‘గ్రేటర్’ ఘనత వైఎస్‌దే: హైదరాబాద్ వైఎస్సార్ జనభేరిలో షర్మిల | YS Sharmila campaigns in Greater Hyderabad | Sakshi
Sakshi News home page

‘గ్రేటర్’ ఘనత వైఎస్‌దే: హైదరాబాద్ వైఎస్సార్ జనభేరిలో షర్మిల

Apr 21 2014 1:36 AM | Updated on Sep 2 2017 6:17 AM

‘గ్రేటర్’ ఘనత వైఎస్‌దే: హైదరాబాద్ వైఎస్సార్ జనభేరిలో షర్మిల

‘గ్రేటర్’ ఘనత వైఎస్‌దే: హైదరాబాద్ వైఎస్సార్ జనభేరిలో షర్మిల

దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలోనే హైదరాబాద్ మహానగరంగా అభివృద్ధి చెందిం దని, 12 శివారు మున్సిపాలిటీలను కలిపి ఆయన గ్రేటర్‌గా మార్చారని వైఎస్‌ఆర్ తనయ షర్మిల పేర్కొన్నారు.

సాక్షి, సిటీబ్యూరో, న్యూస్‌లైన్ నెట్‌వర్క్: దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలోనే హైదరాబాద్ మహానగరంగా అభివృద్ధి చెందిం దని, 12 శివారు మున్సిపాలిటీలను కలిపి ఆయన గ్రేటర్‌గా మార్చారని వైఎస్‌ఆర్ తనయ షర్మిల పేర్కొన్నారు. అవుటర్ రింగ్‌రోడ్, అంతర్జాతీయ విమానాశ్రయం, మెట్రో వంటి మెగా పథకాలను వైఎస్ అమలు చేశారని గుర్తు చేశా రు. నగరానికి మంచినీరు అందించే కృష్ణా రెండో దశ ప్రాజెక్టును రికార్డు సమయంలోనే పూర్తి చేశారని, సాఫ్ట్‌వేర్ రంగంలో నగరాన్ని అతిపెద్ద ఎగుమతి కేంద్రంగా తీర్చిదిద్దారని కొనియాడారు. అయితే హైదరాబాద్‌ను అభివృద్ధి చేసింది తానేనంటూ టీడీపీ అధినేత చంద్రబాబు ప్రచారం చేసుకుంటున్నారని షర్మిల విమర్శించారు. విలువైన భూములను బాబు తన బినామీలకు దోచిపెట్టారని, ఐఎంజీకి అతి చౌకగా వందలాది ఎకరాలను ధారాదత్తం చేశారని మండిపడ్డారు. ఆదివారం హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్, సనత్‌నగర్, ఖైరతాబాద్, శేరిలింగంపల్లి నియోజకవర్గాల పరిధిలో ఐదు చోట్ల జరిగిన ‘వైఎస్సార్ జనభేరి’ సభల్లో షర్మిల పాల్గొన్నారు. ఆయా చోట్ల నిర్వహించిన రోడ్‌షోలు, బహిరంగ సభలకు జనం పోటెత్తారు. విలువలకు, విశ్వసనీయతకు, ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్న వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీని బలపరచాలని ఈ సందర్భంగా ప్రజలకు ఆమె విజ్ఞప్తి చేశారు. సంక్షేమ పథకాలు, పేదల అభ్యున్నతి కోసం కట్టుబడి పనిచేసే వైఎస్సార్‌సీపీ కావాలో లేక అధికారం కోసం ఆచరణ సాధ్యం కాని మాటలు చెబుతున్న పార్టీలు కావాలో తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైందని షర్మిల అన్నారు.
 
 అభినవ హిట్లర్ చంద్రబాబు
 
 దుర్మార్గుడు హిట్లర్ పుట్టిన రోజైన ఏప్రిల్ 20న జన్మించిన చంద్రబాబు సరిగ్గా హిట్లర్ లక్షణాలతో ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా నాశనం చేశారని షర్మిల నిప్పులు చెరిగారు. అధికార దాహం, వెన్నుపోట్లు, నమ్మక ద్రోహం, అక్రమాలు, అవినీతి, బినామి, 420 వ్యవహారాలతో బాబు అభినవ హిట్లర్ అవతారమెత్తారని తూర్పారబట్టారు. లోకకల్యాణం చేస్తానని చెప్పుకొనే బాబు నిజంగా చేసేది మాత్రం తన కొడుకు లోకేష్ కల్యాణం మాత్రమేనని ఎద్దేవా చేశారు.
 
 మహానేతకు సాటిలేరు
 
 దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం ద్వారా చదువుకున్న లక్షలాది మంది పేద విద్యార్థులు నేడు ఇంజనీర్లు, డాక్టర్లయ్యారని, ఉన్నతస్థాయి ఉద్యోగాల్లో స్థిరపడి తమ కుటుంబాలకు అండగా నిలబడ్డారని షర్మిల గుర్తు చేశారు. ఆరోగ్యశ్రీ పథకం ద్వారా పేదలకు కార్పొరేట్ ఆసుపత్రుల్లోవైద్యం చేయించిన మనసున్న మనిషి వైఎస్‌ఆర్ అని కొనియాడారు. 108, 104 ఆరోగ్య సేవల ద్వారా పేదలను ఆపదలో ఆదుకున్న నేత వైఎస్ మాత్రమేనన్నారు. అభయ హస్తం, పావలా వడ్డీ, ముస్లింలకు రిజర్వేషన్లు సహాఅనేక అద్భుత పథకాలను అమలు చేసి కోట్లాది మంది గుండెల్లో కొలువైన వైఎస్‌ఆర్‌ని ఎలా మర్చిపోగలమని ఆమె ప్రశ్నించారు.  వైఎస్‌ఆర్ తన హయాంలో ఒక్కసారి కూడా గ్యాస్, విద్యుత్, ఆర్టీసీ చార్జీలు పెంచలేదని గుర్తు చేశారు. ఆదే చంద్రబాబు, ఇటీవలి కాంగ్రెస్ ప్రభుత్వం అనేకసార్లు ధరలు పెంచి పేదల నడ్డివిరిచిందని ఆరోపించారు. వైఎస్‌ఆర్ మరణం తర్వాత సీల్డ్‌కవర్ ముఖ్యమంత్రిగా వచ్చిన కిరణ్‌కుమార్‌రెడ్డి రాష్టాన్ని అన్నివిధాలుగా భ్రష్టు పట్టించారన్నారు. కాంగ్రెస్ పాలకులు పన్నుల రూపంలో ప్రజలపై రూ. 32 వేల కోట్లు బాదారని విమర్శించారు. తప్పుడు  కేసులు బనాయించి జగనన్నను జైల్లో పెట్టారని మండిపడ్డారు. బోనులో ఉన్నా సింహం సింహమే అని ప్రజల హర్షాతిరేకాల మధ్య అన్నారు. అబద్ధపు ప్రచారంలో బాబు గోబెల్స్‌ను మించిపోయారని విమర్శించారు. తనకు వంత పాడుతున్న ఎల్లో మీడియాలో భాగమైన ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికల సహకారంతో.. ఎన్నికల్లో టీడీపీ గెలుస్తుందని, తానే ముఖ్యమంత్రి అవుతానని బాబు ప్రచారం చేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు.
 
 మానవత్వం లేని కాంగ్రెస్ నేతలు
 
 ఐదేళ్లుగా వైఎస్సార్‌సీపీ మాత్రమే ప్రజా సమస్యలపై స్పందించిందని షర్మిల పేర్కొన్నారు. వైఎస్సార్, పీజేఆర్‌లను నగరవాసులు ఇప్పటికీ తమ దేవుడిలా కొలుస్తున్నారని గుర్తు చేశారు. వైఎస్సార్ బతికున్నంత కాలం భగీరథుడు, ఇంద్రుడు, చంద్రుడు అని పొగిడిన వాళ్లే ఆయన మరణించాక ఎఫ్‌ఐఆర్‌లో పేరు చేర్చితే కిమ్మనకుండా ఉన్నారని... కాంగ్రెస్ నేతలకు ఇంగిత జ్ఞానం, మానవత్వం లేకుండా పోయాయని ఆమె మండిపడ్డారు. ముస్లింల కోసం కోర్టులో పోరాడి మరీ నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనత  వైఎస్సార్‌కే దక్కుతుందన్నారు. మహానేత ఆశయాలను వైఎస్సార్‌సీపీ కొనసాగిస్తోందని, సికింద్రాబాద్ పార్లమెంటుతో పాటు 12 మంది ముస్లింలకు వైఎస్సార్ కాంగ్రెస్ మాత్రమే టికెట్లు ఇచ్చిందన్నారు. చంద్రబాబుకు ఓటు వేస్తే మనం తీసుకున్న గోతిలో మనమే పడ్డట్లు అవుతుందన్నారు. చంద్రబాబును మించిన సైకో లేడని, ఏడాదికోసారి విద్యుత్ చార్జీలు పెంచిన ఘనత ఆయనదేనని షర్మిల ధ్వజమెత్తారు. టీడీపీ హయాంలో వ్యవసాయ విశ్వ విద్యాలయం విద్యార్థిని అనురాధపై యాసిడ్ దాడి జరిగితే చంద్రబాబు ప్రభుత్వం బాధ్యత వహించలేదని, బాధితురాలు హైకోర్టు, సుప్రీంకోర్టును ఆశ్రయించినా నష్టపరిహారం ఇవ్వక ఏడాది కాలయాపన చేశారని గుర్తు చేశారు. సదరు విద్యార్థినికి వైద్య ఖర్చులతోపాటు నష్టపరిహారం, ఉద్యోగం ఇప్పించిన ఘనత వైఎస్సార్‌దేనన్నారు. బాబు ప్రజల పక్షాన నిలవకపోవడంతో ప్రతిపక్షం బాధ్యతను జగనన్న తీసుకున్నారని చెప్పారు. ‘ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం వై.ఎస్. జగన్ వారం రోజులు దీక్ష చేశారు. రైతులు, చేనేత కార్మికుల సమస్యలపై, ధరల తగ్గింపు కోసం నిరాహార దీక్షలు చేశారు. జనం సమస్యలే తన సమస్యలనుకున్నారు. ఓదార్పు కోసం పదవులను వదులుకున్నారు’ అని షర్మిల పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని, రాజన్న రాజ్యం కోసం వైఎస్సార్‌సీపీని ఆశీర్వదించాలని ప్రజలను కోరారు. ఆదివారంనాటి షర్మిల ప్రచార సభలు, రోడ్ షోల్లో పార్టీ జూబ్లీహిల్స్ నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి కోటిరెడ్డి వినయ్‌రెడ్డి, సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థి సయ్యద్ సాజిద్ అలీ, మల్కాజ్‌గిరీ ఎంపీ అభ్యర్థి దినేష్‌రెడ్డి, చేవెళ్ల ఎంపీ అభ్యర్థి కొండా రాఘవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement