ఢిల్లీ: ఢిల్లీలో క్లౌడ్ సీడింగ్‌కు బ్రేక్ పడింది. కాలుష్య రాజధానిగా మారిన ఢిల్లీలో వాయు కాలుష్య భూతాన్ని తరిమికొట్టాలని రేఖా గుప్తా సారథ్యంలోని ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన క్లౌడ్ సీడింగ్ ఫెయిల్ అయ్యింది. మేఘాలను చల్లబరిచి వర్షింపజేసే రసాయనాలను చల్లే విమానాలను రంగంలోకి దింపింది. ఐఐటీ–కాన్పూర్ సహకారం, సమన్వయంతో నిన్న (అక్టోబర్ 28, మంగళవారం)రాజధానిలో మేఘావృత గగనతలంలో మేఘమథన క్రతువుకు శ్రీకారం చుట్టింది. మరికొన్ని రోజుల పాటు ఈ విమానాలు రసాయనాలను వెదజల్లే ప్రక్రియ కొనసాగుతుందని కూడా ప్రభుత్వం వెల్లడించింది. అయితే, మేఘాల్లో తగినంత తేమ లేకపోవడంతో వర్షం కురవలేదు. దీంతో ఈ ప్రక్రియను రాష్ట ప్రభుత్వం నిలిపివేసింది.
ఢిల్లీలో కాలుష్య నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు సాగిస్తోంది. వర్షించని మేఘాల నుంచి చినుకులు కురిసేలా చేసే ఈ ప్రక్రియను సాధారణంగా క్లౌడ్–సీడింగ్ అంటారు. ఇందుకోసం ప్రభుత్వం సుమారు రూ.3.21 కోట్లు కేటాయించింది. అయితే, ఇది వాయు కాలుష్యానికి తాత్కాలిక ఉపశమనంగా పనిచేస్తుందని, ఖరీదైన ఈ ప్రక్రియను శాశ్వత పరిష్కారంగా భావించకూడదని పలువురు పర్యావరణవేత్తలు అంటున్నారు.
ఐఐటీ కాన్పూర్ డైరెక్టర్ మనీంద్ర అగర్వాల్ ఇవాళ(బుధవారం) మీడియాతో మాట్లాడుతూ.. క్లౌడ్ సీడింగ్ ప్రయోగం ద్వారా కృత్రిమ వర్షం రాలేదు కానీ భవిష్యత్తు ప్రయత్నాలకు ముఖ్యమైన సమాచారం లభించిందని తెలిపారు. ఢిల్లీలో ఏర్పాటు చేసిన 15 మానిటరింగ్ స్టేషన్ల ద్వారా సేకరించిన డేటా ప్రకారం, PM 2.5, PM 10 మలినాల స్థాయిల్లో 6–10 శాతం తగ్గుదల కనిపించిందని ఆయన చెప్పారు.
కాగా, ఢిల్లీ స్థానిక ప్రాంతాలను కృత్రిమ వర్షాలతో తడిసి ముద్దచేసేందుకు ప్రత్యేక విమానాలు మంగళవారం(అక్టోబర్ 28) కాన్పూర్ నుంచి బయల్దేరాయి. ఢిల్లీలోని బురారీ, నార్త్ కరోల్ బాగ్, మయూర్ విహార్ వంటి ప్రాంతాల మీది మేఘాలపై ఈ విమానాలు సిల్వర్ అయోడైడ్, సోడియం క్లోరైడ్ మిశ్రమాలను చల్లాయి. దాదాపు 20 శాతం తేమ ఉన్న మేఘాలను కృత్రిమ వర్షాల కోసం ఎంపిక చేశారు. సెస్నా రకం విమానం ఒక్కోటి 2–2.5 కేజీల బరువైన రసాయన మిశ్రమాన్ని వేర్వేరు చోట్ల వెదజల్లింది. దాదాపు 8 ప్రాంతాల్లో క్లౌడ్–సీడింగ్‌ను చేపట్టారు.


