ఉ‘మెన్‌’కోసమే! | Telangana Stand With Her campaign urges youth to champion womens safety | Sakshi
Sakshi News home page

ఉ‘మెన్‌’కోసమే!

Apr 25 2026 3:38 AM | Updated on Apr 25 2026 3:38 AM

Telangana Stand With Her campaign urges youth to champion womens safety

స్త్రీలు అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారు. వారిపట్ల సమాజ ధోరణి వేగంగా మారాలన్నా, వేధింపులు తగ్గాలన్నా ముందు పురుషుల్లో మార్పురావాలి. దానికోసమే ‘స్టాండ్‌ విత్‌ హర్‌’ క్యాంపెయిన్‌ నిర్వహిస్తున్నారు సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి చారు సిన్హా. డీజీపీగా పదోన్నతి పొందిన నేపథ్యంలో ‘సాక్షి’తో చారు సిన్హా మాటామంతి.

‘‘ప్రయాణ సమయంలో మహిళల భద్రత కోసం ‘సేఫ్‌ మొబిలిటీ ఇనీషియేటివ్‌’ను నిర్వహించాం. దీనికి సంబంధించిన కార్యక్రమాల్లో భాగంగా అనేక విద్యాసంస్థలతో పాటు స్వయం సహాయక సంఘాల సభ్యులతో సమావేశాలు నిర్వహించి వారితో సంభాషించాం. విద్యార్థినులు 90 శాతం, స్వయం సహాయక సంఘాల సభ్యులు 100 శాతం ప్రయాణ సమయంలో వేధింపులకు గురయ్యారని తెలిసింది. 

బస్సులు, మెట్రోలు, రైళ్లల్లో వీరిని అసభ్యంగా తాకడం, అత్యంత హేయంగా మాట్లాడటం ఆ వేధింపుల్లో భాగం. ఈ వేధింపుల భయంతో అనేకమంది విద్యార్థినులు తాము ప్రయాణించే మార్గం, వినియోగించే రవాణా, రాకపోకల సమయాలు మార్చుకున్నారు. మా అధ్యయనం ప్రకారం ప్రయాణ సమయంలో మహిళలు 20 రకాల వేధింపులను ఎదుర్కొంటున్నట్లు తెలిసింది.

సైబర్‌లోనూ డాడులే!
ఒకప్పుడు మహిళలకు ఇంట్లో, వీధిలో, విద్యాసంస్థలు, పనిప్రదేశాల్లోనే వేధింపులు ఉండేవి. సోషల్‌మీడియా విస్తరణ తర్వాత ఇది ఆన్‌లైన్‌కూ పాకింది. ఏదైనా అంశానికి సంబంధించి ఓ మహిళ పోస్టు పెడితే... వారిపై వేలమంది కామెంట్లతో దాడి చేస్తున్నారు. ఈ సైబర్‌ మాబ్‌ అబ్యూజ్‌ విషయంలో పోలీసులూ పూర్తిస్థాయిలో చర్యలు తీసుకోలేకపోతున్నారు. కేవలం అసభ్యకరమైన కామెంట్లు ఉండే మాత్రమే కేసు నమోదు తదుపరి చర్యలకు ఆస్కారం ఉంటుంది. మహిళల మనసును గాయపరిచే వారిలో అసభ్యతతో పాటు అనేక అంశాలు ఉన్నాయి. దీనికితోడు ఓ పోస్టుకు వేల కామెంట్లు ఉన్నప్పుడు అందరిమీదా చర్యలు తీసుకోవడం ఆచరణ సాధ్యం కాని విషయం.

పురుషుల్లో మార్పు రావాలి
మహిళలను వివిధ రకాలైన వేధింపులకు గురి చేస్తున్న వారికి అది అలవాటుగా మారింది. కనీసం అది తప్పని కూడా తెలియట్లేదు. ఇప్పటివరకు మహిళల భద్రతకు సంబంధించి అనేక క్యాంపెయిన్స్‌ జరిగాయి. అవన్నీ స్త్రీలలో అవగాహన కల్పించడానికి ఉద్దేశించినవే. అయితే సమాజంలో ఉన్న పురుషుల్లో మార్పు తీసుకువస్తేనే ఈ సమస్య తీరుతుంది. 

బస్సులో ప్రయాణిస్తున్నప్పుడు ఎవరైనా పోకిరీ యువతి లేదా మహిళకు ఇబ్బంది కలిగేలా ప్రవర్తిస్తుంటే... అదేబస్సులో ఉన్న ఎవరైనా అడ్డుకోవాలి. ఘర్షణ, దాడి వరకు వెళ్లాల్సిన అవసరం లేదు. కనీసం నిలువరిస్తే మరోసారి ఆ పోకిరీ అలాంటి పని చేయడానికి ఆలోచిస్తాడు. దీంతోపాటు ఎవరికి వారుగా మహిళలను గౌరవించడం, వారి ఆత్మాభిమానాన్ని గుర్తించడం అలవర్చుకోవాలి. దీనికోసమే ‘స్టాండ్‌ విత్‌ హర్‌’ క్యాంపెయిన్‌ ప్రారంభించాం’’ అని చెప్పారు చారు సిన్హా.

వర్శిటీల్లో చర్చలు
ఈ క్యాంపెయిన్‌ ఏడాది పాటు చేస్తాం. సెలబ్రెటీలు, సోషల్‌ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్లతో కలిసి ప్రతి నెలా ఒక్కో థీమ్‌తో ప్రజల్లోకి వెళ్తున్నాం. ఇందులో భాగంగా నాలుగు వీడియోలు, ఒక ప్యానల్‌ డిస్కషన్‌ నిర్వహిస్తున్నాం. వచ్చే విద్యా సంవత్సరం (జూన్, జులై) నుంచి యూనివర్శిటీలకు వెళ్లనున్నాం. ప్రతి వర్శిటీలో ప్రొఫెసర్ల నేతృత్వంలో గ్రూపులు ఏర్పాటు చేసి మేము రూపొందించిన వీడియోలు చూపించి ప్యానల్‌ డిస్కషన్‌ పెడతాం. ఆపై ఏది గుడ్‌ బిహేవియర్, ఏది బ్యాడ్‌ బిహేవియర్‌ గుర్తింమని వారినే అడుగుతాం. ఇలా యువతరం నుంచే బాధ్యత పెంచి... వారిలో మార్పు కోసం ప్రయత్నిస్తాం.  
– చారు సిన్హా, డీజీ – సీఐడీ, ఏసీబీ, మహిళ భద్రత విభాగాల చీఫ్‌


– శ్రీరంగం కామేష్, 
క్రైమ్‌ రిపోర్టర్, హైదరాబాద్‌


 

Advertisement
 
Advertisement
Advertisement