
తప్పతాగి భార్య కంటిపై కత్తితో పొడిచిన భర్త
కాకినాడ జీజీహెచ్‌లో అరుదైన శస్త్రచికిత్స
మహిళ ప్రాణాలు, కంటిచూపు కాపాడిన వైద్యులు
కాకినాడ క్రైం/పి.గన్నవరం: దీపావళి పండగ పూట మద్యం తాగి పేట్రేగిపోయిన భర్త, కత్తితో తన భార్య కంట్లో పొడిచాడు. ఆ కత్తి మొన నోటి గుండా బయటకు వచి్చంది. మృత్యువుతో పోరాడుతున్న ఆమెకు కాకినాడ జీజీహెచ్ వైద్యులు పునర్జన్మనిచ్చారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం మండలం ఊడుమూడి గ్రామానికి చెందిన 35 ఏళ్ల నేలపూడి పల్లాలమ్మ (పల్లవి) భర్త గంగరాజు తాగొచ్చి నిత్యం వేధిస్తుండేవాడు.
దీపావళి రోజున మద్యం తాగి వచ్చి భార్యతో గొడవ పడ్డాడు. అర్ధరాత్రి ఇంట్లో కూరలు తరిగే కత్తి తీసుకొని భార్యను చంపే ఉద్దేశంతో తలపై బలంగా పొడవబోయాడు. ఈ క్రమంలో కత్తి గురి తప్పి పల్లాలమ్మ ఎడమ కంటికి పై భాగంలో గుచ్చుకుంది. భార్య విలవిల్లాడుతున్నా వదిలి పెట్టకుండా కత్తిని గంగరాజు బలంగా నొక్కుతూ మరింత లోతుకు దింపాడు. దీంతో, ఆ కత్తి మొన నోటి గుండా బయటకి వచ్చేసింది. ఈ దారుణాన్ని గమనించిన కుటుంబ సభ్యులు బాధితురాలిని అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో కాకినాడ జీజీహెచ్‌లో చేర్చారు.
తక్షణమే స్పందించిన వైద్యులు మంగళవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో శస్త్రచికిత్స మొదలు పెట్టారు. రెండు గంటల పాటు సుదీర్ఘ శస్త్రచికిత్స నిర్వహించి, దిగబడిన కత్తిని విజయవంతంగా తొలగించి, పల్లాలమ్మ ప్రాణాలు కాపాడారు. క్లిష్టతరమైన ఈ శస్త్రచికిత్స జీజీహెచ్ సూపరింటెండెంట్ లావణ్య కుమారి పర్యవేక్షణలో రంగరాయ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ విష్ణువర్ధన్ నేతృత్వంలో జరిగింది. బాధితురాలికి ఎస్‌ఐసీయూలో ఉంచి వైద్య సేవలు అందిస్తున్నారు. పల్లాలమ్మ కంటి చూపు, ప్రాణాలు రెండూ నిలిచాయని వైద్యులు నిర్ధారించారు. బాధితురాలి కుటుంబీకులు వైద్య బృందానికి ధన్యవాదాలు తెలిపారు.