విజయ ద్వయం

విజయ ద్వయం - Sakshi


వివరం

 

ఒకరు మెరుపులా మెరిస్తే... మరొకరు ఉరుములా గర్జిస్తారు. ఒకరు అగ్నిలా విస్తరిస్తే... మరొకరు వాయువులా తోడవుతారు. ఒకరు అర్జునుడిలాంటి వారైతే... మరొకరు కృష్ణుడిలా మార్గదర్శి అవుతారు. సహచరుల్లా సాగుతారు. విజయద్వయంగా నిలుస్తారు. విజయానికే కొత్త గ్లామర్‌ను తీసుకొస్తారు. ఒక్కడే నిలిచి గెలిస్తే ఆ విజయంలో శ్రమ, కష్టం ఉంటుంది. జంటగా సాధించే విజయంలో ప్రణాళిక అదనం. అందుకే జతగా సాధించే విజయానికి ప్రత్యేక గుర్తింపు.  విజయంలో వాటాదారు ఉన్నా... పంచుకొనే ఆ ఆనందం సంపూర్ణం అవుతుంది.

 

‘మంచివన్నీ జతగా వస్తాయి...’ అనేది చైనీస్ సామెత. అందుకు తగ్గట్టుగా కొంతమంది జత కలిశాక మంచి జరుగుతుంది. వారు జతగానే అద్భుతాలు సాధించగలుగుతారు. రాజకీయ, సామాజిక, ఆర్థిక, క్రీడా రంగాల్లో కొన్ని కాంబినేషన్‌లు, కంబైన్డ్ విక్టరీలు ప్రత్యేకమైనవి. ఇతిహాసాల దగ్గర నుంచీ ఇద్దరి శక్తికి తిరుగేలేదు. కృష్ణార్జునుల నుంచి ఎన్నో విజయవంతమైన జోడీలున్నాయి. చరిత్రను తవ్వితీస్తే ఇలాంటి ద్వయాలు ఎన్నో కనిపిస్తాయి... అవి వర్తమానంలోనూ ఉన్నాయి. ఆ వివరాలు ఈవారం ‘వివరంలో’.

 

ప్రస్తుతం ఈ జంటగాలి వీస్తోంది!2014 ఎన్నికల్లో గ్రాండ్ విక్టరీని సాధించిన భారతీయ జనతా పార్టీకి నరేంద్రమోదీ కెప్టెన్ అయితే.. సంచలన విజయం సాధించిన ఈ జట్టు తరపున ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ దక్కేది అమిత్ షాకు. గుజరాత్ నుంచి మోదీతో పాటు జాతీయ రాజకీయాలవైపు వచ్చిన షా మోడీకి నీడ అనే పేరు పొందాడు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ జాతీయాధ్యక్షుడిగా మోదీకి సరిజోడీగా పేరు తెచ్చుకొన్నాడు. ఉత్తరప్రదేశ్ భారతీయ జనతా పార్టీ రాజకీయ వ్యవహారాల ఇన్‌చార్జిగా ఉన్న షా అక్కడ మోదీ ప్రణాళికను అమలు పెట్టాడనే పేరును సంపాదించాడు. వీరి అనుబంధం అయితే ఇప్పటిది కాదు. 1997 నుంచి వరసగా అహ్మదాబాద్‌లోని సుర్‌ఖేజ్ నియోజకవర్గం నుంచి విజయం సాధిస్తూ వస్తున్న షా 2002లో మోదీ గుజరాత్ ముఖ్యమంత్రి అయ్యాకా ఆయన క్యాబినెట్‌లో యంగెస్ట్ మినిస్టర్‌గా స్థానం సంపాదించాడు. ఆ తర్వాత మోదీ గుజరాత్ సీఎంగా ఉన్న 12 సంవత్సరాల పాటూ షా మోదీకి అత్యంత సన్నిహితుడని పేరు తెచ్చుకొన్నాడు. ఒక దశలో గుజరాత్ హోమ్ మినిస్టర్‌గా ఉంటూ ఏకంగా 12 పోర్ట్‌ఫోలియోల బాధ్యతలను చూశారంటే షాపై మోదీ ఎంతగా ఆధారపడ్డారో అర్థం చేసుకోవచ్చు. కేవలం మోదీ విజయాల్లో మాత్రమే కాదు.. వివాదాల్లో కూడా షా పేరు మార్మోగింది. విశేషం ఏమిటంటే.. వీళ్లు ఇన్ని సంవత్సరాలుగా జోడీగా  సాధించిన విజయాలు ఒక ఎత్తు అయితే  ఇకపై వీరి ప్రస్థానం మరింత ఆసక్తికరమైనది. ప్రధానమంత్రి హోదాలో నరేంద్రమోదీ, పార్టీ అధ్యక్షుడి హోదాలో అమిత్ షా ఉంటూ ఎలాంటి విజయాలు సాధిస్తారు? పార్టీ ప్రస్థానాన్ని ఎక్కడి వరకూ తీసుకెళ్తారు? ఈ హోదాల్లోకి చేరిన తర్వాత కూడా వీరిది ప్రస్తుతానికి అభేద్యమైన జోడీనే. అందుకు ఇటీవలి హర్యానా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ సాధించిన విజయమే రుజువు.

 

యాపిల్ వెనుక స్టీవ్స్...ఈ ప్రపంచంలో ‘ఐ ఫోన్’ వినియోగదారులు అనే ప్రత్యేక జాతిని సృష్టించిన ఘనత వీరిద్దరిది. ఐ ఫోన్ అంటే ఒక స్టేటస్... యాపిల్ డివైజ్ చేతిలో ఉంటే అదొక గ్లామర్. ఇలాంటి ఒక గ్లామరస్ వరల్డ్‌ను సృష్టించిన వారు స్టీవ్ జాబ్స్, స్టీవ్ వోజ్నియక్. వీళ్లిద్దరి పేర్లూ స్టీవ్ అంటూ స్టార్ట్ కావడం బహుశా యాదృచ్ఛికమేనేమో! స్టీవ్ జాబ్స్ విజన్, వోజ్నియక్ సాంకేతిక పరిజ్ఞానం ఈ రెండూ మిళితం కావడమే యాపిల్ కంపెనీ నిలదొక్కుకోవడానికి, సంచలనంగా మారడానికి కారణం అని చెప్పవచ్చు. ఆలోచన జాబ్స్‌ది, ఆ ఆలోచన కార్యరూపం దాల్చడానికి అవసరమైన సాంకేతిక ప్రోగ్రామింగ్ వోజ్నియక్‌ది. వీళ్ల పరిచయం హై స్కూల్ దశలో జరిగిందట. సమ్మర్ లో హెచ్‌పీ కంపెనీలో జాబ్ చేసే సమయంలో జాబ్స్ పరిచయం అయ్యాడని వోజ్నియక్ చెబుతాడు. 1976లో ఇద్దరు స్టీవ్స్ ఆధ్వర్యంలో యాపిల్ కంపెనీ ప్రస్థానం మొదలైంది. కంప్యూటర్స్, స్మార్ట్‌ఫోన్స్ రంగంలో సంచలనం సృష్టించింది. వీరి జోడీ పనితీరు చాలా ఆసక్తికరమైనది. తను మేనేజ్‌మెంట్ టెక్నిక్స్ విషయంలో వీక్ అని చెబుతాడు వోజ్నియక్. తను టెకీగా కెరీర్‌ను ఆస్వాదించగలనని ఈయన చెబుతాడు. అందుకు తగ్గట్టుగా విజనరీ బాధ్యతలన్నింటినీ జాబ్స్‌కు అప్పజెప్పాడు. అయితే ప్రస్తుతం జాబ్స్ భౌతికంగా దూరం అయ్యాడు. మరొకరిని జాబ్స్ స్థానంలో అపాయింట్ చేసి వోజ్నియక్ యాపిల్ స్థాయిని కొనసాగిస్తున్నాడు. అలాగే జాబ్స్‌తో తన కో ఆర్డినేషన్ గురించి ఆసక్తికరమైన విషయాలు చెబుతాడు వోజ్నియక్. జాబ్స్‌తో పనిచేయడం అంత సులభం కాదని అంటాడు. జాబ్స్ చాలా టెంపర్‌గా ఉంటాడని... అసలు ఎవరూ జాబ్స్‌లాంటి వ్యక్తితో కలిసి పనిచేయాలని కోరుకోరు...అనేది వోజ్నియక్ మాట. తమ మధ్య అనేక సార్లు ఘర్షణాత్మక పరిస్థితులు తలెత్తాయని వోజ్నియక్ వివరిస్తాడు. కోపతాపాలు అన్నీ పని విషయంలోనే కాబట్టి తమ స్నేహానికి ఎలాంటి ఇబ్బందీ రాలేదని వోజ్నియక్ అంటాడు.

 

భిన్న స్వరాలు.. ఒకటే ట్యూన్‘ఒకరి అభిప్రాయాలకు మరొకరు గౌరవం ఇస్తూ, ఇద్దరూ కలిసి దేనికోసం పనిచేస్తున్నామో అర్థం చేసుకొని లక్ష్యం దిశగా సాగితే కలిసి పనిచేయడం సులభతరం అవుతుంది..’ అని అంటాడు విశాల్ దద్లానీ. ఈ పేరు చెబితే ఈయనఎవరో గుర్తు పట్టడం కష్టం. అయితే విశాల్-శేఖర్‌ల ద్వయంలో ఒకరు అని అంటే మాత్రం విశాల్, వాళ్ల పాటలు గుర్తుకు వస్తాయి. దాదాపు పదిహేను సంవత్సరాల నుంచి విశాల్-శేఖర్‌లు కలిసి స్వరాలు సమకూరుస్తున్నారు. వీరి కాంబినేషన్‌లో ‘ఓం శాంతి ఓం’ ‘చెన్నై ఎక్స్‌ప్రెస్’ వంటి సూపర్‌హిట్ ఆల్బమ్స్ వచ్చాయి. ఈ ద్వయం తెలుగులో కూడా  ‘చింతకాయల రవి’ వంటి సినిమాకు స్వరాలు అందించింది. వీరిలో విశాల్‌కు శాస్త్రీయ సంగీతంపై అవగాహన ఉంది. అయితే శేఖర్‌కు క్లాసికల్ మ్యూజిక్ గురించి తెలియదు. ఇంత వ్యత్యాసాలు ఉన్నా ఈ జోడీ కొనసాగుతోంది... భిన్న స్వరాలు కలిసి ఒకటే ట్యూన్ వినిపిస్తోంటే వీరి సంగీత సమన్వయం గొప్పదే కదా! సినీ సంగీత దర్శకత్వం విషయంలో ఇంకా చాలా జోడీలున్నాయి. రాజన్-నాగేంద్ర, రాజ్ -కోటీ, లక్ష్మికాంత్-ప్యారేలాల్ వంటి జంట స్వరాలెన్నో ఉన్నాయి.

 

వాదనే ఒక విజయ రహస్యం!విజయవంతమైన జోడీలు అంటే అందులోని వారిద్దరూ ఒకరితో ఒకరు చాలా సౌమ్యంగా ఉంటారని చెప్పడానికేం లేదు. వారి మధ్య స్పర్థలు, వాదనలూ కూడా చాలా చాలా రొటీనే. ఇలాంటి వాదనలే తమ విజయరహస్యాలు అని అంటారు ల్యారీపేజ్, సెర్గేబ్రిన్‌లు. స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీలో పీహెచ్‌డీ చేసే సమయంలో వీరిద్దరూ ఒకరికి ఒకరు పరిచయం. ఆ పరిచయం వీరి చేత భూగ్రహం మీదున్న అతిపెద్ద టెక్నాలజీ ఫర్మ్‌ను సృష్టించేందుకు దారి తీసింది. సెర్చింజన్ ఆలోచన వచ్చినప్పటి నుంచి దాన్ని మొదలు పెట్టడం గురించి రోజులు, నెలల తరబడి ఒకటే చర్చలు అట. ప్రపంచానికి గూగుల్ అనే గిఫ్ట్‌ను ప్రెజెంట్ చేయడానికి వీళ్ల మధ్య జరిగిన ఆ చర్చలు వాదనలకు దారి తీశాయి. స్పర్థలు కలిగాయి. అయితేనేం ఆ మథనం నుంచి గూగుల్ పుట్టింది, యూట్యూబ్ వెలసింది. ఇప్పటికీ ల్యారీ, బ్రిన్‌లు కలిశారంటే సరదా కబుర్లు, క్షేమ సమాచారాలు ఉండవు. టెక్ ప్రపంచంలో పోటీని ఎలా తట్టుకోవాలి.. గూగుల్‌ను ఇంకా ఎలాంటి రంగాల్లోకి చొచ్చుకుపోయేలా చేయాలి.. అనే అంశం గురించి వాడీవేడీ చర్చలే!

 

సక్సెస్‌కు మారు పేర్లు... సలీమ్-జావేద్!సలీమ్‌ఖాన్- జావేద్ అక్తర్. సినిమా స్క్రిప్ట్ రైటర్ల పేర్లు పోస్టర్ మీద ప్రచురించడం మొదలైంది వీరి వల్లనే. స్క్రీన్‌ప్లే, డైలాగ్ రైటర్‌లకు హీరో, దర్శకులతో సమానమైన క్రేజ్‌ను తెచ్చిపెట్టింది ఈ ద్వయం. మొత్తం 12 సంవత్సరాల పాటు కలిసి పనిచేశారు. 24 సినిమాలకు రచన బాధ్యతలు నిర్వర్తించారు. ఆ తర్వాత ఇగో సమస్యతో ఇద్దరూ ఎవరికి వారు అయ్యారు. అయితే సలీమ్-జావేద్ ల కాంబినేషన్ ఇప్పుడు కూడా కాసుల పంట పండిస్తుంది. ఈ మధ్య కాలంలో హిందీలో వచ్చిన డాన్, జంజీర్ రీమేక్‌ల టైటిల్స్ రోల్‌లో కూడా సలీమ్ జావేద్‌ల పేర్లే పడతాయి. 1971లో వచ్చిన అందాజ్, అధికార్ సినిమాలతో సలీమ్-జావేద్‌ల కాంబినేషన్ కుదిరింది. ఆ తర్వాత ఈ కాంబినేషనే అమితాబ్‌ను యాంగ్రీయంగ్‌మ్యాన్ ఇమేజ్‌తో నిలబెట్టింది. బాక్సాఫీస్  హిట్ ఫార్ములాలను లిఖించింది. సలీమ్-జావేద్‌ల కథతో రూపొందిన కొన్ని సినిమాలు తెలుగులో కూడా రీమేక్ అయ్యాయి. 1977లో వచ్చిన ‘మనుషులు చేసిన దొంగలు’ 1979లో వచ్చిన ‘యుగంధర్’ సినిమా టైటిల్స్ రోల్‌లో కథ: సలీమ్-జావే ద్ అనే పడుతుంది. కలివిడిగా ఉన్నంత సేపూ వీరు తిరుగులేని ద్వయంగా పేరు పొందారు. అయితే వివిధ కారణాలతో విడిపోయాక మాత్రం నిలదొక్కుకోవడం కూడా కష్టం అయ్యింది. విడిపోయిన కొన్ని సంవత్సరాల పాటు సలీమ్‌ఖాన్ కొన్ని సినిమాలకు రచనాబాధ్యతలు నిర్వర్తించాడు. అయితే వాటిలో అంత వాడీ వేడి లేదనేది సినీ విమర్శకుల అభిప్రాయం. ఇక జావేద్ అక్తర్ మాత్రం పాటలు రాయడంలో బిజీ అయిపోయాడు. జావేద్ జీ సంతానం కూడా బాలీవుడ్‌లో నిర్మాతలుగా, దర్శకులుగా ఉనికిని చాటుకోవడంతో జావేద్ వాళ్ల సినిమాలకు పాటలు రాస్తూ.. కవిత్వం రాస్తూ తన ఉనికిని చాటుకొన్నాడు.

 

ఈ జోడీది హిట్‌కార్ట్...ఒకరిని స్ఫూర్తిగా తీసుకొని ఇద్దరు కలిసి కృషి చేయడం ఫలితంగా ‘ఫ్లిప్‌కార్ట్’ ఉదయించింది. ఇక్కడ స్ఫూర్తి ‘అమెజాన్ డాట్‌కామ్’. కృషి చేసింది సచిన్ బన్సల్, బిన్నీ బన్సల్‌లు. ఇద్దరి పేర్లలోనూ ‘బన్సల్’ కామన్ కావడంతో చాలామంది వీళ్లను అన్నదమ్ములూ లేదా దగ్గర బంధువులూ అనుకొనే అవకాశం ఉంది. అయితే వీళ్ల ఆలోచనల మధ్య మాత్రమే సంబంధ  బాంధవ్యాలున్నాయి. దూరపు బంధువులు కూడా కాదు. ఐఐటీ ఢిల్లీలో వీరిద్దరూ ఒకరికి ఒకరికి పరిచయమట. అయితే ఇప్పుడు భారత్‌లో ఇ-కామర్స్ విషయంలో సచిన్-బిన్నీల కాంబినేషన్ ఒక సంచలనం. ఫ్లిప్‌కార్ ్టవీరి అపూర్వ సృష్టి. ఇటీవలే ఈ సైట్ మార్కెట్ విలువ 42 వేల కోట్ల రూపాయల స్థాయికి చేరింది. దీంతో ఈ జోడీ పేరు మార్మోగిపోయింది. ప్రత్యేకించి వీరిద్దరి ఆలోచనా విధనం ఒక వ్యక్తిత్వ వికాస గ్రంథం. చదివిన చదువులకు తగ్గట్టుగా మంచి ఉద్యోగాలు వచ్చినా... వ్యాపార రంగంలో స్థిరపడాలనే ఉద్దేశంలో ఆ ఉద్యోగాలను వదిలేసుకొనే సాహసం చేయడం, అనేక మంది నిరుత్సాహపరిచినా వెనక్కుతగ్గకపోవడం, మరో వ్యక్తి సాయం లేకుండా ఇద్దరే ఫ్లిప్‌కార్ట్‌ను లాంచ్‌చేయడం... తొలి రోజుల్లో అది నిలదొక్కుకోవడానికి చాలా పాట్లు పడటం... ఇవన్నీ కూడా సచిన్, బిన్నీలు అందించే స్ఫూర్తి పాఠాలు. ఇప్పుడు భారతదేశంలో విస్తరించాలని చూస్తున్న విదేశీ ఇ-కామర్స్ దిగ్గజాలతో, విస్తృతం అవుతున్న ఇతర ఇ-కామర్స్ సైట్లతో ఫ్లిప్‌కార్ట్ పోటీ పడుతోంది. ఈ పోటీలో తమ మానసపుత్రికను విజేతగా నిలపడానికి సరికొత్త ఎత్తులు వేస్తున్నారు సచిన్-బిన్నీలు. ఫ్లిప్‌కార్ట్ విజయంలోనైనా... కొన్ని సందర్భాల్లో దీని వైఫల్యంలోనైనా ఇద్దరికీ పూర్తిబాధ్యత ఉంటుందంటారు బన్సల్ ద్వయం. ఆ ఇ-కామర్స్ సైట్ తరపున చిన్న వివరణ ఇవ్వడానికి అయినా సరే.. ఈ ఇద్దరూ మీడియా ముందుకు వస్తారనే విషయం మీరిప్పటికే గమనించి ఉంటారు.

 

అన్నదమ్ములు.. అదుర్స్!లాన్ టెన్నిస్ విషయంలో సింగిల్స్‌కు ఉన్నంత క్రేజ్ డబుల్స్‌కు ఉండదు.  అయితే టెన్నిస్ డబుల్స్‌కే క్రేజ్ తెచ్చే ఒక జంట ఉంది. అదే ‘బ్రయన్ బ్రదర్స్’. ఒకరిది కుడిచేతివాటం, మరొకరిది ఎడమ చేతివాటం... అందుకే వీరిని ‘మిర్రర్ ట్విన్స్’గా వ్యవహరిస్తారు. ప్రపంచ టెన్నిస్ చరిత్రలో ప్రత్యేకమైన వాళ్లు బ్రయన్ బ్రదర్స్. లాన్‌టెన్నిస్ డబుల్స్‌లో ఎన్నో జంటలు ఉన్నా... బ్రయన్ బ్రదర్స్ స్థాయిని అందుకొనే వారు మాత్రం లేరు. మ్యాచ్‌ల వారీగా చూసుకొన్నా,  టైటిల్స్‌ను సాధించడం ప్రకారం లెక్కపెట్టినా ఎవరికీ అందనంత స్థాయి రికార్డులను స్థాపించారు బ్రయన్ బ్రదర్స్. రాబర్ట్ చార్లెస్ బ్రయన్‌ను బాబ్ బ్రయన్‌గా, మైఖేల్ కార్ల్ బ్రయన్‌ను మైక్ బ్రయన్‌గా వ్యవహరిస్తారు. రెండు సెకెన్ల తేడాతో జన్మించిన ఈ అన్నదమ్ములు దశాబ్ద కాలంగా ప్రపంచ టెన్నిస్ డబుల్స్ ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్ స్థానంలో ఉన్నారు. వరసగా 385 వారాల పాటు ప్రపంచ నంబర్‌వన్  ర్యాంక్‌లో నిలబడ్డారు. ఇద్దరూ కలిసి మొత్తం 101 టెన్నిస్ టైటిళ్లను సాధించారు. ఆస్ట్రేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్... తేడాలు లేకుండా ఇద్దరూ బరిలోకి దిగారంటే విజేతలే. టెన్నిస్‌లో దుందుడుకు ఆటతీరుకు ఈ అన్నదమ్ములిద్దరూ పెట్టింది పేరు. అమెరికా తరపున రెండు సార్లు ఒలింపిక్స్‌లో బరిలోకి దిగారు. ఆ రెండు సార్లూ ఒలింపిక్ టెన్నిస్ డబుల్స్‌లో పతకాలను సాధించారు. ఒకసారి రజతం, రెండోసారి స్వర్ణపతకాలను సొంతం చేసుకొని వ్యక్తిగతంగానే కాకుండా దేశం తరపున కూడా విజయాలు సాధించిన వారయ్యారు.

 

వీరి సృజన.. అనేకమంది అనుకరణ!ఈ జంట ప్రస్తుతానికి విడిపోయింది. అయితే వీరిద్దరూ ఉమ్మడిగా ఒకనాడు సృష్టించిన సృజన మాత్రం ఇప్పటికీ అలరిస్తూనే ఉంది. ఈ మలయాళ దర్శకద్వయం అనేక సూపర్‌హిట్ సినిమాలను రూపొందించింది. వారు అక్కడ తీసిన సినిమాలు తర్వాత తెలుగు, హిందీ సినిమా ప్రేక్షకులను రీమేక్‌లుగా అలరించాయి. సిద్ధిక్ -లాల్ ఉమ్మడిగా దర్శకత్వం వహించిన ‘హిట్లర్’ ‘రామ్ జీ రావ్ స్పీకింగ్’ ‘ఇన్ హరి హర్ నగర్’ ‘గాడ్‌ఫాదర్’ ‘ఫ్రెండ్స్’ వంటి సినిమాలు సంచలన విజయాలు సాధించాయి. విశేషం ఏమిటంటే... ఈ సినిమాలు అన్నీ ఇతర భాషల్లో రీమేక్ కావడం. కేవలం ఒక్క భాషలో కాదు తెలుగు, తమిళం, హిందీ, కన్నడ భాషల్లో రీమేక్ అయ్యాయి. ‘హిట్లర్’ సినిమాను ఏ ఇండస్ట్రీ వాళ్లూ వదల్లేదు. ‘రామ్ జీ రావ్ స్పీకింగ్’ సినిమా హిందీలో ‘హేరాఫెరీ’గా నవ్వించింది, తెలుగులో ‘ధనలక్ష్మి ఐ లవ్యూ’గా వచ్చింది. ‘ఇన్ హరిహర్ నగర్’ అనే  సినిమా ‘మధురానగరిలో..’ పేరుతో తెలుగులో కూడా సూపర్‌హిట్ అయ్యింది. సిద్ధిక్‌లాల్‌ల దర్శకత్వంలో వచ్చిన ‘గాడ్‌ఫాదర్’ సినిమానే తెలుగులో ‘పెద్దరికం’గా వచ్చి సంచలన విజయాన్ని సాధించింది. ఈ సినిమాలన్నీ హిందీలో కూడా రీమేక్ అయ్యాయి. సిద్ధిక్, లాల్‌ల పేర్లను మార్మోగించాయి. 16 సంవత్సరాల పాటు కలిసి పనిచేసిన  జంట కొన్ని సంవత్సరాల క్రితం ఈ  విడిపోయింది.  సింగిల్‌గా కూడా సిద్ధిక్ అనేక సూపర్‌హిట్ సినిమాలకు దర్శకత్వం వహించాడు. లాల్ పూర్తి పేరు పాల్ మైఖేల్. దర్శకుడిగా, రచయితగా, నటుడిగా కొనసాగుతున్నాడు. ‘పందెం కోడి’ వంటి సినిమాలో విలన్‌గా నటించి తెలుగువాళ్లకూ పరిచయమయ్యాడితను.

 

ఇలా ఎంతో మంది విజయంలో భాగస్వామ్యులుగా... సామాజిక, ఆర్థిక, కళా రంగాల్లో తమ ప్రత్యేకతను నిరూపించుకొన్నారు, నిరూపించుకొంటున్నారు. వీరి విజయవిన్యాసాలను బట్టి.. జతగా నిలవడం కూడా సక్సెస్‌కు ఒక సూత్రమే!

 

-బీదాల జీవన్‌రెడ్డి

 

వీళ్లు మాత్రమే కాదు...బాపు, రమణ.. ఈ ద్వయం గురించి తెలుగువాళ్లకు తెలియనిదేమీ లేదు. ఒకరు గీతతో, మరొకరు రాత తో తెలుగు సంప్రదాయంలో భాగమయిన బాపు-రమణ లాంటి జోడీ మళ్లీ సాధ్యం కాదేమో.

     

ట్విటర్ వ్యవస్థాపకులు అయిన ఎవాన్ విలియమ్స్, బిస్‌స్టోన్ ఇద్దరూ మొదట గూగుల్‌లో పనిచేసే వాళ్లు. అప్పట్లో ఒకరంటే ఒకరికి పడేదికాదట. దాదాపుగా శత్రువులమని స్టోన్ కొన్ని ఇంటర్వ్యూల్లో చెప్పాడు. ఆ తర్వాత ఇద్దరూ దగ్గరయ్యారు. ఒకేసారి గూగుల్‌లో జాబ్ మానేశారు. ఎవాన్‌ను అనుసరిస్తూనే స్టోన్ అక్కడ జాబ్ మానేశాడు. ట్విటర్‌ను స్థాపించారు. సోషల్‌నెట్‌వర్కింగ్‌లో సంచలనం అయ్యారు.

     

బాలీవుడ్‌లో బాజీగర్, కిలాడీ, ఐత్‌రాజ్, నఖాబ్, రేస్ వంటి  సూపర్‌హిట్ సినిమాలకు దర్శకత్వం వహించిన అన్నదమ్ములు అబ్బాస్ -మస్తాన్ మరో జోడీ. దాదాపు 24 సంవత్సరాల నుంచి వీరిద్దరూ ఎప్పటికప్పుడు అప్ టూ డేట్ గా ఉంటూ తమ ముద్రను కొనసాగిస్తున్నారు.

     

టెన్నిస్ డబుల్స్‌లో వేరే వాళ్లెవ్వరితోనూ జత కట్టకుండా వాళ్లు మాత్రమే కలిసి ఆడే అమెరికన్ అక్కచెల్లెల్లు వీనస్, సెరెనాలు.

 

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top