రచనల్లో తనదైన ఊహా ప్రపంచాన్ని సృష్టించిన లాస్లో
స్టాక్‌హోం: కటిక చీకట్లోనూ ఆశలు వదులుకో కూడదని, విధ్వంసానికి విచలితమైన సమాజంలో తన అక్షరాలలో హాస్యాన్ని, వ్యంగ్యాన్ని కలగలిపి చైతన్యం రగిలించిన హంగెరీ రచయిత లాస్లో క్రస్నహోర్కాయ్‌కి ప్రతిష్టాత్మక నోబెల్ సాహిత్య పురస్కారం లభించింది.
స్వీడన్‌లోని స్టాక్‌హోంలో గురువారం నోబెల్ పురస్కార కమిటీలోని స్వీడిష్ అకాడెమీ అధికారి స్టీవ్ సెమ్ సాండ్‌బెర్గ్ 2025 ఏడాదికిగాను లాస్లోకు సాహిత్య నోబెల్ ఇవ్వాలని నిర్ణయించినట్టు ప్రకటించారు. ‘నాగరికత విధ్వంసం మధ్యలోనూ కళ శక్తిని పునరుద్ఘాటిస్తూ దూరదృష్టితో లాస్లో చేసిన రచనలకు నోబెల్ పురస్కారం అందజేస్తున్నాం’అని స్టీవ్ మీడియా సమావేశంలో వెల్లడించారు. నోబెల్ పురస్కారం లభించటంపై లాస్లో సంతోషం వ్యక్తంచేశారు. డిసెంబర్‌లో స్టాక్‌హోంలో లాస్లోకు ఈ పురస్కారాన్ని అందజేస్తారు.
ఇతిహాసాల్లాంటి రచనలు
లాస్లో రచనల్లో ప్రధానంగా అభౌతికమైన, అలౌకికమైన అంశాలే ఉంటాయి. వాటికి తనదైన హాస్య చతురతను జోడించి సమాజంలోని అణచివేతలు, విధ్వంసాలను ఆయన విమర్శించే తీరు అద్భుతంగా ఉంటుంది. అందుకే స్వీడిష్ అకాడెమీ లాస్లో రచనలను ఇతిహాసాలుగా అభివర్ణించింది. ‘కోఫ్కా, థామస్ బెర్న్‌హార్డ్ వంటి గొప్ప రచయితలు అనుసరించిన మధ్య యూరప్ సంప్రదాయాన్ని కొనసాగించిన గొప్ప ఇతిహాస రచయిత క్రాస్నహోర్‌కై. అసంబద్ధత, వింతైన ఊహలతో ఆయన రచనలు మూర్తీభవించాయి’అని ప్రశంసించింది.
కమ్యూనిస్టు రష్యా ప్రభావం
లాస్లో 1954లో హంగెరీలోని గ్యులా ప్రాంతంలో జన్మించారు. హంగెరీలో విప్లవానికి రెండేళ్ల ముందు ఆయన పుట్టారు. ఆ విప్లవాన్ని సోవియట్ యూనియన్ హింసాత్మకంగా అణచివేసిన తర్వాత హింగెరీలో ఏర్పడిన నాగరికత విధ్వంస పరిస్థితులు లాస్లోపై తీవ్ర ప్రభావం చూపాయి. అందుకే ఆయన రచనల్లో నాగరికత అంతం, ఆ తర్వాత ఊహా ప్రపంచాల ఆవిర్భావం, అందులోని అసంబద్ధమైన వింతలు అధికంగా కనిపిస్తాయి.
లాస్లో 1985లో తన తొలి రచన ‘సటంటాంగో’ను ప్రచురించారు. మొదటి నవలతోనే ఆయనకు విపరీతమైన గుర్తింపు లభించింది. ఆ తర్వాత రాసిన మెలాంకోలీ ఆఫ్ రెసిస్టెన్స్ (1989) కూడా మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఈ రెండు నవలలను హంగెరీ సినీ దర్శకుడు వెలా తార్ ఆ తర్వాత సినిమాలుగా తీశారు. సెజెడ్, బుడాపెస్ట్‌లో ఉన్నతవిద్య అభ్యసించిన లాస్లో.. యూరప్ దేశాలన్నీ తిరిగి అక్కడి పరిస్థితులను అధ్యయనం చేసి తన రచనల్లో వాటిని తనదైన ఊహాత్మక శైలితో పొందుపర్చారు. ‘పిచ్చితనంలోనూ వాస్తవికతను పరీక్షించటమే నా రచనల లక్షణం’అని లాస్లో గతంలో పేర్కొన్నారు.
వార్ అండ్ వార్, సీబో దేర్ బిలో (2008) రచనలు కూడా ఆయనకు మంచి గుర్తింపు తెచ్చాయి. లాస్లో ఇప్పటివరకు 5 నవలలు మాత్రమే రాసినా, అవన్నీ యూరోపి యన్ సాహిత్యంలో ఆణిముత్యాల్లా ప్రశంసలు అందుకున్నాయి. 2021లో రాసిన ‘హెర్చెట్ 07767’నవల గొప్ప సమకాలీన జర్మన్ నవలగా గుర్తింపు పొందింది. ప్రముఖ భారతీయ ఇంగ్లిష్ రచయిత ఆర్‌కే నారాయన్ రచనల్లో కనిపించే కల్పిత పట్టణం మాల్గుడి మాదిరిగా లాస్లో కూడా తన ప్రతి రచనలోనూ ఓ కల్పిత పట్టణాన్నో, గ్రామాన్నో కేంద్రంగా చేసుకొంటారు.


