కడుపులో దాచుకోకండి

Stomach Pain Awareness Special Story - Sakshi

బాధని కడుపులో దాచిపెట్టుకుంటాం... కష్టాన్ని కూడా. మనం కష్టాలను బయటివాళ్లకు చెప్పుకుంటే కడుపు చింపుకున్నట్లే... కాళ్ల మీద వేసుకున్నట్లే. ఇదంతా ఓకే... కానీ సమస్యే కడుపు అయితే?
కాదు... కాదు.. కాదు... కడుపే సమస్య అయితే..?  అప్పుడు కూడా  దాచిపెట్టుకుంటే ఆరోగ్యాన్ని కంపు చేసుకున్నట్టే!

ఈ రోజుల్లో జస్ట్‌ ముప్ఫయి ఏళ్ల వయసుకు చేరిన వారిలో ఏదో ఒక రకమైన జీర్ణసమస్య కనపడుతుండటం మామూలైపోయింది. తిన్న వెంటనే కడుపు ఉబ్బరంగా అనిపించడమో, పొట్ట రాయిలా మారడమో, అదే పనిగా తేన్పులు రావడమో... ఇలా ఏదో ఒక ఇబ్బంది ఉండనే ఉంటోంది. ప్రతి ఇంట్లోనూ తమకు మలబద్దకం ఉందనో, కిందినుంచి గ్యాస్‌ పోతోందనో, గుండెల్లో మంటగా ఉంటోందనో చెప్పడం చాలా సాధారణం. ఇందుకు ఏ ఇల్లూ మినహాయింపు కాదంటే అతిశయోక్తి ఏమీ కాదు. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్క కుటుంబానికీ ఉపకరించేలా ఆహారం జీర్ణం అయ్యే ప్రక్రియలోనూ, జీర్ణవ్యవస్థలోనూ మనం ప్రతిరోజూ ఎదుర్కొనే సాధారణ సమస్యలూ, వాటి పరిష్కారాల వంటి అంశాలపై అవగాహన కోసం ఈ కథనం.

కడుపులో గ్యాస్‌ పైకి తన్నడం
మనం ఆహారం తీసుకోగానే ఈసోఫేగస్‌ అనే పైప్‌ ద్వారా అది జీర్ణాశయంలోకి వెళ్తుంది. అక్కడ ఆహారాన్ని జీర్ణం చేయడం కోసం ఆసిడ్‌ ఉత్పత్తి అవుతుంటుంది. మనం జీర్ణం అవడానికి తగినంత పరిమాణంలో అక్కడ ఆహారం లేకపోతే ఆ యాసిడ్‌  మన కడుపు కండరాలపై ప్రభావం చూపుతుంది. యాసిడ్‌ దేనినైనా కాల్చేస్తుందన్న విషయం తెలిసిందే కదా. అందుకే అది మన కడుపు కండరాల మీద పని పనిచేస్తుంటే కడుపులో మంటగా అనిపిస్తుంటుంది. అంతేకాదు ఆ తాలూకు పొగలు (యాసిడ్‌ ఫ్యూమ్స్‌) ఒక్కోసారి పైకి చిమ్ముతుంటాయి. అలా పైకెగసినప్పుడు దాని ప్రభావం గొంతులోనూ తెలుస్తుంది. అప్పుడు ఆసిడ్‌ గొంతులోకి, కొన్నిసార్లు నోట్లోకి కూడా ప్రవేశించి, మనకు చేదు తెలుస్తుంటుంది. దీన్నే ‘వెట్‌ బర్ప్‌’ అని కూడా అంటారు. అప్పుడు గొంతు మంటగా అనిపించడం సహజం. అందుకే గ్యాస్‌ పేరుకున్నప్పుడు కడుపులో మంటగానూ, గొంతులోకి గ్యాస్‌ఫ్యూమ్స్‌ ఎగజిమ్మినప్పుడు గ్యాస్‌ పైకి ఎగతన్నుతున్నట్లు అనిపించడం చాలా సాధారణం.

కారణాలు: కడుపులో గ్యాస్‌ సమస్యకు ఎన్నో కారణాలు ఉన్నాయి. అందులో ఇవి కొన్ని... ∙కడుపులో కొద్దిపాటి ఖాళీ కూడా మిగల్చకుండా తినడం ∙తిన్నవెంటనే పడుకోవడం ∙ఆహారంలో కొవ్వు ఎక్కువగా ఉండటం. ∙ఉప్పు, కారం, మసాలాలు అధికంగా ఉండటం. ∙మనం తీసుకున్న ఆహారంలో తగినన్ని పీచుపదార్థాలు ఉండకపోతే... అలాంటప్పుడు యాసిడ్‌ పనిచేసే సమయంలో కడుపు కండరాలకు తగినంత రక్షణ దొరకదు. యాసిడ్‌ నేరుగా కడుపు కండరాలపై పనిచేస్తుండటంతో కడుపులో మంట, గ్యాస్‌ పైకి ఎగజిమ్మడం వంటి సమస్యలు మరింత తీవ్రమవుతాయి.
ఆహారనాళం, జీర్ణకోశంలోకి ఈ రెండూ కలిసే జంక్షన్‌లో ఒక మూత (స్ఫింక్టర్‌) లాంటి నిర్మాణం ఉంటుంది. ఈ మూతను వైద్యపరిభాషలో ‘జీఈ జంక్షన్‌’ అని పిలుస్తారు. ఒకసారి జీర్ణకోశంలోకి వెళ్లిన ఆహారాన్ని మళ్లీ పైకి రాకుండా ‘జీఈ జంక్షన్‌’ అనే మూతలాంటి నిర్మాణం అడ్డుపడుతుంది. అయితే కొన్నిసందర్భాల్లో అది బలహీనంగా ఉండటం వల్ల గొంతులోకి ఆహారపు మెతుకులు రావడం, దాంతోపాటు గ్యాస్, ఆసిడ్‌ రావడం వంటి లక్షణాలు కూడా చాలా మందిలో కనిపిస్తుంటాయి. ‘జీఈ జంక్షన్‌’ సరిగా పనిచేయడానికి ఎన్నో అంశాలు దోహదం చేయాలి. ఉదాహరణకు... కడుపు కండరాలు మృదువుగా ఉండటం, అక్కడ స్రవించాల్సిన రకరకాల హార్మోన్లు సక్రమంగా స్రవించడం వంటివి. ఒకసారి కడుపులోకి ఆహారమంతా చేరుకున్న తర్వాత ఆ స్ఫింక్టర్‌ పూర్తిగా, సక్రమంగా మూసుకుపోవాలి. మనం తీసుకునే ఆహారం, కొన్నిరకాల మందులు, నరాల నుంచి ఆదేశాలు కూడా ఈ జీఈ జంక్షన్‌ అనే నిర్మాణం బలహీన పడటానికి దోహదం చేస్తుంటాయి. అంతేకాదు... మనం ఆల్కహాల్‌ తీసుకున్నప్పుడు అన్ని కండరాలూ రిలాక్స్‌ అయినట్లుగానే ఈ స్ఫింక్టర్‌ కండరాలూ రిలాక్స్‌ అవుతాయి. అలాంటప్పుడు ఆహారంతో పాటు ఆసిడ్‌ పైకి ఎగజిమ్మి ఒక్కోసారి నోట్లోకి వస్తుంది. ఆల్కహాల్‌ తాగి నిద్రపోతున్న సమయంలో ఇలా నోట్లోకి చేదు వస్తుండటం చాలామందికి అనుభవంలోకి వచ్చే సంఘటనే. అలాగే కొన్నిసార్లు కొన్ని రకాల మందులు కూడా గ్యాస్‌ట్రబుల్‌కు కారణమవుతుంటాయి.

గ్యాస్‌ సమస్యను నివారించడం ఎలా
ఒకేసారి ఎక్కువ ఆహారాన్ని మూడు పూటల్లో కాకుండా చిన్న చిన్న మోతాదుల్లో రోజులో ఎక్కువసార్లు తినడం ∙ఊబకాయం ఉన్నవారు బరువు తగ్గించుకోవడం ∙పొగతాగడం, మద్యపానం వంటి అలవాట్లు ఉన్నవారు తక్షణం వాటిని మానివేయడం. ∙రాత్రిపూట చాలా ఆలస్యంగా తినకూడదు. ∙రాత్రి ఆహారం తీసుకున్న తర్వాత కొద్దిదూరం నడవాలి. ∙రాత్రిపూట తీసుకునే చిరుతిండ్లను వీలైనంత వరకు మానేయాలి. ∙రాత్రి నిద్రకు ఉపక్రమించే ముందర రెండుగంటల పాటు ఏమీ తినకూడదు. ∙పక్కమీదకు వెళ్లగానే సాధ్యమైనంత వరకు ఎడమవైపునకు ఒరిగి పడుకోవాలి. వీలైనంతవరకు కుడివైపు తిరిగి పడుకోకూడదు. ఎందుకంటే... అలా పడుకుంటే స్ఫింక్టర్‌ మీద ఒత్తిడి పడి అది తెరుచుకుని, ఆహారం మళ్లీ వెనక్కు రావచ్చు. ఆసిడ్‌ కూడా వెనక్కు వచ్చే అవకాశం ఎక్కువ. ∙మీ తల వైపు భాగం ఒంటి భాగం కంటే కాస్త ఎత్తుగా ఉండేలా చూసుకోవాలి. ఒక మెత్త (దిండు)ను ఎక్కువగా పెట్టుకోవడం కాస్త ఉపశమనాన్ని కలిగిస్తుంది. ఈ దిండు తల కింద మాత్రమేగాక మీ భుజాల కిందివరకూ ఉంటే మేలు.

చికిత్స: ఈ సమస్య విషయంలో నివారణే మంచి చికిత్సగా భావించవచ్చు. అంటే మన జీవనశైలిని ఆరోగ్యవంతంగా మార్చుకోవడం. అంటే తక్కువ మోతాదుల్లో ఎక్కువ సార్లు తినడం, ఆహారంలో ఆకుకూరలు, కూరగాయలు ఎక్కువగా ఉండేలా చూసుకోవడం. వీటన్నింటితో గుణం కనిపించనప్పుడే హెచ్‌2 బీటాబ్లాకర్స్, ప్రోటాన్‌ పంప్‌ ఇన్హిబిటర్స్‌ (పీపీఐ) అనే మందులతో చికిత్స అవసరమవుతుంది.

గృహ వైద్యం: అప్పుడే తయారు చేసిన మజ్జిగ తీసుకోవడం ఇలాంటి సమస్యల్లో మంచి గృహవైద్యం. అప్పుడే చిలికిన మజ్జిగకు క్షారగుణం ఉంటుంది. ఇది కడుపులోని ఆసిడ్‌ (ఆమ్లం)తో కలవగానే దాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసేస్తుంది. ఫలితంగా ఆమ్లం తన ప్రభావాన్ని కోల్పోతుంది. అయితే ఈ గృహవైద్యం కోసం అప్పటికప్పుడు తయారు చేసిన తాజామజ్జిగనే (ఉప్పు లేకుండా) వాడాలి. ఎందుకంటే... కాస్త ఆలస్యం చేసినా మజ్జిగ పులవడం మొదలై అది కూడా అసిడిక్‌ (ఆమ్ల)గుణాన్ని పొందుతుంది. కాబట్టి ఆసిడ్‌లో ఆసిడ్‌ కలిసి సమస్య మరింత తీవ్రం కావచ్చు. కడుపును చల్లగా ఉంచే తాజా పెరుగు, తియ్యటి పెరుగు కూడా మంచి ఉపశమనాన్ని ఇస్తుంది. పెరుగులోని ప్రొ–బయోటిక్‌ ఫ్యాక్టర్స్‌ అక్కడి బ్యాక్టీరియాను నియంత్రించి కడుపులో మంటను తగ్గిస్తాయి.

హార్ట్‌ ఎటాక్‌గా పొరబడటమూ సహజమే!
మనం తిన్న ఆహారం ఈ ఈసోఫేగస్‌లోకి వెళ్లగానే అక్కడ దానిపై యాసిడ్‌ ప్రభావం మొదలవుతుంది. ఈసోఫేగస్‌ దాదాపు గుండె ఉన్న ప్రాంతంలోనే ఉండటంతో ఈ ఛాతీలో మంటను ఒక్కోసారి గుండెమంటగా కూడా పొరబడి ‘గుండెపోటు’ గా అపోహపడుతుంటారు. అందుకే దీన్ని ‘హార్ట్‌బర్న్‌’ అనుకోవడం సహజంగా జరిగేదే. అయితే కొందరు తమకు నిజానికి హార్ట్‌ఎటాక్‌ వచ్చినప్పుడు కూడా దాన్ని గ్యాస్‌ట్రబుల్‌గా పొరబడ్డ ఉదంతాలూ ఎన్నో ఉన్నాయి. కాబట్టి ఇలాంటి పరిస్థితి ఉన్నవారు ఒకసారి తగిన వైద్య పరీక్షలు చేయించుకుని, అది గుండెకు సంబంధించిన సమస్య కాదని నిర్ధారణ చేసుకున్న తర్వాతే నిశ్చింతగా ఉండటం మంచిది.

నివారణ
అసిడిక్‌ నేచర్‌ (ఆమ్ల స్వభావం) ఎక్కువగా ఉండే ఆహారాలైన టమాటా, నిమ్మజాతి పండ్లు, పులుపు ఎక్కువగా ఉండే పండ్లు, కూల్‌డ్రింక్స్‌లో కార్బొనేటెడ్‌ కోలా డ్రింక్స్‌ ఎక్కువగా తాగడం, కెఫిన్‌ ఎక్కువగా ఉండే కాఫీ, కొన్ని సందర్భాల్లో టీ ఎక్కువగా తాగడం వంటి అంశాలన్నీ ఛాతీలో మంట, గుండెల్లో మంటకు దోహదపడతాయి. పైన పేర్నొన్న వాటిని చాలా పరిమితంగా తీసుకోవడం లేదా వీలైతే తీసుకోకుండా ఉండటం ద్వారా ఈ సమస్యను అధిగమించవచ్చు.

కింది నుంచి గ్యాస్‌ పోవడం
ఇది చాలామందిలో చాలా ఇబ్బంది కలిగించే సమస్య. మనం ఆహారాన్ని మింగే సమయంలో గాలిని కూడా మింగుతుంటాం. ఇది పెరిస్టాలిటిక్‌ చలనం రూపంలో జీర్ణవ్యవస్థ పొడవునా వెళ్తూనే ఉంటుంది. ఈ గ్యాస్‌... జీర్ణవ్యవస్థ భాగంలో ఉంటే తేన్పు రూపంలో వెళ్తుంది. కానీ జీర్ణవ్యవస్థ కింది భాగానికి దగ్గరగా అంటే పెద్దపేగు, రెక్టమ్‌లో ఉన్నప్పుడు కిందన... మలద్వారం గుండా పోతుంటుంది. అలాంటప్పుడు ఇది చాలా ఇబ్బందిని కలిగిస్తుంటుంది.

ఎవరెవరిలో ఈ సమస్య ఎక్కువ... ?
బాగా వేగంగా తినేవారు, బాగా వేగంగా తాగేవారు ∙పొగతాగే అలవాటు ఉన్నవారు ∙చ్యూయింగ్‌గమ్‌ నమిలేవారు ∙ఎప్పుడూ ఏదో చప్పరిస్తూ ఉండేవారు ∙కార్బొనేటెడ్‌ డ్రింక్స్‌ / కూల్‌డ్రింక్స్‌ (గ్యాస్‌ ఉన్నవి) ఎక్కువగా తాగేవారు ∙వదులుగా ఉండే కట్టుడుపళ్లు ఉన్నవారు... వీరంతా గ్యాస్‌ ఎక్కువగా మింగుతుంటారు.
ఇక కొన్ని రకాల ఆహారాలు కూడా కింది నుంచి గ్యాస్‌ పోవడం అనే సమస్యను తీవ్రతరం చేసుంటాయి. ఆ ఆహారాలివే...
బీన్స్, ∙కూరగాయల్లో బ్రాకోలీ, కాలీఫ్లవర్, క్యాబేజీ, ఉల్లిగడ్డలు ∙పండ్లలో పియర్స్, ఆపిల్స్‌ ∙పొట్టు ఉన్న ధాన్యాల్లో గోధుమలు ∙గ్యాస్‌ ఉన్న పానీయాలైన సోడాలు, కార్బొనేటేడ్‌ సాఫ్ట్‌డ్రింక్స్‌ ∙పాలు, పాల ఉత్సాదనల్లో చీజ్, ఐస్‌క్రీములు, పెరుగు ∙ప్యాకేజ్‌ఫుడ్స్‌లో బ్రెడ్స్‌ వంటివి తినేవారిలో గ్యాస్‌ పోవడం ఎక్కువ.

కిందినుంచి గ్యాస్‌ పోయే సమస్యకు పరిష్కారం
మనం ఆహారం తీసుకునే సమయంలో గాలి ఎక్కువగా నోట్లో పోకుండా జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఈ సమస్యను చాలావరకు అధిగమించవచ్చు. ఆ జాగ్రత్తలివే...
తినే సమయంలో చాలా మెల్లగా, నింపాదిగా తినాలి. ∙నమిలేటప్పుడు పెదవులు మూసి తినాలి ∙పొగతాగే అలవాటు ఉంటే తక్షణం మానేయాలి.  ∙కట్టుడు పళ్లు ఉన్నవారు డెంటిస్ట్‌ సహాయంతో అవి సరిగా అమరి ఉండేలా జాగ్రత్త తీసుకోవాలి ∙సోడాలు, కూల్‌డ్రింక్స్, బీర్‌ వంటి గ్యాస్‌ నిండిన పానీయాలకు దూరంగా ఉండాలి. ∙పండ్లను కొరికి, నమిలి తినాలి. ఇలాంటి జాగ్రత్తలతో చాలావరకు ఈ సమస్యను అధిగమించవచ్చు.

మందులు : ∙మనం బీన్స్‌ లేదా గ్యాస్‌కు దోహదం చేసే కూరగాయలతో ఎక్కువగా భోజనం చేసినప్పుడు డాక్టర్ల సలహా మేరకు అల్ఫా–గెలాక్టోసైడేజ్‌ మందులు తీసుకోవడం ద్వారా గ్యాస్‌ సమస్యను తగ్గించుకోవచ్చు.
కడుపులో గ్యాస్‌ పెరిగి ఇబ్బందికరమైన నొప్పితో బాధపడుతున్నప్పుడు డాక్టర్‌ సలహా మేరకు సైమెథికోన్‌ (గ్యాస్‌–ఎక్స్, మైలాంటా గ్యాస్‌) వంటి మందులతో ఈ సమస్యను అధిగమించవచ్చు.

గమనిక: పాలు, పాల ఉత్పాదనలు తీసుకున్నప్పుడు కడుపు ఉబ్బరంగా మారిపోయి, గ్యాస్‌ సమస్య పెరుగుతుంటే... మార్కెట్‌లో ఇటీవల ల్యాక్టోజ్‌ రహిత పాలు, పాల ఉత్పాదనలు దొరుకుతున్నాయి. వాటిని ఉపయోగిస్తే గ్యాస్‌ సమస్య బాగా తగ్గుతుంది. 

ఇరిటబుల్‌ బవెల్‌ సిండ్రోమ్‌ (ఐబీఎస్‌): దీని వల్ల సాధారణ ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండదు. ఎలాంటి ప్రమాదమూ, ప్రాణాపాయమూ ఉండదు. కానీ అనుభవించేవారికి ఇదెంతో పెద్ద సమస్య. సామాజిక జీవనానికి పెద్ద అడ్డంకి. ఓ డిన్నర్‌కీ లేదా లంచ్‌కీ వెళ్దామన్నా ఇబ్బంది. ఎక్కడకు వెళ్లినా బాత్‌రూమ్‌ ఎక్కడ ఉందో అని మొదటే వెతుక్కోవాల్సిన ఇబ్బందికరమైన స్థితి. భోజనం ముగిసిన వెంటనే టాయిలెట్‌కు పరుగుపెట్టాల్సిన పరిస్థితి. నలుగురిలో ఇబ్బంది ఎప్పుడు కలుగుతుందో అన్న ఆందోళన.

లక్షణాలివి... ఒక్కోసారి మలబద్దకం, కొన్నిసార్లు నీళ్ల విరేచనాలు... కొన్నిసార్లు ఈ రెండూ కలిసి ఉన్నట్లు అనిపిస్తాయి. ఉబ్బినట్లుగా ఉన్న పొట్ట, కింది నుంచి గ్యాస్‌ పోవడం మామూలే. భోజనం ముగించిన వెంటనే కడుపునొప్పితో ఆపుకోలేని విధంగా టాయిలెట్‌కు వెళ్లాల్సిన పరిస్థితి. మలవిసర్జన తర్వాత కడుపు తేలికై, నొప్పి తగ్గుతుంది.

కారణాలు: ఐబీఎస్‌కు నిర్దిష్టమైన కారణం తెలియదు. అయితే... మన దేహంలో  జీర్ణక్రియ ఒక పద్ధతి ప్రకారం జరిగిపోతుంది. రోజూ ఉదయాన్నే మలవిసర్జన మొదలుకొని, ఆయా వేళలకు ఆకలైనప్పుడు తినాలనిపించడం అంతా మెదడునుంచి  జీర్ణవ్యవస్థకు అందే ఆదేశాల ఆధారంగా ఒక క్రమబద్ధమైన రీతిలో జరుగుతూ ఉంటుంది. ఏదైనా కారణాల వల్ల మెదడుకూ, జీర్ణవ్యవస్థకూ మధ్య సమాచార వ్యవస్థ దెబ్బతిని, అక్కడినుంచి అందే ఆదేశాలు అస్తవ్యస్తమైతే అది ఐబీఎస్‌కు దారితీస్తుందన్నది ఒక వాదన. ఇక రోజువారీ జీవితంలో తీవ్రమైన ఒత్తిడి ఎదుర్కొనేవారిలో ఇది ఎక్కువ. ఏదైనా ఒత్తిడితో కూడిన పరిస్థితి ఎదురుకాగానే మలం వస్తున్న ఫీలింగ్‌తో బాత్‌రూమ్‌కు వెళ్లాల్సి రావడం చాలామందిలో కనిపించే లక్షణమే. అదే ప్రక్రియ ఐబీఎస్‌ ఉన్నవారిలోనూ జరుగుతుంది.

అధిగమించడం ఎలా: ఇటీవల ఆహారానికీ, ఐబీఎస్‌కూ ఏదో తెలియని అంతర్లీన సంబంధం ఉందన్న విషయాన్ని అధ్యయనాలు తెలుపుతున్నాయి. ప్రధానంగా ‘ఫోడ్‌మ్యాప్స్‌’ అనే ఆహారం వల్ల ఈ సమస్య మరింత ఎక్కువవుతోందన్న వాదన వినిపిస్తోంది. ఫోడ్‌మ్యాప్‌ ఆహారం అంటే... మనం తిన్న తర్వాత పేగుల్లో పూర్తిగా జీర్ణం కాకుండా కేవలం పాక్షికంగా మిగిలిపోయే ఆహారం అన్నమాట. ఇది అలా పాక్షికంగా జీర్ణమై మిగతాది మిగిలిపోవడంతో అది పులియడం (ఫెర్మెంటేషన్‌ ప్రక్రియ) మొదలవుతుంది. ఈ ప్రక్రియలో గ్యాస్‌ వెలువడటం, అది కింది నుంచి మాటిమాటికీ పోతూ ఉండటం, గ్యాస్‌ నిండిపోయి పొట్టబిగుతయ్యేలా చేయడం వంటి లక్షణాలు కనిపిస్తుంటాయి.

ఫోడ్‌మ్యాప్స్‌ ఎక్కువగా ఉండే ఆహారాలు: మనం తినే ఆహారంలో కృత్రిమ చక్కెరలు, కొన్ని తీపిపదార్థాలు, పాలు, పండ్లలో మామిడి, ఆపిల్, కూరగాయల్లో బీట్‌రూట్, క్యాబేజీ, ఉల్లి వంటివి ఎక్కువ ఫోడ్‌మ్యాప్స్‌ ఉంటాయి. కాబట్టి వీటిని పరిమితంగానే తీసుకోవాలి.

ఫోడ్‌మ్యాట్‌ తక్కువగా ఉండే ఆహారాలు: అరటిపండ్లు, బ్లూబెర్రీ, ద్రాక్ష, నిమ్మ, ఆరెంజ్, స్ట్రాబెర్రీ వంటి వాటిల్లో ఫోడ్‌మ్యాప్స్‌ తక్కువగా ఉంటుంది. ఇలాగే గుమ్మడి, పాలకూర, టొమాటో, చిలగడదుంప (మోరంగడ్డ), కొత్తిమీర, అల్లం, ల్యాక్టోజ్‌ లేని పాలు, ఆలివ్‌ ఆయిల్, పెరుగు వంటి వాటిల్లోనూ ఫోడ్‌మ్యాప్‌  తక్కువ. ఇక గోధుమల కంటే వరి, ఓట్స్‌లో ఫోడ్‌ మ్యాప్స్‌æ తక్కువ.
గుర్తుంచుకోవాల్సిన అంశం ఏమిటంటే... ఐబీఎస్‌తో బాధపడేవారు ఫోడ్‌మ్యాప్‌ తక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. ఫోడ్‌మ్యాప్‌ ఎక్కువగా ఉండే ఆహారాన్ని వీలైనంత తక్కువగా తీసుకోవాలి.
జీర్ణసంబంధమైన అనేక సమస్యలకు కొన్ని సాధారణ పరిష్కారాలు
తక్కువ తక్కువ మోతాదుల్లో ఎక్కువ సార్లు తినండి. రోజుకు రెండు మూడు సార్లు ఎక్కువగా తినడం కంటే... తక్కువ మోతాదుల్లో 4, 5 సార్లు తినండి.
మీ ఆహారం పీచు ఎక్కువగా ఉండే ఆహారం ఎక్కువగా తీసుకోండి. ఇందుకోసం పొట్టుతో ఉండే ధాన్యాలతో చేసిన ఆహారం, ఆకుకూరలు, తాజా పండ్లు ఎక్కువగా తినండి.
మీ ఆహారంలో చేపలను వారంలో కనీసం రెండు–మూడు సార్ల కంటే ఎక్కువగా తీసుకోవడం మంచిది.
ఎక్కువ కొవ్వుతో ఉండేవి, బాగా వేయించిన ఆహారపదార్థాలను వీలైనంత దూరంగా ఉండండి. ఒకవేళ తీసుకోవాల్సి వస్తే చాలా పరిమితంగా మాత్రమే తీసుకోండి.
తినకముందే పాక్షికంగా పులిసే పదార్థాలైన ఇడ్లీ, దోసెల వంటివాటిని, (పూరీ, చపాతీల కంటే) మీ బ్రేక్‌ఫాస్ట్‌లో భాగంగా ఎక్కువగా తీసుకోండి. అలాగే ఇలా పులిసేందుకు అవకాశం పెరుగు, మజ్జిగ వంటి ఆహారాల్లో మనకూ, మన జీర్ణవ్యవస్థకు మేలు చేసే ‘ప్రో–బయాటిక్‌’ బ్యాక్టీరియా ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి ఆహారాన్ని ఎక్కువగా తీసుకోండి. అయితే అది పూర్తిగా పులియకముందే తాజాగా ఉన్నప్పుడు తినడం మంచిదని గుర్తుంచుకోండి.
మీకు మాంసాహారం తీసుకోవాలని అనిపించినప్పుడు వేటమాంసం కంటే కొవ్వు తక్కువగా ఉంటే చికెన్‌ను ఎంచుకోండి.
రోజూ కనీసం రెండు లీటర్ల కంటే ఎక్కువగా మంచినీళ్లు తాగండి. ఇక కాఫీలు, ఆల్కహాలిక్‌ డ్రింక్స్‌కు తూరంగా ఉండండి.
రోజూ చురుగ్గా ఉండండి. వ్యాయామం చేయండి. పొగతాగే అలవాటుకు, మద్యానికి దూరంగా ఉండండి.
మీ బరువు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోండి.  
ఇక్కడ పేర్కొన్న ఈ జాగ్రత్తలు తీసుకుంటున్నంత కాలం మన జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగ్గా ఉంటుందని గుర్తుంచుకోండి.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top