పరమత సహనం.. బోనం | Sakshi
Sakshi News home page

పరమత సహనం.. బోనం

Published Mon, Jul 7 2014 1:07 AM

పరమత సహనం.. బోనం - Sakshi

సంప్రదాయం: ‘‘అమ్మా బెలైల్లినాదో నాయనా... తల్లీ బెలైల్లినాదో నాయనా...’’  ఆషాఢమాసం ఆదివారం భాగ్యనగర లోగిళ్లలో మార్మోగే జనపదం ఇది. ఆషాఢం అంటేనే ఈ మహానగరికి పూనకం వస్తుంది. బోనాలంటే భక్తి భావంతో పొంగి పోవడమే కాదు.. సమష్టి తత్వానికి.. పరమత సహనానికి ప్రతీక.
 
 1908, సెప్టెంబర్ 28 తెల్లవారుజాము 2 గంటలు.. ప్రశాంతంగా సాగిపోతున్న మూసీ నది.. ఉగ్రరూపం దాల్చిన వేళ. మరో నాలుగు గంటలయ్యే సరికి ప్రళయాన్ని తలపించింది. 60 అడుగుల మేర ఉవ్వెత్తున పొంగిన మూసీ.. నగరంపై జల ఖడ్గం ఝళిపించింది. అఫ్జల్‌గంజ్, ముస్లింజంగ్, ఛాదర్‌ఘాట్ వంతెనలు ఆనవాళ్లు లేకుండా కొట్టుకుపోయాయి. 15 వేల మంది ప్రాణాలను హరించింది. పరీవాహక ప్రాంతంలోని 80 వేల ఇళ్లను ముంచెత్తింది. చార్మినార్ కట్టడంలో భాగంగా ఉన్న భాగ్యలక్ష్మీ దేవిని పూజిస్తే మూసీ శాంతిస్తుందన్న మాట ఆరో నిజాం చెవిన పడింది.
 
వెంటనే ఆయన అమ్మవారికి రాజప్రాసాదం నుంచి చీర-సారె పంపి ప్రత్యేక పూజలు జరిపించారు. ఆనాటి నుంచి ప్రతిసారీ బోనాల వేడుకకు ఆ అమ్మవారికి చీర-సారె పంపడం ఆనవాయితీగా మారింది. తర్వాతి కాలంలో రజాకార్లు అరాచకం సృష్టించిన రోజుల్లోనూ.., బోనాల వేడుక మత సామరస్యానికి ఆదర్శంగా నిలిచింది. నగర జీవనంతో పెనవేసుకున్న ఈ జనోత్సవానికి నిజాం ప్రభుత్వం కూడా పూర్తిగా సహకరించింది.  ప్రతి ఆషాఢం తొలి ఆదివారం గోల్కొండ కోటపై ఉన్న అమ్మవారికి, రెండో ఆదివారం సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి ఆలయంలో, మూడో వారం పాతబస్తీలోని మూసీ ఈవల ప్రాంతం, నాలుగో ఆదివారం మూసీ అవతలి పాతబస్తీలో బోనాలు సమర్పిస్తూ వస్తున్నారు.
 
 ఆ ఏనుగే సాక్ష్యం : బోనాల వేడుక పరమత సహనానికి ప్రతీక. నిజాం కాలం నుంచి నేటి వరకు   ఈ జన  జాతరలో అపశ్రుతులు దొర్లిన సందర్భాలు లేవు. పాతబస్తీలో అమ్మవారి ఘటాలతో నిర్వహించే ఊరేగింపులో పాల్గొన్న వారికి దాహం కోసం ముస్లిం సోదరులు మంచి నీటిని అందించేవారు. నేటికీ చాలా మంది ముస్లింలు అమ్మవారికి నైవేద్యాలు సమర్పిస్తున్నారు.
 
బోనాల వేడుకల్లో అక్కన్నమాదన్న దేవాలయం దగ్గర, లష్కర్ ఉజ్జయినీ మహంకాళి ఆలయం దగ్గర సామూహిక ఊరేగింపులో ఏనుగు పాల్గొనటం ఆనవాయితీ. పదిహేనేళ్ల కిందట.. ఏటా ఉత్సవంలో పాల్గొనే ఏనుగును జాతరలో వినియోగించే పరిస్థితి కనిపించలేదు. అనాదిగా వస్తున్న ఆచారం పడిపోతుందని నిర్వాహకులు బాధపడుతున్న సమయంలో.. నిజాం ట్రస్టు నిర్వాహకులు హష్మీ అని పిలుచుకునే తమ  ఏనుగును జాతరకు పంపారు. అప్పటి వరకు బీబీకాఆలం ఊరేగింపులో మాత్రమే పాల్గొన్న ఆ ఏనుగు.. అమ్మవారి సేవలో పాల్గొంది. మతాలు వేరైనా భక్తి భావం ఒక్కటే అని చాటిన ఈ సంఘటన మతసామరస్యానికి నిదర్శనం.
 - గౌరీభట్ల నరసింహమూర్తి

Advertisement
Advertisement