
ఆషాఢ బోనాలు
తెలంగాణ ప్రాంతంలో పెద్దమ్మ, పోచమ్మ, కట్ట మైసమ్మ, ఆరె మైసమ్మ, గండి మైసమ్మ, మాంకాళమ్మ, నల్ల పోచమ్మ, పోలేరమ్మ, ఎల్లమ్మ, జగదాంబిక పేర్లతో ప్రతి ఆషాఢమాసంలో అమ్మవార్లు బోనాలందుకుంటారు. అందుకే ఆషాఢం వచ్చిందంటే చాలు.... ప్రతి ఇంటా బోనాల హడావిడి కనిపిస్తుంది. ఆషాఢమాసం సందర్భంగా గత నెలలో ఆరంభమైన తెలంగాణ సాంస్కృతిక సంబురం బోనాల వేడుకలు ఆషాఢ బహుళ అమావాస్యతో ముగియనున్నాయి. నేడు పాతబస్తీలోని లాల్ దర్వాజాలో కొలువై ఉన్న సింహవాహిని అమ్మవారికి బంగారు బోనం సమర్పిస్తారు.
భక్తి, ఉత్సాహభరితమైన ఊరేగింపులు, సంబురాలు, ఆచారాలకు ప్రసిద్ధి చెందిన బోనాల పండుగ భాగ్యనగర వాసుల జీవితాలలో కొన్ని శతాబ్దాలుగా భాగమై ఉంది. ఒక్క హైదరాబాద్‌లోనే కాదు, తెలంగాణలో అత్యధికులు ఎక్కువగా జరుపుకునే పండుగల్లో బోనాలు ముఖ్యమైనది.
తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్‌లో గ్రామదేవతలకు ప్రతియేటా ఆషాఢమాసంలో పూజలు జరిపి, బోనాలు సమర్పించే ఈ సంప్రదాయం ఈనాటిది కాదు, వందల ఏళ్లుగా వస్తున్నదే. నగర వాతావరణంలో ఎన్ని హంగులు, ఆర్భాటాలు మార్పులు చేర్పులు చోటు చేసుకున్నా, కాలగమనంలో సంప్రదాయక పండుగలెన్నో పేరు తెలీకుండా అదృశ్యమై పోతున్నా, ఈ బోనాల వేడుకలు మాత్రం తమ వైభవాన్ని ఏమాత్రం కోల్పోకుండా అలనాటి ఆచార సంప్రదాయాలతో వైభవోపేతంగా నేటికీ కొనసాగుతుండడం విశేషం.
నవాబుల కాలం నుంచి...
మూసీ నది వరదల కారణంగా అంటువ్యాధులకు ఆలవాలమైన నగరంలో నాటి హైదరాబాద్ రాష్ట్ర ప్రధాని మహారాజా కిషన్‌ప్రసాద్ సలహా మేరకు నిజాం మీర్ మహబూబ్ అలీఖాన్ లాల్‌దర్వాజ సమీపంలోని అమ్మవారి ఆలయంలో పూజలు నిర్వహించి చార్మినార్ వద్దకు చేరిన వరదనీటిలో పసుపు, కుంకుమ, గాజులు, పట్టువస్త్రాలు సమర్పించాడట. అప్పటికి అమ్మ తల్లి శాంతించి నగరంలో ప్రశాంత వాతావరణం నెలకొనడంతో నవాబులే బోనాల ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు.
ఎందుకీ బోనాలు?
ఆషాఢమాసమంటే వర్షాకాలం.. అంటే అంటువ్యాధులకు ఆలవాలమైన మాసం. కలరా, ప్లేగు, మశూచి, క్షయ, తట్టు, పొంగు, అమ్మవారు వంటి అంటువ్యాధుల బారిన పడకుండా గ్రామదేవతలు గ్రామాలను చల్లంగా చూసేందుకే బోనాలు సమర్పిస్తారు. నియమనిష్ఠలతో అమ్మవారికి పసుపునీళ్లు, వే పాకులతో సాక పెడతారు. తర్వాత ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. ఆ తర్వాత అమ్మవారికి సమర్పించగా మిగిలిన పదార్థాలను ప్రసాదాలుగా స్వీకరిస్తారు.
అచ్చ తెలంగాణ జానపదాలు బోనాల పాటలు ఆడామగా, చిన్న పెద్ద, ధనిక బీద తారతమ్యం లేకుండా ఆనందంతో చిందులేస్తూ చెవులకింపైన అచ్చ తెలంగాణ జానపదాలు ‘‘గండిపేట గండెమ్మా దండం బెడత ఉండమ్మా.., బోనాలంటే బోనాలాయే బోనాల మీద బోనాలాయే.., అమ్మా బైలెల్లినాదే... అమ్మా సల్లంగ సూడమ్మ... మైసమ్మా మైసమ్మా... వంటి పాటలు, పోతురాజుల నృత్యవిన్యాసాలు, శివసత్తుల చిందులు చూపరులను అలరిస్తాయి.
పోతురాజుల చేతి కొరడా దెబ్బ...
పోతురాజు అంటే అమ్మవారికి సోదరుడు. తమ ఇంటి ఆడపడుచును ఆదరించేందుకు, ఆమెకు సమర్పించే ఫలహారపు బండ్లకు కాపలా కాసేందుకు విచ్చేసే పోతురాజులు నృత్యవిన్యాసాలు తప్పక చూడతగ్గవి. చిన్న అంగవస్త్రాన్ని ధరించి ఒళ్ళంతా పసుపు రాసుకుని కాళ్ళకు మువ్వల గజ్జెలు, బుగ్గన నిమ్మపండ్లు, కంటికి కాటుక, నుదుట కుంకుమ దిద్దుకుని మందంగా పేనిన పసుపుతాడును కొరడాగా ఝళిపిస్తూ, తప్పెట్ల వాద్యాలకు అనుగుణంగా గజ్జెల సవ్వడి చేస్తూ లయబద్ధంగా పాదాలు కదుపుతూ కన్నుల పండుగ చేస్తారు. పోతురాజుల చేతి కొరడా దెబ్బతినడానికి చాలామంది పోటీ పడుతుంటారు. ఎందుకంటే ఆ కొరడా దెబ్బ దుష్టశక్తులను, శారీరక రుగ్మతలను దూరంగా తరిమి కొడుతుందని వారి విశ్వాసం.
గోల్కొండ జగదాంబికదే తొలిబోనం
మొదట వేడుకలు గోల్కొండ జగదాంబిక ఆలయంలో ఆరంభమవడం ఆచారం. తర్వాత ఉజ్జయినీ మహంకాళి ఆలయంలో, ఇక ఆ తర్వాత అన్నిచోట్లా బోనాల సంరంభం మొదలవుతుంది. సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో ఒక్కోరోజు ఆషాఢ ఘటోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. ఘటాల ఊరేగింపు తర్వాతే బోనాల వేడుకలు ్ర పారంభమవుతాయి. గోల్కొండ జగదాంబిక ఆలయంలో మొదలైన ఉత్సవాలు తిరిగి ఆ అమ్మకు సమర్పించే తుదిబోనంతో ముగియడం ఆచారం.
అమ్మ... ప్రతి ఇంటి ఆడపిల్ల
ఆషాఢ మాసంలో అమ్మవారు తన పుట్టింటికి వెళుతుందని నమ్మకం. అందుకే భక్తులు ఈ పండుగ సమయంలో దేవిని దర్శించుకుని తమ స్వంత కూతురు తమ ఇంటికి వచ్చిన భావనతో, భక్తి శ్రద్ధలతోనేగాక, ప్రేమానురాగాలతో బోనాలను ఆహార నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ తంతును ఊరడి అంటారు. వేర్వేరు ప్రాంతాల్లో పెద్ద పండుగ, ఊరపండుగ వంటి పేర్లతో పిలిచేవారు. అదే తర్వాతి కాలంలో బోనాలుగా మారింది.
పండుగ రోజున స్త్రీలు పట్టుచీరలు, నగలు ధరిస్తారు. పూనకం పట్టిన కొందరు స్త్రీలు తలపై కుండని (బోనం) మోస్తూ డప్పుగాళ్ళ లయబద్ధమైన మోతలకు అనుగుణంగా దేవిని స్మరిస్తూ నర్తిస్తారు. బోనాలను మోసుకెళ్తున్న మహిళలను అమ్మవారు ఆవహిస్తారని విశ్వాసం. మహంకాళి అంశ రౌద్రాన్ని ప్రతిబింబిస్తుంది కాబట్టి ఆమెను శాంతపరచడానికై ఈ మహిళలు ఆలయాన్ని సమీపించే సమయంలో వారి పాదాలపై మిగిలిన భక్తులు నీళ్ళు కుమ్మరిస్తారు.
తొట్టెల సమర్పణ
తమ భక్తికి చిహ్నంగా ప్రతి భక్తబృందమూ ఒక తొట్టెను సమర్పించడం ఆచారంగా ఉంది.
బోనాల పండుగ సందోహం గోల్కొండ కోటలోని గోల్కొండ ఎల్లమ్మ ఆలయం వద్ద మొదలయ్యి లష్కర్ బోనాలుగా పిలువబడే సికింద్రాబాదులోని ఉజ్జయిని మహంకాళి ఆలయం, బల్కంపేట్ లోని ఎల్లమ్మ దేవాలయాల మీదుగా పాతబస్తీ ప్రాంతానికి చేరుకుంటుంది. ఆషాడంలోనే కాకుండా కొన్ని ప్రాంతాల్లో శ్రావణంలో కూడా జరుపుకుంటారు.
– డి.వి.ఆర్.