబోతున్నారని అసద్‌ శనివారంనాడు నిర్ద్వంద్వంగా ప్రకటించారు. మూడు సూత్రాలలో మిగిలింది టీడీపీతో పొత్తు. అంతకంటే ముఖ్యంగా చంద్రబాబునాయుడితో వ్యవహారం.

టీడీపీతో పొత్తుకు కాంగ్రెస్‌ పార్టీ సిద్ధంగా ఉన్నదంటూ టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమకుమార్‌రెడ్డి ఏకపక్షంగా ప్రకటించారు. శనివారం చంద్రబాబు హైదరాబాద్‌కి రానే వచ్చారు. టీఆర్‌ఎస్‌లోకీ, కాంగ్రెస్‌లోకి గెంతినవారు పోగా మిగిలిన కొద్ది మంది నాయకులతో సుదీర్ఘ సమాలోచన జరిపి గంభీరోపన్యాసం ఇచ్చారు. కొరివితో తలగోక్కోవాలని కాంగ్రెస్‌ నాయకులు ఎందుకు ఉబలాట పడుతున్నారు? వారికి చంద్రబాబు పొత్తుల పురాణం తెలియదా? ఆయన నైజం అర్థం కాలేదా? ఆయనతో లోగడ పొత్తులు పెట్టుకొని భంగపడినవారికంటే తాము తెలివిగలవారమని అనుకుంటున్నారా? రాష్ట్ర విభజన అనంతరం కాంగ్రెస్‌ పార్టీనీ, సోనియాగాంధీని చంద్రబాబు తిట్టిన తిట్లన్నీ మరచి పోయారా? అన్నీ తెలిసే కపటనాటక సూత్రధారితో కరచాలనం చేయాలని కాంగ్రెస్‌ నేతలు నిర్ణయించుకున్నారా? హైదరాబాద్‌లో టీటీడీపీ సమావేశంలో మాట్లాడిన చంద్రబాబు నోట వెలువడిన తాజా అసత్యవాచకం అవధరించండి

‘నేను రాష్ట్రాన్ని విభజించమని కానీ వద్దని కానీ చెప్పలేదు.’ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు సమ్మతి ప్రకటిస్తూ ప్రణబ్‌కుమార్‌ముఖర్జీ కమిటీకి రెండు విడతల ఉత్తరాలు రాసింది ఎవరు? ‘విభజన బిల్లు శాసనసభలో మీరు ప్రవేశపెడతారా మమ్మల్ని ప్రవేశపెట్టమంటారా’ అంటూ కాంగ్రెస్‌ని దబాయించింది ఎవరు? చంద్రబాబు కాదా? ఏదో ఒక విధంగా టీఆర్‌ఎస్‌ని ఓడించి అధికారంలోకి రావా లని తెలంగాణ కాంగ్రెస్‌ నాయకుల తపన. ఏమైనా సరే జాతీయ స్థాయిలో మోదీని వదిలించుకోవడానికి కూటమి ఏర్పాటు చేయాలనీ, అందులో టీడీపీ భాగస్వామి కావాలనీ కాంగ్రెస్‌ అధిష్ఠానం తాపత్రయం. ఇది సకారాత్మకమైన రాజకీయం కాదు. ఆరోగ్యపరమైనదీ కాదు. పవిత్రమైనది అసలే కాదు. ప్రజలకు మేలు చేసిది అంతకన్నా కాదు. ఇక్కడ మార్గం ముఖ్యం కాదు, లక్ష్యం ప్రధానం.

అస్థిరతకు బాటలు
దేశ చరిత్రలో కేంద్రంలో అస్థిర ప్రభుత్వాలు ఏర్పడిన గడ్డుకాలంలో చక్రం తిప్పింది టీడీపీ అధినేతలనే వాస్తవాన్ని విస్మరించకూడదు. ఎన్టీఆర్‌ ‘తెలుగు దేశం పార్టీ’ని స్థాపించిన తొమ్మిది మాసాలలోనే ప్రభంజనం సృష్టించి కాంగ్రెస్‌ను కూకటివేళ్ళతో పెకిలించి చరిత్రలో శాశ్వత స్థానం సంపాదించారు.  కాంగ్రెస్‌వారిని  కుక్కమూతి పిందెలని అవహేళన చేసేవారు. దాన్ని భూస్థాపితం చేయడం టీడీపీ ఏకైక లక్ష్యమంటూ ప్రకటించేవారు. కాంగ్రెస్‌ ఆధిపత్యాన్ని సవాలు చేసేందుకు విజయవాడలో ప్రతిపక్ష సదస్సు నిర్వహించారు. అది 1988లో నేషనల్‌ఫ్రంట్‌ ఆవిర్భావానికి దారితీసింది. రాజీవ్‌గాంధీ ప్రభుత్వంలో రక్షణమంత్రిగా ఉన్న విశ్వనాథ్‌ ప్రతాప్‌సింగ్‌ బోఫోర్స్‌ శతఘ్నుల కొనుగోలులో కుంభకోణం జరిగిందని ఆరోపిస్తూ పదవికి రాజీనామా చేశారు. కాంగ్రెస్‌ నుంచి నిష్క్రమించి ‘జన్‌మోర్చా’ను  నెలకొల్పారు. దాన్ని జనతాదళ్‌లో విలీనం చేశారు. రాజీవ్‌గాంధీని ఓడించాలన్న ఏకైక లక్ష్యంతో ఆయన 1989 ఎన్నికలలో రెండు పరస్పర విరుద్ధమైన పార్టీలతో–బీజేపీతోనూ, వామపక్షాలతోనూ పొత్తు పెట్టుకున్నారు.  నేషనల్‌ఫ్రంట్‌ అధ్యక్షుడుగా ఎన్టీఆర్‌ భాగస్వామ్యపక్ష నేతలతో సమాలోచనలు జరిపి విపి సింగ్‌ను ప్రధాని చేయాలని నిర్ణయించారు. ప్రధా నిగా ప్రమాణం చేసినప్పటి నుంచి విపి సింగ్‌ కుర్చీ కాపాడుకునేందుకే సర్వ శక్తులూ వినియోగించవలసి వచ్చింది.

బీజేపీ అనుసరించిన హిందూత్వ విధానాలకు విరుగుడుగా మండల్‌ కమిషన్‌ సిఫార్సులను అమలు చేయాలని విపి సింగ్‌ నిర్ణయించారు. ఇందుకు ప్రతిగా బీజేపీ నేత అడ్వాణీ సోమనాథ్‌ మందిరం నుంచి అయోధ్యకు రథయాత్ర ఆరంభించారు. రథం బిహార్‌లోని సమస్తిపూర్‌ చేరగానే అడ్వాణీని లాలూప్రసాద్‌ ప్రభుత్వం అరెస్టు చేసింది. ఇందుకు నిరసనగా విపి సింగ్‌ ప్రభు త్వానికి బీజేపీ మద్దతు ఉపసంహరించుకున్నది. జనతాదళ్‌ నుంచి దేవీలాల్, చంద్రశేఖర్‌ 64 మంది ఎంపీలతో నిష్క్రమించి సమాజవాదీ జనతాదళ్‌ (రాష్ట్రీయ)ను నెలకొల్పారు. లోక్‌సభలో విశ్వాసతీర్మానం వీడిపోవడంతో విపి సింగ్‌ రాజీనామా చేశారు. ఆ తర్వాత కాంగ్రెస్‌ మద్దతుతో చంద్రశేఖర్‌ ప్రధానిగా ప్రమాణం చేశారు.

ఆరు మాసాలు తిరగకుండానే చంద్రశేఖర్‌ ప్రభుత్వానికి కాంగ్రెస్‌ మద్దతు ఉపసంహరించుకున్నది. ఆపద్ధర్మ ప్రధానిగా చంద్రశేఖర్‌ 1991లో ఎన్నికలు జరిగి పీవీ నరసింహారావు ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించేవరకూ కొనసాగారు. విపి సింగ్, చంద్రశేఖర్‌ల హయాంలో దేశ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా దెబ్బతిన్నది. లండన్‌ బ్యాంకులో బంగారం కుదువపెట్టిన అప ఖ్యాతి చంద్రశేఖర్‌కు దక్కింది. విపి సింగ్‌ హయాంలో కశ్మీర్‌ లోయనుంచి 90 వేలమంది పండిట్‌లు ప్రాణాలు చేతపట్టుకొని వలస వెళ్ళి స్వదేశంలోనే శర ణార్థులుగా శిబిరాలలో తలదాచుకున్నారు. మామగారిని గద్దె దింపి అధికారం హస్తగతం చేసుకున్న చంద్రబాబు కూడా జాతీయ స్థాయిలో యునైటెడ్‌ఫ్రంట్‌కు కన్వీనర్‌గా వ్యవహరించి రెండు అల్పాయుష్షు ప్రభుత్వాలకు పురుడు పోశారు. 1996 నాటి ఎన్నికలలో కాంగ్రెస్‌ పరాజయం చెందింది. అతి పెద్ద పార్టీగా కాంగ్రెస్‌ ఆధిక్యం సంపాదించినప్పటికీ ఎన్నికల తీర్పు కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా వచ్చిందనే ఉద్దేశంతో పీవీ ప్రభుత్వం ఏర్పాటుకు ప్రయత్నించలేదు.

రెండవ అతిపెద్ద పార్టీ అయిన బీజేపీ నేత అటల్‌ బిహారీ వాజపేయి ఏర్పాటు చేసిన ప్రభుత్వం 13 రోజులలో కుదేలయింది. అప్పుడు చక్రం తిప్పే అవకాశం చంద్రబాబుకి వచ్చింది. యునైటెడ్‌ఫ్రంట్‌  కన్వీ నర్‌గా దేవెగౌడనూ, ఐకె గుజ్రాల్‌నూ ప్రధానమంత్రులుగా చేయడంతో ఆయన పాత్ర లేకపోలేదు. కానీ ఆయనది నిర్ణాయక పాత్ర కాదు. సీపీఎం నేత హరి కిషన్‌సింగ్‌ సూర్జీత్‌ సంకీర్ణ ప్రభుత్వాల సృష్టికర్త. yì ఎంకె అధినేత కరుణానిధి సంధానకర్త. చంద్రబాబు యువకుడు కనుక సీనియర్‌ నాయకుల మధ్య సమన్వ యకర్తగా పని చేశారు. ఇద్దరు ప్రధానులూ కలసి రెండు సంవత్సరాలు కూడా ప్రభుత్వం నడిపించలేకపోయారు. నాటి కాంగ్రెస్‌ అధ్యక్షుడు సీతారాం కేసరి రెండు ప్రభుత్వాలకూ కాంగ్రెస్‌ మద్దతు ఉపసంహరించి అనిశ్చితికీ, అస్థిరతకూ దారి తీశారు. గుజ్రాల్‌ ప్రభుత్వం పతనమైన సమయంలోనే ప్రణబ్‌ముఖర్జీ, గులాంనబీ ఆజాద్, తదితరులు కేసరి చేతి నుంచి కాంగ్రెస్‌ పగ్గాలను లాగివేసి సోనియాగాంధీ చేతిలో పెట్టారు. నకారాత్మక రాజకీయం, అపవిత్ర పొత్తుల కారణంగానే దేశానికి అరిష్టం దాపురించింది.  హానికరమైన ఈ ధోరణికి ప్రతీక చంద్రబాబు.

పొత్తుల వీరుడు
దుస్తులు మార్చినట్టు భాగస్వాములను మార్చివేయడం చంద్రబాబుకు బాగా తెలిసిన విద్య. 1995లో అధికారంలోకి వచ్చిన తర్వాత  జరిగిన లోక్‌సభ (1996) ఎన్నికలలో టీడీపీ సీపీఐ, సీపీఎంలతో పొత్తు పెట్టుకున్నది. ఎన్నికలు జరిగిన తర్వాత కమ్యూనిజం కంటే టూరిజం ముఖ్యమంటూ కమ్యూనిస్టు నాయకులను ఎద్దేవా చేయడం ఆరంభించారు. 1998లోనూ వామపక్షాలతో ప్రయాణం కొనసాగించారు. కానీ ఎన్నికలు కాగానే వామపక్షాలకు గుడ్‌బై చెప్పి యునైటెడ్‌ఫ్రంట్‌ నుంచి నిష్క్రమించి వాజపేయి ప్రభుత్వానికి మద్దతు ఇచ్చారు. 1999లో బీజేపీతో పొత్తు పెట్టుకొని కార్గిల్‌ విజయం ఫలితంగా పెరిగిన వాజపేయి ప్రతిష్ఠ సహకారంలో అసెంబ్లీ ఎన్నికలలో గెలుపొంది అధికారంలో కొనసాగారు. 2002లో గుజరాత్‌లో మారణకాండ జరిగినప్పుడు నరేంద్ర మోదీని ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించాలంటూ తాను చేసిన సిఫార్సును వాజపేయి అమలు చేయనప్పటికీ మద్దతు ఉపసంహరించుకోలేదు. అలిపిరిలో నక్సలైట్ల దాడిలో ప్రాణాలతో బయటపడిన తన పట్ల ప్రజలలో సానుభూతి వెల్లువెత్తిందని భావించి ముందస్తు ఎన్నికలకు సిద్ధమై లోక్‌సభకు కూడా గడువుకంటే ముందు ఎన్నికలు జరిపించేందుకు వాజపేయిని ఒప్పించారు. 2004 ఎన్నికలలో బీజేపీ, టీడీపీ కూటమి ఓడిపోయిన వెంటనే బీజేపీతో పొత్తు పెట్టు కోవడం తప్పిదమని చెబుతూ జీవితంలో మళ్ళీ ఆ పార్టీతో పొత్తు పెట్టు కోనంటూ చంద్రబాబు ప్రతిజ్ఞ చేశారు.

1998లో తిరస్కరించిన వామపక్షాలను 2009లో చేరదీశారు. టీఆర్‌ఎస్‌ని కూడా మహాకూటమిలో చేర్చుకున్నారు. ఫలితాలు వెల్లడైన వెనువెంటనే టీఆర్‌ఎస్‌తో పొత్తు పెట్టుకోవడం వల్లనే అనర్థం జరిగిందని అన్నారు. 2014లో తిరిగి బీజేపీతో కలసి ఎన్నికలలో పోరాడటమే కాకుండా కేంద్రంలో ఎన్‌డీఏ సర్కార్‌లో ఇద్దరు టీడీపీ మంత్రులను చేర్పించి, ఆంధ్రప్రదేశ్‌లోనూ ఇద్దరు బీజేపీ మంత్రులను చేర్చుకున్నారు. నాలుగున్నరేళ్ళు అంటకాగిన తర్వాత ఎన్‌డీఏ నుంచి తప్పుకున్నారు. నిరుడు విశాఖపట్టణంలో మహానాడు జరిగి నప్పుడు చంద్రబాబు చైనా నాయకుడు డెంగ్‌ను ఉటంకిస్తూ పిల్లి నల్లదా, తెల్లదా అన్నది ముఖ్యం కాదనీ, ఎలుకలు పట్టేది అయితే చాలుననీ చెప్పారు. రాజ కీయాలలో విలువలకు కాలం చెల్లిందనీ, విధానాలతో నిమిత్తం లేకుండా మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా వ్యూహాలను మార్చుకుంటూ పోవాలని ఉద్ఘాటించారు.

ఓట్లు బదిలీ అయ్యేనా?  
మహాకూటమిలో టీడీపీని చేర్చుకుంటే టీఆర్‌ఎస్‌ని ఓడించవచ్చుననే కాంగ్రెస్‌ అంచనా తప్పు. టీడీపీకి 12 లేదా 15, టీజెఎస్‌కు 5 లేదా 6, సీపీఐకి నాలుగు సీట్లు విడిచిపెట్టాలని కాంగ్రెస్‌ తలపోస్తున్నట్టు భోగట్టా. హైదరాబాద్‌ పాత బస్తీలో సుమారు పది స్థానాలవైపు కాంగ్రెస్‌ తేరిపార చూసే పరిస్థితి లేదు. మిగిలిన 84 స్థానాలలో కనీసం 50 స్థానాలు గెలుచుకుంటేనే మిత్రులతో కలిసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం కాంగ్రెస్‌ పార్టీకి ఉంటుంది. అంటే, పోటీ చేసే స్థానాలలో సుమారు 70 శాతం స్థానాలను కాంగ్రెస్‌ గెలుచుకోవాలి. అటువంటి అవకాశం ఉన్నదా? ఉంటే అన్ని స్థానాలకూ కాంగ్రెస్‌ అభ్యర్థులను నిలబెట్టవచ్చు. మూడున్నర దశాబ్దాలుగా టీడీపీకి వ్యతిరేకంగా ఓటు చేస్తున్న కాంగ్రెస్‌ ఓటర్లు టీడీపీ అభ్యర్థులకు ఓటు వేయరు. అదే విధంగా కాంగ్రెస్‌ని మట్టికరిపించడమే ధ్యేయంగా ఓటు చేస్తున్న టీడీపీ ఓటర్లు కాంగ్రెస్‌ అభ్యర్థుల విజయానికి దోహదం చేయరు. టీడీపీతో పొత్తు పెట్టుకొని కాంగ్రెస్‌ వ్రతం చెడినా ఫలం దక్కదు. తెలంగాణలో కాంగ్రెస్‌–టీడీపీ కూటమి విఫలమైతే ఆంధ్ర ప్రదేశ్‌లో చంద్రబాబు కాంగ్రెస్‌ని దగ్గరికి రానీయరని చెప్పడానికి గొప్ప తెలివి తేటలు అక్కర లేదు. అవకాశవాద, నకారాత్మక రాజకీయాల కంటే కాంగ్రెస్‌ ఒంటరిగా టీఆర్‌ఎస్‌తో తలబడితే అమీతుమీ తేల్చుకోవచ్చు. గెలిచినా, ఓడినా గౌరవప్రదంగా ఉంటుంది.

త్రికాలమ్‌
కె. రామచంద్రమూర్తి

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top