పాస్ట్‌ అడిగితే పేస్టే!

పాస్ట్‌ అడిగితే పేస్టే!


లీగల్‌   స్టోరీస్‌



సంతోషంగా పెళ్లి చేసుకున్నారు...

సరదాగా జీవించాలి!

ప్రెజెంట్‌ని ఎంజాయ్‌ చేయాలి...

ఫ్యూచర్‌ని ప్లాన్‌ చేయాలి!!

ఈ పాస్ట్‌ ఎంట్రా బాబూ...

నువ్వు ఎవరినైనా ప్రేమించావా?

నీకెలాంటి సంబంధాలున్నాయి?

స్మైల్‌ చేశావా? షేక్‌హ్యాండ్‌ ఇచ్చావా? అని వేధిస్తే చట్టం పట్టేస్తుంది..

బ్యాడ్‌ మొగుడిని పేస్ట్‌ చేస్తుంది!!




వంటింట్లో అంతా సర్దుకొని పడగ్గదిలోకి వెళ్లిన సువర్చల హతాశురాలైంది. ఎదురుగా..చీర కట్టుకొని, కళ్లకు కాటుక, నుదుటన బొట్టు పెట్టుకొని నిలబడి ఉన్నాడు భర్త. ‘ఈ వేషమేంటి?’ అడిగింది అయోమయంగా. ‘యే.. బాగాలేనా?’ అన్నాడు కొంటెగా. కంపరమేసింది సువర్చలకు. ‘ఛీ.. ఛీ’ అంటూ మొహం తిప్పుకొని మంచం దగ్గరకు వెళ్లబోయింది. ‘ఏయ్‌.. ఎక్కడికి వెళ్తున్నావే’ అంటూ ఆమె దండపట్టుకులాగాడు వెనక్కి. ఆ లాఘవానికి చెయ్యినొప్పితో విలవిల్లాడింది సువర్చల. తన బలాన్నంతా ఉపయోగిస్తూ చెయ్యి విడిపించుకునే ప్రయత్నం చేసింది. పట్టును మరింత బిగించాడు మోహన్‌. తన మొహాన్ని ఆమె మొహం దగ్గరకు తీసుకెళుతూ అడిగాడు.. ‘యే.. నీ మొదటి మొగుడు ఇలా సింగారించుకోలేదా ఎప్పుడు?’ అని. అలాంటి ప్రశ్నలు ఈ రెండేళ్లలో చాలానే విన్న సువర్చలకు ఆ తాజా ప్రశ్న పెద్దగా ఆశ్చర్యాన్ని ఇవ్వలేదు కాని వికారాన్ని కలిగించింది. వెంటనే మొహం పక్కకు తిప్పేసుకుంది. ‘నాటకాలా? చెప్పు.. నీ మొదటి ఇలా సింగారించుకోకపోతే ఇంకెలా సింగారించుకునేవాడు? అసలు ఏం చేసేవాడు?’ అంటూ ఆమెను మంచం మీదకు తోసేశాడు. జరగబోయే హింసను ఊహించుకొని వణికిపోయింది సువర్చల.



తెల్లవారి..

లేబర్‌ వార్డ్‌లో సర్జికల్‌ ఎక్విప్‌మెంట్స్‌ను ట్రేలో సర్దుతున్న సువర్చలను పరీక్షగా చూసింది మెర్సీ. ‘ఏయ్‌ సువర్చలా...  ఏమైంది.. మొహం మీద ఆ కమిలిన మచ్చలేంటి?’ సువర్చల భుజం పట్టుకొని తన తిప్పుకుంటూ అడిగింది మెర్సీ కంగారుగా. ‘ఏం లేదు’ అంటూ అటువైపు తిరిగింది సువర్చల. ‘నిజం చెప్పు.. ఏమైంది..ఎనీ ప్రాబ్లం?’ పట్టువదలకుండా వెంటాడింది మెర్సీ. మెర్సీ కొత్తగా ట్రాన్స్‌ఫర్‌ అయి వచ్చింది.  అయినా త్వరగానే కలిసిపోయింది తనతో. చాలా దగ్గరి స్నేహితురాలిగా అనిపిస్తుంటుంది ఆమె ఆప్యాయత చూస్తుంటే. తనలా అడిగేసరికి అప్పటిదాకా గూడు కట్టుకున్న బాధంతా కళ్లలోకి వచ్చింది సువర్చలకు. రెండు చేతుల్లో మొహం దాచుకొని అక్కడే ఉన్న కుర్చీలో కూలబడిపోయింది ఏడుస్తూ! ‘ఏంటిది.. ఏమైందో చెప్పు.. ’ అంటూ సువర్చలను అనునయించింది. తనివితీరా ఏడ్చి తన బాధను పంచుకోసాగింది సువర్చల..



మేనమామతో పెళ్లి..

‘పదిహేడేళ్లకే  ఇష్టంలేదు వద్దుమొర్రో అంటున్నా బలవంతంగా మేనమామకిచ్చి పెళ్లి చేశారు. నాకేమో చదువుకోవాలనుండింది. అందుకే పెళ్లయినా కాపురానికి వెళ్లలేదు. మేనమామే మా ఇంటికి వచ్చేవాడు. చాలా గొడవ పడేదాన్ని. యేడాది అలాగే గడిచింది. నాలో మార్పు లేకపోయేసరికి ఏమనుకున్నాడో ఏమో మామయ్య .. విడాకులిచ్చాడు. నర్సింగ్‌ కోర్స్‌లో జాయిన్‌ అయ్యాను. చదువు అయిపోయిన వెంటనే ఉద్యోగం వచ్చింది. చాలా హ్యాపీగా గడిచిపోతోంది కాలం. రెండేళ్లయ్యాక.. అమ్మ మొదలుపెట్టింది. ‘నేను ఎన్ని రోజులుంటాను.. మళ్లీ పెళ్లి చేసుకొని ఓ ఇంటిదానివికా’ అంటూ. అమ్మ స్నేహితురాలు ఓ సంబంధం తెచ్చింది. రెండో పెళ్లి అతనే. గవర్నమెంట్‌ ఉద్యోగం. మనిషి మంచివాడే పొసగక ఆ పిల్లే వెళ్లిపోయింది. మీ అమ్మాయికి ఏ లోటూ చేయడు’ అని అమ్మను ఒప్పించింది. పెళ్లి చూపుల్లో చాలా మర్యాదగానే ఉన్నాడు. అందుకే నేనూ అభ్యంతరం చెప్పలేదు. పెళ్లయింది. ఓ నెల బాగానే ఉన్నాం.



ఆ తర్వాత నుంచి మొదలు..

ప్రతి రాత్రి నరకమే. ‘నీ మొదటి భర్త ఎలా ఉండేవాడు నీతో? మేనమామనే కదా.. పెళ్లికాక ముందునుంచే చనువుండేదా?’ అంటూ ప్రశ్నలు. ‘అయ్యో.. అలాంటిదేమీ లేదు. నాకు ఇష్టం లేకుండా జరిగిన పెళ్లి అది’ అని చెప్పాను. ఓ వారం బాగానే ఉండేవాడు. తర్వాత నుంచి మళ్లీ మొదటి పాఠమే. ‘మీ ఇంటికి వచ్చేవాడు కదా.. నువ్వు ఒంటరిగా కనిపించినప్పుడు ఏం చేయకుండానే వదిలేశాడా?’ అంటూ మళ్లీ ప్రశ్నలపరంపర స్టార్ట్‌ చేసేవాడు. నెలలు నెలలు ఇలాంటి హింసే. ‘నేను బాగున్నానా.. మీ మొదటి భర్త బాగున్నాడా’ అంటూ మాటలతో ఒకటే హింస. ఓరోజు ఇవన్నీ తట్టుకోలేక.. నన్ను మా మామయ్య ముట్టుకోలేదు అని చెప్తున్నా అర్థం చేసుకోకుండా పదే పదే అవే ప్రశ్నలు అడుగుతున్నాడు అని తట్టుకోలేక.. అవునని చెప్తే ఆయన ఈగో అన్నా తృప్తి పడుతుందేమో అన్న ఆశతో ఒక్కసారి హగ్‌ చేసుకున్నాడు అని చెప్పా. అంతే ఆరోజు నుంచి ఈ వేధింపులు ఎక్కువయ్యాయి. ఎందుకు అబద్ధం చెప్పాన్రా భగవంతుడా అని నెత్తినోరు కొట్టుకున్నా. పిచ్చి చేష్టలు, పిచ్చి ప్రశ్నలతో చంపేస్తున్నాడు.  అంతటితో ఆగక ఈ హాస్పిటల్‌లోని మేల్‌ కొలీగ్స్‌తో సంబంధాలు అంటగడుతున్నాడు నాకు. నువ్వు రాకముందు.. ఓ నెల కిందటనుకుంటా.. హాస్పిటల్‌కు వచ్చి కూడా పెద్ద గొడవ చేశాడు. నా గురించి అందరికీ తెలుసు కాబట్టి.. ఎవరూ ఏమీ అనుకుండా.. ‘ఇంటి సమస్యలను హాస్పిటల్‌ దాకా రానివ్వకమ్మ’అని సున్నితంగా చెప్పి ఊరుకున్నారు. వాళ్లతో, వీళ్లతో సంబం«ధాలు అంటగడుతూ  పదేపదే మొదటి మొగుడు అంటూ మాటలతో చిత్రవధ చేస్తుంటే ఉండబట్టలేక ‘నీ మొదటి పెళ్లాంతో ఇలాగే ప్రవర్తించి ఉంటావ్‌ అందుకే వదిలేసి వెళ్లిపోయింది అంటూ ఎదురుతిరిగా కోపంతో. అంతే ‘నాకే ఎదురు మాట్లాడతావా? నన్నే  తప్పు పడతావా’అంటూ చేయి చేసుకున్నాడు. నిన్నయితే ఆయన వికృత చేష్టలు  పరాకాష్టకు వెళ్లాయి. చీర కట్టుకొని, బొట్టు, కాటుక పెట్టుకొని నన్ను మగవాడిలా చేయి..’ అంటూ మెర్సీ మీద పడి బోరున ఏడ్చేసింది సువర్చల.  ఆయన చెప్పినట్టు వినకపోతే.. ’ దుఃఖంతో మాట రాలేదు సువర్చలకు. విషయం అర్థమైన మెర్సీ ఆమె భుజం చుట్టూ చేతులేసి ఓదారుస్తూ సువర్చల వేదన తీరేదాకా ఏడ్వనిచ్చింది. తను తేరుకున్నాక ఆ రోజు సాయంకాలమే ఆమెకు తెలిసిన లాయర్‌ దగ్గరకు సువర్చలను తీసుకెళ్లింది మెర్సీ.





విపరీత ప్రవర్తన..

ఎదుటివారిని శీలవంతులు కాదని అవమానించడం, కొలీగ్స్‌తో సంబంధాలున్నాయని వేధించడం, ఒకవేళ అది రెండో పెళ్లి అయితే గనుక మొదటి భర్తతో గడిపిన శృంగార జీవితాన్ని అసాంతం వర్ణించి చప్పమనడం, వారితో తనను పోల్చిమని బలవంతం చేయడం వంటివన్నీ మానసిక హింసకిందకు వస్తాయి. ఇక విచిత్ర వస్త్రధారణ, బయటకు అలాగే వెళతానని భార్యను బెదిరిస్తూ తనకు కావలసినట్టు చేయమనడం.. తీవ్రమైన మనోవేదన కింద పరిగణిస్తారు. కొన్ని సందర్భాల్లో ఉన్మాదానికి పరాకాష్ట కూడా అవుతుంది. సువర్చల అనుభవించిన హింస కూడా ఈ కోవలోనిదే. పరిష్కారంగా విడాకులు తీసుకోవచ్చు. 498ఏ కేస్‌ వేయవచ్చు. అన్నిటికన్నా ముందు డొమెస్టిక్‌ వయొలెన్స్‌ చట్టాన్ని ఆశ్రయించి సెక్షన్‌ 18 ద్వారా రక్షణ ఉత్తర్వులు పొందవచ్చు. సెక్షన్‌ 19 ద్వారా భర్తను తక్షణమే ఆ ఇంటినుంచి పంపించేలా ఆర్డర్స్‌ పొందవచ్చు. భర్త విపరీత ప్రవర్తన భార్యను ఆత్మహత్యా ప్రయత్నానికి ఉసిగొల్పితే ఐపీసీ 306 సెక్షన్‌ కిందా కేస్‌ వేయమని అడగవచ్చు.

– ఇ. పార్వతి, అడ్వకేట్, ఫ్యామిలీ కౌన్సిలర్‌

parvathi advocate2015@gmail.com




– సరస్వతి రమ

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top