వర్జీనియా: అమెరికాలోని వర్జీనియా మేయర్ ఎన్నికల్లో సరికొత్త రికార్డు నమోదయ్యింది. డెమొక్రాట్ అబిగైల్ స్పాన్‌బెర్గర్ మంగళవారం జరిగిన వర్జీనియా గవర్నర్ ఎన్నికల్లో గెలిచారు. రిపబ్లికన్ లెఫ్టినెంట్ గవర్నర్ విన్సమ్ ఎర్లే-సియర్స్‌ను ఓడించిన ఆమె 2026 మధ్యంతర ఎన్నికలకు వెళ్లే డెమొక్రాట్‌లకు కీలక విజయాన్ని అందించి, సరికొత్త చరిత్ర సృష్టించారు.
కామన్వెల్త్‌కు నాయకత్వం వహించిన తొలి మహిళగా నిలిచిన అబిగైల్ స్పాన్‌బెర్గర్ ఇటీవలే పదవీ విరమణ చేసిన రిపబ్లికన్ గవర్నర్ గ్లెన్ యంగ్‌కిన్ స్థానాన్ని భర్తీ చేయనున్నారు. ఈ విజయంతో తాము కామన్వెల్త్‌లోని ప్రతి మూలకు ఒక సందేశాన్ని పంపామని, దేశవ్యాప్తంగా ఉన్న మా తోటి అమెరికన్లకు తమ సత్తా చూపామని స్పాన్‌బెర్గర్ రిచ్‌మండ్ తన ఉత్సాహభరిత ప్రసంగంలో పేర్కొన్నారు.
మంగళవారం జరిగిన ఈ ఎన్నికల్లో డెమొక్రాట్ గజాలా ఎఫ్. హష్మీ లెఫ్టినెంట్ గవర్నర్ రేసులో గెలిచారు. ఈ పదవిని దక్కించకున్న తొలిమహిళగా హష్మీ నిలిచారు. సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజన్సీ(సీఐఏ) అధికారి అయిన స్పాన్‌బెర్గర్ ప్రచార సమయంలో దేశంలోని ఆర్థిక సమస్యలను ఎత్తిచూపారు. ఆమె అనుసరించిన వ్యూహం వచ్చే ఏడాది జరిగే ఎన్నికలలో ఇతర డెమొక్రాట్లకు ఒక నమూనాగా ఉపయోగపడనుంది.
తన ప్రచారంలో స్పాన్‌బెర్గర్ .. అధ్యక్షుడు ట్రంప్ విధానాలకు వ్యతిరేకంగా, ఆయన రూపొందించిన ఆర్థిక ప్రణాళికలను ఎండగట్టారు. ఆమె రిపబ్లికన్ మద్దతు కలిగిన ప్రాంతాలతో సహా వర్జీనియా అంతటా ప్రచారం సాగించారు. యూఎస్ ప్రభుత్వ షట్‌డౌన్, సమాఖ్య ఉద్యోగులున్న వర్జీనియాపై దాని ప్రతికూల ప్రభావాన్ని స్పాన్‌బెర్గర్ సమర్థవంతంగా వివరించారు. ఆమె అనుసరించిన ప్రచార విధానం డెమొక్రాట్లను ఏకం చేయడంలో సహాయపడింది.


