వివరం: మండుటెండల్లో మల్లెల వాన

వివరం: మండుటెండల్లో మల్లెల వాన


మల్లెల పరిమళం ఆహ్లాదం. సన్నజాజుల సుగంధం పరవశం. విరజాజుల తావి... కురులు పాడే పల్లవి. పారిజాతం... సుమగాన చరణం ఇంకా...  చెంగల్వ, సంపంగి, నైట్‌క్వీన్.. ఇవన్నీ...  వేసవిలో పనిగట్టుకుని మరీ చల్లని సువాసనల చందనాన్ని మోసుకొచ్చే పూలు!

 పగలంతా ఇవి మొగ్గలు. సాయం వేళకు ప్రౌఢిమలు!  అందుకే మల్లెల్ని గానీ, మిగతా పువ్వుల్ని గానీ చూసి పలకరించని కవి,  చూసి పరవశించని కవి కనపడరు.  మల్లెపూలయితే మరీ మరీ ప్రత్యేకం. మామూలు మనుషుల్ని సైతం భావుకులుగా మార్చే వేసవిపూల మహారాణి ‘మల్లెపువ్వు’. ఆ మహారాణే ఈవారం మన ‘వివరం’.

 

 ఎండలు ప్రచండంగా మండాలి. సూర్యుడు నాలిక బయటకు సాచి కన్నెర్ర చేయాలి. చేటలతో నిప్పులు చెరగాలి. చుక్క నీరు లేకుండా చెరువులు, కాలువలు, చెలమలు ఎండాలి. నూతులు ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ ఉండాలి. పక్షులు, పశువులు దప్పికతో అంగలార్చాలి... ఇన్ని జరిగిన తరువాత చిరునవ్వులు చిందిస్తూ  ‘ఎండలను చూసి అల్లాడకండి’ అన్నట్లుగా గుప్పెడు మల్లెలు విరబూసేలా చేస్తుంది ప్రకృతి. చేతిలో ఒక మంచు ముక్కను ముట్టుకున్నట్టు, చేతిలో ఒక వెన్నముద్ద పట్టుకున్నట్టు మరకలేవీ అంటని సొబగు మల్లెల సొంతం. వేసవిలో తెల్లటి ఎండతో పోటీ పడుతూ వికసించే మల్లెలు, సన్నజాజులు, విరజాజులు, చెంగల్వలు, పారి జాతాల వంటి కుసుమాలు సువాసనలు వెదజల్లుతూ ప్రకృతికే పరిమళాలు అద్దుతాయి. చీకటిపడుతుండగా చంద్రుని కిరణాల నుంచి వెలువడే తెల్లని కాంతి ప్రభావంతో వికసించే ఈ కుసుమాలు... మనసుని చల్లబరచడానికి, చక్కబరచడానికి దోహదపడతాయని శాస్త్రం చెబుతోంది. ‘చంద్రమా మనసా జాతః’ అంది శాస్త్రం.

 

 ఏష షట్పదయువా మదాయతః

 కుంద యాపయతి యామినీస్త్వయి

 దుర్వహా తదపి నాపచీయతే

 పద్మినీ విరహవేదనా హృది!!

 ‘ఓ కుంద (మల్లెపూవు) పుష్పమా! ఈ యువ తేనెటీగ, తేనె తాగి మదించి, రాత్రులను నీతోనే గడుపుతోంది’ అని అర్థం. అందుకే సువాసననిచ్చే అన్ని పుష్పాలలోకీ మల్లెలదే అగ్రస్థానం. ‘ఎన్ని సన్నజాజులు పూసినా ఒక్క మల్లెమొగ్గకు సాటి రావు’ అని సన్నజాజులను ఎగతాళి చేయడం తెలిసిందే.  వేసవి - మల్లెలు - పరిమళం... తోబుట్టువులు. మల్లెలలోనూ ఎక్కువతక్కువలు, జాతి భేదాలు ఉన్నాయి.  దొంతర మల్లి, బొడ్డు మల్లి, రేక మల్లి, జడ మొగ్గ... అబ్బో ఎన్నో... ఎన్నెన్నో. కొన్ని మల్లెలు బొద్దుగా, కొన్ని బలహీనంగా, మరి కొన్ని వయ్యారంగా, నాజూకుగా ఉంటాయి. కొన్ని ఒంటి రెక్కతో పూస్తా యి. కొన్ని దొంతరలుగా పూస్తాయి. కొన్ని పొడుగ్గా పూస్తాయి. కొన్ని గులాబీలంతపూస్తాయి. మొగ్గలుగా తలలో సిగ్గులమొగ్గలవుతాయి. అక్కడే వికసిస్తాయి.

 

 కాళిదాసు కావ్య భాష్యం

 వనేషు సాయంతన మల్లికానాం

 విజృంభణోద్గ్రంధిషు కోమలేషు

 ప్రత్యేక  నిక్షిప్త పదః సశబ్దం

 సంఖ్యామివైషాం భ్రమరశ్చకార...

 అడవులలో నల్లని తుమ్మెదలు ఝంకారం చేస్తూ, మల్లెతీగకు విచ్చుకున్న ప్రతి మొగ్గ మీద తన పాదాలు ఉంచుతూ, వాటిని తెరవడానికి ప్రయత్నిస్తున్నట్టు నటిస్తూ, సుగంధాన్ని పీలుస్తూ, వాటిని లెక్కిస్తున్నాయా అనిపిస్తుంది... అని మల్లెలకు కొత్త భాష్యం చెప్పాడు కాళిదాసు. మల్లెలలో అమృతం ఉందట! బహుశా అది చూసి మురిసిపోయాడో ఏమో పోతన నల్లని శ్రీకృష్ణుడిని తెల్లని మల్లె పొదల మాటున దాచి, ‘ఓ మల్లియలార మీ పొదలమాటున లేడు కదమ్మ చెప్పరే’ అని  గోపికల  చేత అడిగించి సంబర పడ్డాడు. మల్లెలకు మురిసిన దేవులపల్లి వారు ‘మనసున మల్లెల మాలలూగెనే’ అన్నారు. అక్కడితో తృప్తి చెందలేదు. ‘మల్లెల తో వసంతం... చేమంతులతో హేమంతం... వెన్నెల పారిజాతాలు’ అంటూ తన భావుకతను కుసుమ సుకుమారంగా వివరించారు. పరమ సుకుమారంగా ఉండే రాకుమార్తెను ‘ఏడు మల్లెల రాకుమారి’ అంటారు. మల్లెలు శిశిరంలో వికసిస్తూ, వసంతంలో మరింత పరిమళాన్నిస్తాయని ‘కావ్యమీమాంస’ చెబుతోంది. రామాయణంలో పంపా సరోవర తీరంలో మల్లెలు ఏడాదికి రెండు సార్లు వికసిస్తాయని ఉంది. ‘మనసులో కోపం పెట్టుకుని కావ్యాన్ని విమర్శించేవాడిలా ఈ వడగాలి ఈ మల్లెపూవును పాడుచేస్తోంది’ అని వడగాలిని దూషించారు ఒక కవిగారు.

 

 జడలకూ పూస్తాయి!

 మల్లెలు తీగలకు లేదా పొదలకు మాత్రమే పూస్తాయనుకుంటే పొరపాటే. కొందరి జడలను పూలజడలుగా ఏమారుస్తాయి. కొన్ని జడల మీద తెల్ల తాచులా నాట్యం చేస్తుంటే, కొన్ని తల శాఖలకు వేలాడుతుంటాయి. మల్లాది రామకృష్ణశాస్త్రి రచించిన ‘మలయ మారుతం’ కథలో ‘‘మిమ్మల్ని ఎంతో ఒప్పించాలని మల్లెమొగ్గల వంకీ జడ వేయించుకున్నాను’’ అని చంద్రం పాత్రతో పలికించారు. మండే ఎండలకు శరీరాలు మాడిపోతుంటే, మల్లియలు మాత్రం తెల్లగా నూతనం గా పరిహసిస్తుంటాయి.

 

 మల్లెలు మాఘ మాసంలో పూయటం మొదలుపెడతాయి. అందుకని వీటిని ‘మాఘ్యం’ అంటారు. మాఘంలో మంచు కురిసి మల్లెలను ముద్దాడటం చూసిన ప్రకృతికాంతకు ఈర్ష్య కలుగుతుందట. మల్లెల మీద మంచు ముత్యాలు చేరి ప్రకృతికి మణిహారం అవుతుందని కాళిదాసు ‘ఋతుసంహారం’ కావ్యంలో వర్ణించాడు. ‘మల్లె హసియించె మామిడి చిగురించె’ అన్నారు ఉషశ్రీ ‘వెంకటేశ్వర కల్యాణం’ యక్షగానంలో. తను రచించిన కథలలో ప్రధాన పాత్ర మల్లెలే. ‘మల్లి మీద మమకారం’ ‘మల్లెపందిరి’ వంటి కథలలో ప్రధానపాత్ర మల్లెలు. సహజకవి పోతన శ్రీమద్భాగవతంలోని గజేంద్ర మోక్షంలో త్రికూటపర్వతాన్ని వర్ణిస్తూ... ‘‘పనస, బదరీ, వకుళ, కంబుళ, వట, కుటజ, కుంద, కురవక...’’ అన్నాడు.

 

 ‘‘మల్లెమొగ్గలు కోసి, దండ కట్టి, సీత జళ్లో పెట్టబోతూ నవ్వాడు రామం’’ అని అనామకుడు తన ‘అలిగిన వేళ’ కథలో మల్లెలను ప్రస్తావించారు.‘మల్లెలు లేని పెళ్లీ ఓ పెళ్లేనా’ అని పెళ్లిళ్లలో మల్లెలు లేకపోతే ఎగతాళి చేస్తారు. ‘ఓహోహో బావగారు ఎప్పుడొచ్చారు’ అంటూ మరదలు బావగారిని ఆటపట్టిస్తూ, ‘‘మళ్లీ వచ్చేటప్పుడు మా అక్కకు మల్లె మొగ్గల చీర మరువవద్దు’’ అనటంలో మల్లెలను చీర మీద కూడా ఆరబోసి సంబరపడ్డాడు ఆ అజ్ఞాతకవి. మల్లిక అనే పదం వ్యాకరణ రీత్యా, కవిత్వ రీత్యా స్త్రీ సంబంధమైనది. కాళిదాసు మల్లెలను ‘వన వధువు’ అని ప్రశంసించాడు. మల్లెపూలు స్త్రీపురుషుల మనసుకు హాయిని కలిగించి, వారి మధ్య సమైక్య భావాన్ని కలిగేలా చేస్తాయట. మండుటెండల్లో సైతం సాయంత్రం అయ్యేసరికి మల్లెల వలన వాతావరణం చల్లబడుతుందని ఎండాకాలాన్ని వర్ణించాడు కాళిదాసు శాకుంతలంలో. ఆ కావ్యంలోనే ‘విచ్చుకున్న మల్లికను విడిచి ఈ తుమ్మెద నా మోము చుట్టూ తిరుగుతోంది’ అంటుంది శకుంతల.

 

 వన చంద్రికలు

 మల్లికను సంస్కృతంలో మల్ల లేదా మల్లి అంటారు. వసంతర్తువు ముగిసి గ్రీష్మ ఋతువు ఆరంభమవుతున్న సంధి సమయంలో పూస్తాయి కనుక ‘వార్షికి’ అంటారని, గ్రీష్మంలో విర్రవీగిన మల్లెలు శీతాకాలాన్ని చూస్తే భీరువులైపోతాయి కనుక  ‘శీతభీరువు’ అంటారనీ అమర కోశం చెబుతోంది.

 ‘ఏతే సముల్లసద్భాసో

 రోజంతే కుంద కోరకాః

 శీతభీతా లతాకుంద మాశ్రీతా ఇవ తారకాః’  మల్లె మొగ్గలు తారకల్లా మెరుస్తూ, చలికి భయపడుతూ, తీగ మీద పూయడానికి వెనుకాడుతున్నాయట. దట్టమైన అడవుల్లో చీకటిని తోసిరాజంటూ మల్లెలు ‘వన చంద్రిక’ (అడవిలో వెన్నెల) లు అవుతున్నాయి. అంతేనా! సుగంధాలను వెదజల్లుతూ ‘గంధరాజ’ పేరును సొంతం చేసుకున్నాయి. ‘నల్లమల అంతా విరబూసిన మల్లెలను చెంచులు ఏరేరి తేగా మాలగా ధరించే ఆ మల్లికార్జునుడు ఎంత అదృష్టవంతుడో’ అని శ్రీశైలమల్లికార్జునుడి గురించి అన్నట్లుగా వాడుకలో ఉంది.

 

 ‘మతి విరహపు మేన మల్లెలు పూచె’ అన్నాడు అన్నమయ్య. ఆమె విరహం మల్లెపూవులా పూచిందట. మల్లెలాగే ఎందుకంటే, వాటి మల్లెల సువాసన మత్తెక్కిస్తుంది. పడతి విరహ స్థితి కూడా అదే కదా! అందుకు!  మల్లెమొగ్గల జడ కుట్టించుకోవడానికి ఆడపిల్లలు ఎంత ఆరాటపడతారో నాటి తరం వారికి బాగా తెలుసు. రాత్రి నిద్రపోయే ముందు ఆ జడను తీసి వెన్నెలలో ఆరబెట్టి, ఉదయాన్నే స్కూల్‌కి వెళ్లేటప్పుడు మళ్లీ జడను అతికించుకుని అందరికీ చూపించి మురిసిపోతారు. మల్లె మొగ్గల జడ లేకపోతే పెళ్లికూతురి కళే ఉండదు. మల్లెలు... మగువలు... వీరి మధ్య బంధం విడదీయరానిది. పువ్వులు ప్రేమకు, మనసులో భావాలు నిష్కల్మషంగా వ్యక్తం చేయడానికి ప్రతీకలు. పువ్వులు ప్రకృతి మనకు ప్రసాదించిన వరం.

 

 మల్లెల వెన్నెల వేసగి వెన్నెలల్కురిసి పృధ్వి సమస్తము పాలసంద్రమై

 పో సకలావనీజములు పొల్పుగ కల్పకముల్     పొలంతులున్

 వాసిగనప్సరోగణము ప్రాకిన నీడలు  క్ష్వేళమున్ హిమా

 నీ సిత మల్లికల్ సుధగ నీతులు వోయె నిదాఘ (ఎండాకాలం) యామినుల్

 వేసవికాలపు వెన్నెలతో భూమి అంతా పాలసముద్రంలా ఉంది. వృక్షాలన్నీ కల్పవృక్షాలయ్యాయి. స్త్రీలందరూ అప్సరసల్లా ఉన్నారు. నీడలు హాలాహలంగా, విచ్చిన మల్లెపూలు అమృతంలాగా ఉన్నాయి.  

 సినీ సౌరభాలు

 

   మనసున మల్లెల మాలలూగెనే (మల్లీశ్వరి)  ఇది మల్లెల వేళయని, ఇది వెన్నెల మాసమనీ (సుఖదుఃఖాలు)  మల్లెపూల వాన జల్లుల్లోన (వినోదం)  మల్లియలారా మాలికలారా (నిర్దోషి)  మల్లె తీగవంటిది మగువ జీవితం (మీనా)  మల్లె పందిరి నీడలోన జాబిల్లి (మాయదారి మల్లిగాడు)  సిరిమల్లె నీవే విరి జల్లు తావే (పంతులమ్మ)  మల్లెలు పూచే వెన్నెల కాచే ఈ రేయి హాయిగా (ఇంటింటి రామాయణం)  మరుమల్లియ కన్న తెల్లనిది మకరందం కన్నా తీయనిది (మల్లెపూవు)  తెల్లచీర కట్టుకున్నదెవరి కోసము మల్లెపూలు పెట్టుకున్నదెవరి కోసము (అంతస్తులు)  మల్లెపూల మారాణికి (అమరజీవి)  సిరిమల్లె పువ్వల్లే నవ్వు (జ్యోతి)  మధుమాస వేళలో మరుమల్లె తోటలో (అందమె ఆనందం)  మల్లె కన్న తెల్లన మా సీత మనసు (ఓ సీత కథ)

  ఏ దివిలో విరిసిన పారిజాతమో (కన్నెవయసు)  పారిజాత సుమసౌరభాల (జీవితం)   విరజాజుల సువాసన స్వాగతములు పలుక సుస్వాగతములు పలుక (దేశద్రోహులు)  విరజాజి శిల పైన రాలేనులే మరుమల్లె కెంధూళి కలసేందుకే (చిరంజీవులు)  సన్నజాజులోయ్ కన్నెమోజులోయ్ (సింహబలుడు)

  సన్న జాజి పందిరి కింద మెల్లమెల్లగా (సంఘర్షణ)  సన్నజాజి పడక (క్షత్రియపుత్రుడు)   సన్నజాజి తీగలాగ నిన్ను చేరుకున్నాను (పూలరంగడు)

 - ‘ధర్మభిక్షు’ కావ్యం నుంచి

 (పాలపర్తి శ్యామలానందప్రసాద్)

 - డా. పురాణపండ వైజయంతి

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top