పాకం కుదిరింది పండగ అదిరింది

Enjoy Happy and Sweet Diwali

జీవితం ఎప్పుడూ మనిషిని ఫ్రై చేస్తుంటుంది.
బాణలిలో పడేసి బాధిస్తుంటుంది.
సలసలలాడే సమస్యల్లో తిరగేస్తుంటుంది.
దీపావళి రోజు ఇవన్నీ మర్చిపోండి.
పిండిని కలపండి.. నూనెలో వేయించండి.
పాకం పట్టించండి.. నోటిలో దట్టించండి.
ఎంజాయ్‌.. హ్యాపీ అండ్‌ స్వీట్‌ దీపావళి!!

జాంగ్రీ
కావలసినవి: మినప్పప్పు – 150 గ్రాములు, బియ్యప్పిండి – 50 గ్రాములు, కార్న్‌ఫ్లోర్‌ – 150 గ్రాములు, రెడ్‌ ఆరెంజ్‌ కలర్‌ – చిటికెడు (టేబుల్‌ స్పూన్‌ నీళ్లలో కరిగించి, కలపాలి), కాటన్‌ క్లాత్‌ – జాంగ్రీ చేయడానికి
పాకం: పంచదార – ముప్పావు కేజీ, పాలు – అర కప్పు, రోజ్‌ ఎసెన్స్‌ – పావు టీ స్పూన్‌ లేదా యాలకుల పొడి – టీ స్పూన్‌

తయారి: ∙మినప్పప్పును గంట సేపు నానబెట్టాలి. తర్వాత నీళ్లను వడకట్టి, పిండి మృదువుగా అయ్యేలా రుబ్బుకోవాలి. మధ్య మధ్యలో కొద్దిగా నీళ్లు కలుపుకోవచ్చు. ∙పంచదారలో అర కప్పు పాలు, నీళ్లు పోసి కరిగేవరకు కలిపి, పొయ్యి మీద పెట్టాలి. పాకం తయారయ్యాక మంట తీసేయాలి. దీంట్లో రోజ్‌ ఎసెన్స్‌ లేదా యాలకులపొడి వేసి కలపాలి ∙క్లాత్‌కి మధ్య చిన్న బటన్‌ హోల్‌ చేయాలి. రంధ్రం పెద్దగా కాకుండా ఉండటానికి చుట్టూ కుట్టాలి ∙రుబ్బుకున్న పిండిలో బియ్యప్పిండి, కార్న్‌ఫ్లోర్, ఆరెంజ్‌ కలర్‌ వేసి చేత్తో బాగా కలపాలి ∙వెడల్పాటి మూకుడు పొయ్యి మీద పెట్టి నూనె పోసి కాగనివ్వాలి. సిద్ధం చేసుకున్న పిండిని హోల్‌ చేసిన క్లాత్‌ మధ్యలో వేసి మూటలా చేయాలి ∙కాగుతున్న నూనెలో పిండి ఉన్న క్లాత్‌ చుట్టను ఒత్తుతూ రింగులు రింగులుగా పిండాలి. ముందు చిన్న చిన్నగా ఒత్తుకుంటే జాంగ్రీలు విరిగిపోవు. వీటిని రెండువైపులా వేయించుకొని తీయాలి. పొడవాటి ఇనుప చువ్వతో జాంగ్రీలు తీసి, పాకంలో ముంచి, తీయాలి.

జిలేబీ
కావలసినవి: మైదా – పావుకేజీ, శనగపిండి – 25గ్రాములు, నెయ్యి – అర కేజీ, చక్కెర – అర కేజీ, యాలకుల పొడి– అర టీ స్పూన్, కుంకుమపువ్వు – చిటికెడు
తయారి: ∙మైదా, శనగపిండిని తగినంత నీటితో ముద్దగా కలిపి రాత్రంతా నాననివ్వాలి. ఉదయం లోతు లేకుండా అడుగు చదరంగా ఉన్న పెనంలో నెయ్యి పోసి, వేడి చేయాలి. మైదా, శనగపిండి మిశ్రమాన్ని మెహిందీకి వాడే కోన్‌లాగా కాని, సన్న చిల్లు పెట్టిన మందపాటి వస్త్రంలో కాని వేసి కావలసిన ఆకారంలో నేతిలో చుట్లుగా తిప్పాలి. కరకరలాడే వరకు వేగిన తర్వాత తీసి పాకంలో వేయాలి. పాకం పీల్చుకోవడం కోసం పది నిమిషాలు ఉంచి తీయాలి. బాణలిలో నేతిని వేడి చేసేటప్పుడే మరొక స్టవ్‌ మీద చక్కెరపాకం తయారుచేసుకుంటే మంచిది. ఈ పాకంలో యాలకుల పొడివేసుకుంటే రుచి పెరుగుతుంది. ∙జిలేబీలను పాకంలో నుంచి తీసిన తర్వాత కుంకుమపువ్వుతో గార్నిష్‌ చేసుకోవచ్చు.

గులాబ్‌ జామూన్‌
కావలసినవి: పాలపొడి – ఒక కప్పు, మైదా – పావు కప్పు, గోధుమపిండి – పావుకప్పు, వెన్న – మూడు టేబుల్‌ స్పూన్లు, పాలు – పావుకప్పు, చక్కెర – రెండు కప్పులు, నీళ్లు – ఒకటిన్నర కప్పు, యాలకులు– నాలుగు (పొడి చేయాలి), బాదం పప్పులు – పది (సన్నగా పొడవుగా తరగాలి), నెయ్యి – వేయించడానికి సరిపడినంత
తయారి: ∙ఒక పాత్రలో పాల పొడి, మైదా, గోధుమ పిండి వేసి సమంగా కలిపిన తర్వాత వెన్న వేసి మళ్లీ కలపాలి. దీంట్లో పాలు పోసి చపాతీ పిండిలా కలుపుకోవాలి. మిశ్రమంలోఎక్కడా పిండి ఉండలు లేకుండా అంతా సమంగా మృదువుగా ఉండేటట్లు కలుపుకోవాలి ∙ఈ మిశ్రమాన్ని పది నిమిషాల పాటు పక్కన ఉంచాలి. ఈ టైమ్‌లో పాల పొడి, పాలతో కలుస్తుంది. ఈలోపుగా పాకం సిద్ధం చేసుకోవాలి.

చక్కెర పాకం:వెడల్పుగా ఉన్న పాత్రలో చక్కెర, నీళ్లు పోసి మరిగించాలి. చక్కెర కరిగి, రెండు వేళ్లతో తాకి చూసినప్పుడు పాకం అతుక్కుంటున్న దశలో యాలకుల పొడి వేసి కలిపి దించేయాలి ∙బాణలిలో నెయ్యి వేసి అది వేడయ్యే లోపుగా పిండి మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలు చేసుకోవాలి. ఈ ఉండలను కాగిన నేయ్యిలో సన్నని మంట మీద ముదురు గోధుమరంగు వచ్చే వరకు వేయించి తీయాలి. సిద్ధంగా ఉంచిన వేడి వేడి పాకంలో ఉండలను వేసి పైన మూత పెట్టాలి. తర్వాత సర్వ్‌ చేయాలి.
నోట్‌: జామూన్‌లు వేగేటప్పుడు, పాకం పీల్చుకునేటప్పుడు వాటి పరిమాణం పెరుగుతాయి. కాబట్టి నేయ్యిలో వేయించేటప్పుడు ఒక్కసారిగా ఎక్కువ వేయకుండా తీసుకున్న నేతిపరిమాణాన్ని బట్టి కొన్ని వేసి తీశాక మరికొన్ని వేసి వేయించాలి.

పాకం గారెలు
కావలసినవి: మినప్పప్పు – కప్పు, బెల్లం – కప్పు, యాలకుల పొడి – అర టీ స్పూన్, నూనె – వేయించడానికి తగినంత
తయారీ: ∙మినపప్పును కడిగి, 4 గంటల సేపు నానబెట్టాలి ∙నీళ్లు లేకుండా వడకట్టి, మెత్తగా రుబ్బుకోవాలి. మధ్య మధ్య కొన్ని నీళ్లు వాడుకోవచ్చు ∙కొన్ని నీళ్లు తీసుకొని, దాంట్లో బెల్లం తరుగు, యాలకు పొడి వేసి బాగా కలపాలి ∙బెల్లం కరిగాక, పొయ్యి మీద పెట్టి బాగా మరిగించాలి. పాకం బాగా చిక్కగా అయ్యేంతవరకు ఉంచి, మంట తీసేయాలి ∙కడాయిలో నూనె పోసి కాగనివ్వాలి. నిమ్మకాయంత పరిమాణంలో మిండిముద్దలు తీసుకొని గుండ్రంగా చేసి, తర్వాత అరచేత్తో లేదా అరటిఆకులో వేసి, అదిమి, మధ్యలో చిల్లు పెట్టి నూనెలో వేసి రెండువైపులా బంగారురంగు వచ్చేవరకు వేయించాలి ∙అలా వేయించిన గారెలను బెల్లం పాకంలో వేయాలి. పాకంలో 5 నిమిషాలు ఉంచి, ప్లేట్‌లోకి తీసుకొని, పై నుంచి మరికొద్దిగా పాకం పోసి సర్వ్‌ చేయాలి.

పాకం గవ్వలు
కావలసినవి:
మైదా లేదా గోధుమపిండి – కప్పు, బొంబాయిరవ్వ – టేబుల్‌ స్పూను, బెల్లం తురుము – అర కప్పు, నెయ్యి – టేబుల్‌స్పూను, నూనె – వేయించడానికి సరిపడేంత
తయారి: ∙ఒక పెద్ద పాత్రలో మైదా లేదా గోధుమపిండి, బొంబాయిరవ్వ, నెయ్యి వేసి బాగా కలుపుకోవాలి. తరవాతనీళ్లు పోసి ముద్దలా చేయాలి. ఈ ముద్ద గట్టిగా కాకుండా మృదువుగా ఉండేలా చూసుకోవాలి. దీనినిఅరగంటసేపు నాననివ్వాలి ∙నానిన ముద్దను చిన్న చిన్న ఉండలుగా చేసి, గవ్వలపీట మీద ఒత్తుకుని కాగుతున్న నూనెలో వేయించి పక్కన పెట్టుకోవాలి ∙ఒకగిన్నెలో బెల్లం, కొద్దిగా నీరు పోసి కరిగించి, ముదురు పాకం వచ్చేదాక మరగనివ్వాలి. వేయించిన గవ్వలను ఈ పాకంలో వేసి బాగా కలపాలి.

మడత కాజా!
కావలసినవి:  మైదా/గోధుమ పిండి – కప్పు, నెయ్యి – 2 టేబుల్‌ స్పూన్లు, పాలు – 2 టేబుల్‌ స్పూన్లు (కాచి చల్లార్చినవి), ఉప్పు – చిటికెడు, నీళ్లు – తగినన్ని, నూనె – వేయించడానికి తగినంత
ఫిల్లింగ్‌: బియ్యప్పిండి – 2 టేబుల్‌ స్పూన్లు, నెయ్యి – 2 టేబుల్‌ స్పూన్లు, బాదం, పిస్తాపప్పు (పలుకులు ) – 2 టేబుల్‌ స్పూన్లు
పాకం:  పంచదార – కప్పు, నీళ్లు – అర కప్పు, రోజ్‌ ఎసెన్స్‌ – టీ స్పూన్‌ (లేదా) యాలకుల పొడి – టీ స్పూన్‌
తయారీ: ∙ముందు మైదాను జల్లించుకోవాలి ∙ఇక గిన్నెలో మైదా, నెయ్యి, పాలు, ఉప్పు వేసి బాగా కలపాలి. దీంట్లో కొద్దిగా నీళ్లు చల్లి, పిండి మృదువుగా అయ్యేంతవరకు కలిపి ఒక తడి కాటన్‌ క్లాత్‌లో చుట్టి 5 నిమిషాలు ఉంచాలి ∙నిమ్మకాయపరిమాణంలో పిండి తీసుకొని, ఉండలా చేసి, చపాతీలా వత్తుకోవాలి ∙ఒక గిన్నెలో బియ్యప్పిండి, నెయ్యి వేసి కలపాలి. దీంట్లోనే బాదం, పిస్తాపప్పు పలుకులు వేసి కలపాలి. చపాతీ మీదుగా ఈ మిశ్రమాన్ని పోసి, రోల్‌ చేయాలి. తర్వాత చాకుతో రోల్‌ చేసినదానిని డైమండ్‌ షేప్‌లో కట్‌ చేయాలి ∙ఇలా బాల్స్‌ అన్నీ తయారుచేసుకున్నాక పాకం సిద్ధం చేసుకోవాలి.
పాకం:  పంచదారలో నీళ్లు కలిపి కరిగేంతవరకు ఉంచి, మరగనివ్వాలి. దీంట్లో యాలకుల పొడి 5–7 నిమిషాలు మరిగించి మంట తీసేయాలి ∙కడాయిలో నూనె, నెయ్యి పోసి కాగనివ్వాలి. దీంట్లో కట్‌ చేసి సిద్ధంగా ఉంచిన బాల్స్‌ వేసి రెండు వైపులా మంచి రంగుతేలేలా వేయించుకోవాలి. వెంటనే పాకంలో వేసి, 2 నిమిషాల సేపు ఉంచాలి. చల్లారాక తీసి సర్వ్‌ చేయాలి.

బాదుషా
కావలసినవి
: మైదా – కేజీ, వెన్న : పావుకేజీ, బేకింగ్‌ పౌడర్‌– రెండు స్పూన్లు, నూనె – కేజీ, పంచదార  – కేజీ, నీళ్లు– తగినన్ని, యాలకులు – 5 (పొడి చేయాలి)
తయారి: ∙మరిగిన నీటిలో పంచదార వేసి కొంచెం ముదురు పాకం వచ్చేంత వరకు స్టవ్‌పై ఉంచాలి ∙పాకంలో యాలకుల పొడి కలిపి దించి పక్కన పెట్టుకోవాలి. మైదాలో బేకింగ్‌ పౌడర్‌ వేసి ముద్దగా కలపాలి. కాటన్‌ క్లాత్‌ కప్పి 5 నిమిషాలు ఉంచాలి. తరువాత పిండిని మరికాస్త మృదువుగా చేత్తో అదిమి, చిన్న చిన్న ఉండలు చేయాలి. వాటిని చేత్తో అదిమి,  నూనెలో వేయించాలి. తరువాత వాటిని పంచదార పాకంలో వేయాలి. పాకంలో 15 నిమిషాలు ఉంచి తీయాలి.
నిర్వహణ: ఎన్‌.ఆర్‌.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top