దుబ్బయ్య  పటేల్‌

A Man Goes To Muscat Story In Telangana Slang - Sakshi

ఇసుక చెట్టు

మధ్యాహ్నం.. బస్సు దిగాడు.. బస్టాండ్‌గా వాడకంలో ఉన్న ఓ చెట్టు కింద. అటూఇటూ చూశాడు. తన వాళ్లు.. తనకు తెలిసినవాళ్లెవరూ కనిపించలేదు. కుడి చేతిలో ఉన్న బ్యాగ్‌ను, ఎడమ చేతిలో ఉన్న టేప్‌రికార్డర్‌ను కిందపెట్టి.. ఒళ్లు విరుచుకున్నాడు. తర్వాత బ్యాగ్‌ను కుడి జబ్బకు వేసుకొని.. టేప్‌రికార్డర్‌ను ఎడమ చేత్తో పట్టుకొని నడక సాగించాడు. 
అతను ఆ ఊరు వదిలిపెట్టి వెళ్లి అయిదారేళ్లవుతోంది. ‘ఏం మారలేదు.. ఊరికి బస్సు అచ్చుడు తప్పితే’ అనుకున్నాడు చుట్టూ పరికించి చూస్తూ! ఆ మట్టిబాటకు రెండు వైపులా పచ్చగా ఉన్న పొలాలు.. పారుతున్న పంటకాల్వలను చూసి ఆశ్చర్యపోయాడు. ‘ఏ.. ఊరు మారింది’ ఒక్క క్షణం కిందటి అభిప్రాయాన్ని మార్చుకుంటూ ‘ప్రాజెక్ట్‌ కెనాలొచ్చి మంచిగైంది. అంతకుముందెట్లుండే... బొక్కలల్ల మూలుగ అరిగేదాంక కష్టవడ్డా.. వీసెడు పంటచ్చేది కాదు.. అవుగని.. నా సోపతిగాండ్లు ఎట్లున్నరో..’ తలపోసుకున్నాడు అతను. 
‘అగో... నువ్వూ...’ అంటూ కళ్లకు, నుదిటికి మధ్య అరచెయ్యి అడ్డంపెట్టుకొని అతణ్ణి గుర్తుపట్టడానికి ప్రయత్నిస్తూ అంది ఒక అవ్వ.

తనకెదురుగా వచ్చిన ఆమెను చూసి.. ఆగిపోయాడు అతను. 
‘నువ్వు.. దుబ్బడివి గదా..?’ గుర్తొచ్చినట్టు అడిగింది ఆ అవ్వ. 
‘ఔ సాయవ్వ.. గుర్తువట్టినవా?’ ఎక్కడలేని ఆనందం అతని గొంతులో. 
‘అగో.. గిన్నేండ్లకు కనవడ్తివి? యేడికేంచి అస్తున్నవ్‌? నువ్వు బొంబైకి పరారైనవంట గదా కొడ్కా?’ తనకు తెలిసిన సమాచారమంతా అడిగేసింది సాయవ్వ. 
టేప్‌రికార్డర్‌ను రెండు మోకాళ్ల కాళ్లమధ్య పెట్టుకుంటూ షర్ట్‌ జేబులో ఉన్న ఒక సిగరెట్, లైటర్‌ను తీశాడు. సిగరెట్‌ను నోట్లో పెట్టుకొని లైటర్‌తో వెలిగించి మళ్లీ లైటర్‌ను షర్ట్‌ జేబులో వేసేసి... మోకాళ్ల మధ్య నుంచి టేప్‌రికార్డర్‌ను తీసి ఎడమచేత పట్టుకొని.. కుడిచేత్తో సిగరెట్‌ దమ్ము లాగి.. వదులుతూ.. ‘అవ్‌ బొంబైకి పరారై.. మస్కట్‌ల తేలిన’ అని సమాధానమిచ్చి మళ్లీ నడక సాగించాడు. 
మొదలైంది.. ఊరి జనం అతణ్ణి గమనించడం.. గళ్ల గళ్ల చొక్కా.. ఖాకీ కలర్‌ ప్యాంట్‌.. మల్టీ కలర్‌ సిల్క్‌ రుమాలు.. రేబాన్‌ కళ్లద్దాలు.. అన్నిటికన్నా.. అన్నిటికన్నా.. మెడలో లావుపాటి బంగారపు గొలుసు.. చేతికి గడియారం.. ఆ ఊరి జనాన్ని ఆకర్షించిన మరో ముఖ్యమైన వస్తువు.. అతని చేతిలో ఠీవిగా కనపడుతున్న టేప్‌రికార్డర్‌..

‘గప్పుడు మనూళ్లెకు అన్నలచ్చిండ్రు గదా..’ అతను చెప్తున్నాడు. 
‘అవ్‌.. దుబ్బయ్యా.. గా సంగతి ఎర్కే.. గదిగాదు.. నువ్వు బొంబైకెంచి మస్కట్‌కెట్లా వోయినవో షెప్పు’  అడిగాడు  అతని ఫ్రెండ్‌. 
గ్రామ పంచాయతీ ఆఫీస్‌ ముందున్న హోటల్‌లో టీ తాగుతూ ఈ ముచ్చట సాగుతోంది. 
‘గా దినాలల్ల పోలీసులు నిన్నెంత లెంకిండ్రో ఎర్కేనా దుబ్బయ్యా?’ అన్నాడు ఇంకో వ్యక్తి. 
‘మీ ఇంటోళ్లు అరిగోస వడ్డరు’ మరో స్నేహితుడి జాలి. 
అతను ఆ ఊళ్లోకి వచ్చి వారం రోజులవుతోంది. ఈ వారం రోజుల్లో అతణ్ణి ఉక్కిరిబిక్కిరి చేసిన.. చేస్తున్న విషయం..  తన దగ్గరివాళ్లు.. తనను దూరం పెట్టినవాళ్లు..అందరూ తనను ‘దుబ్బయ్యా’  అని పిలవడం. 
‘అరేయ్‌ దుబ్బిగా.. పటేల్‌ సాబ్‌ రమ్మంటుండు..’
‘ఎన్ని కాడలు(ఆబ్‌సెంట్‌) వెడ్తవ్‌రా దుబ్బిగా?’
‘మల్లేం రోగమచ్చేరా దుబ్బడికి? ’
‘నక్రాలా బే దుబ్బీ..?’ అంటూ పిలవబడ్డ గతం అతని చెవుల్లో గింగుర్లు కొడ్తోంది.. ఆ రోజుల రీలు మస్తిష్కంలో తిరుగుతోంది.
‘అస్సలు సంగతి చెప్పకుండా ఎటో చూడవడ్తివి?’ అని తన ముందున్న వ్యక్తి భుజం తడ్తేగాని వర్తమానం గుర్తుకురాలేదు అతనికి. 
‘ఇండ్ల మీకు తెల్వందేముంది  సాయిలూ.. అన్నలు చెప్పిన మాటలు నివద్దనిపించి.. పటేల్‌ తాన చేస్తున్న పాలేరుగిరి కూడా ఇడ్శివెట్టి.. భూమి కావాల్నని కొట్లాడిన గదా.. నా అసుంటి పాలేర్లందరినీ పోలీసులు వట్టుకునుడు షురు జేసినంక.. అందరు ఎక్కడోళ్లక్కడ పరారైన బాపతిల నేను బొంబై బస్సెక్కిన. ఆడ ఏదో కూలీనాలీ జేస్కుంటుండంగా.. ఒక మరాఠాయనతో దోస్తానాయింది. గాయన్నే.. మస్కట్ల పనిజేయతందుకు పోతవా అని సోల్దివెట్టిండు. ఇంటికి ఉత్తరం రాశ్న గిట్ల సంగతి అని.. పొమ్మన్నరు.. గాయన అడ్రస్‌లనే నేనుంటున్నట్టు పాస్‌పార్ట్‌ తీపిచ్చి.. వీసా సూత ఇప్పిచ్చి మస్కట్‌ తోలిచ్చిండు. బిల్డింగ్‌లు కట్టేకాడ పని. బొంబైలనే కార్‌ డ్రైవింగ్‌ సూత నేర్సుకున్న. గిప్పుడు గా పనే దొరికేటట్టుంది.. లైసెన్స్‌గిట్ల అన్నీ గా మరాఠాయన్నే ఇప్పిస్తనన్నడు’ అని చెప్పాడు అతను. 
‘దుబ్బయ్యా.. అయితే ఈ అయిదేండ్లలో మస్తే సంపాదించి ఉంటవ్‌ లే..’ ఆత్రంగా ఒకరు అడిగారు.. ఆదుర్దాగా అందరూ చెవులు రిక్కించారు. 
‘ఊ..’గాజు గ్లాస్‌లోని టీని జుర్రుతూ క్లుప్తంగా అతను.

‘దుబ్బయ్యా.. ’ అని పిలిచిన నర్సిరెడ్డి మాటకు ఉలిక్కిపడ్డాడు అతను. మస్కట్‌ మాయా అనుకున్నాడు మనసులో. 
‘బిడ్డ పెండ్లి చేయాలే. రెండెకరాలు అమ్ముదామనుకుంటున్నా.. కొనుక్కోరాదు?’ అని ఎంతకు అమ్మదల్చుకున్నాడో రొక్కం కూడా చెప్పాడు నర్సిరెడ్డి పటేల్‌ తన పాత పాలేరైన అతనికి. 
‘ఏ.. నా దగ్గర గన్ని పైసలు యేడున్నయ్‌ పటేల్‌సాబ్‌?’ ఉలిక్కిపడ్డాడు అతను. 
‘గట్లనకు.. బిడ్డ పెండ్లి ఉంది..’ బతిమాలుతున్న ధోరణిలో ఉంది నర్సిరెడ్డి మాట. 
ఆలోచనలో పడ్డాడు అతను.

‘ఏం ఆలోచన జెయ్యకు.. నాకోసం దెచ్చిన బంగారం అమ్మేసి పొలం కొందాం..’ చెప్పింది అతని భార్య.
‘పెండ్లయినప్పటి సంది నీకేం జేయ్యలే... షోకిలవడి తెచ్చిన బంగారం.. వద్దంటవేందే?’ నొచ్చుకున్నాడు అతను. 
‘నా మెడల బంగారం ఎవ్వలు సూడవోయిండ్రు? పొలం ఉందా.. ఇల్లుందా అని అడ్గవోతరుగని? బిగడు పొలం లేకుండా బగ్గ బంగారం దిగేసుకున్నా వేష్టే..’నిష్ఠూరమాడింది అతని భార్య.
ఆ మాటతో అతని ఆలోచనలను కట్టేసింది ఆమె. 

‘ఇంకేంది.. దుబ్బయ్య పటేల్‌.. ఈసారి అచ్చినప్పుడు ఏం కొంటవ్‌?’ మస్కట్‌కి ప్రయాణమైన అతణ్ణి ముంబై బస్‌ ఎక్కించడానికి వచ్చిన స్నేహితుడు అడిగాడు అలైబలై చేసుకుంటూ!
మళ్లీ నవ్వుకున్నాడు మనసులోనే అతను.. ‘దుబ్బిగా .. దుబ్బయ్య.. దుబ్బయ్య పటేల్‌’ అని అనుకుంటూ!
- సరస్వతి రమ

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top