గ్రేట్‌ రైటర్‌ ; యసునారి కవబాత

Great Writer Yasunari Kawabata - Sakshi

ఆధునిక జపాన్‌ సాహిత్యంలో కొత్త సంవేదనలను చిత్రించిన రచయిత యసునారి కవబాత (1899–1972). సంప్రదాయ జపాన్‌ సాహిత్యానికి భిన్నంగా కొత్తదోవన నడిచిన రచయితల్లో కవబాత ఒకరు. నాలుగేళ్లప్పుడే తల్లిదండ్రులను కోల్పోయిన కవబాత నానమ్మ, తాతయ్య దగ్గర పెరిగాడు. ఏడేళ్లప్పుడు నానమ్మనూ, పదకొండేళ్లప్పుడు తాతయ్యనూ కోల్పోయాడు. ఈ దూరపుతనం కవబాత రచనలను తీవ్రంగా ప్రభావితం చేసింది. ఆయన పాత్రలు తమ చుట్టూ గోడ కట్టుకుని ఒంటరితనంలో ఉన్నట్టుగా ప్రవర్తిస్తాయి. ‘ద డాన్సింగ్‌ గర్ల్‌ ఆఫ్‌ ఇజు’, ‘ద స్కేర్లెట్‌ గ్యాంగ్‌ ఆఫ్‌ అసాకుస’, ‘స్నో కంట్రీ’, ‘థౌజండ్‌ క్రేన్స్‌’, ‘ద సౌండ్‌ ఆఫ్‌ ద మౌంటెన్‌’, ‘ద హౌజ్‌ ఆఫ్‌ ద స్లీపింగ్‌ బ్యూటీస్‌’, ‘ద మాస్టర్‌ ఆఫ్‌ గో’ ఆయన నవలల్లో కొన్ని. ‘పామ్‌ ఆఫ్‌ ద హేండ్‌ స్టోరీస్‌’ ఆయన కథాసంపుటి. 1968లో నోబెల్‌ పురస్కారం అందుకున్నారు. ఆ గౌరవం పొందిన తొలి జపాన్‌ రచయిత అయ్యారు. వృద్ధాప్యంలో ఆయన ఆత్మహత్య చేసుకోవడం మాత్రం సాహితీ ప్రపంచాన్ని దిగ్భ్రమకు గురిచేసింది. పార్కిన్‌సన్స్‌ డిసీజ్‌ వల్ల కలిగిన నిరాశ; స్నేహితుడు, సహ రచయిత యూకియో మిషిమా ఆత్మహత్య వల్ల కలిగిన షాక్‌ ఆయన్ని ఆత్మహత్యకు పురిగొల్పాయంటారు. ప్రమాదవశాత్తూ గ్యాస్‌ లీకై  చనిపోయాడనే వాదనా ఉంది. అయితే, కవబాత జీవిత చరిత్ర రాసినాయన మాత్రం మిషిమా ఆత్మ, కవబాతను వందల రాత్రుళ్లపాటు వెంటాడిందని చెబుతారు. 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top