'పవన్ కల్యాణ్ ముసుగు తొలగింది' | vasireddy padma takes on pawan kalyan, chandrababu naidu | Sakshi
Sakshi News home page

'పవన్ కల్యాణ్ ముసుగు తొలగింది'

Apr 1 2014 12:27 PM | Updated on Mar 22 2019 5:33 PM

'పవన్ కల్యాణ్ ముసుగు తొలగింది' - Sakshi

'పవన్ కల్యాణ్ ముసుగు తొలగింది'

దిగజారుడు రాజకీయాలకు పవన్ కల్యాణ్ ఆదిగురువు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ అన్నారు.

హైదరాబాద్ :  దిగజారుడు రాజకీయాలకు పవన్ కల్యాణ్ ఆదిగురువు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ అన్నారు. జనసేన పార్టీ ఉంటూ ప్రజల ముందుకు వచ్చిన పవన్ కల్యాణ్ ముసుగు తొలగిందని ఆమె వ్యాఖ్యానించారు. మంగళవారం వాసిరెడ్డి పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గొంతును పవన్ అద్దెకు తెచ్చుకున్నారని విమర్శించారు. ప్రజలను నేరుగా చంద్రబాబు ఓట్లు అడగలేక ..ఒకపక్క మోడిని, మరోపక్క పవన్ ముసుగు పెట్టుకున్నారని అన్నారు.

చంద్రబాబును విమర్శించనందుకే.. పవన్కు ఎల్లో మీడియా వత్తాసు పలుకుతోందని వాసిరెడ్డి పద్మ ధ్వజమెత్తారు. ఎల్లోమీడియా సిగ్గుమాలిన రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. వార్తల పేరిట ఈనాడు సొంత కథనాలు అల్లుతోందని, చంద్రబాబు, పవన్ ఇద్దరూ శిఖండులేనన్నారు. సామాన్య ప్రజలు ఆలోచించినట్లుగా కూడా పవన్ ఆలోచించలేకపోతున్నారన్నారు. ఒకపక్కకు ఒరిగిపోయి చంద్రబాబుకు ఆసరా ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చిందని వాసిరెడ్డి పద్మ ఈ సందర్భంగా సూటిగా ప్రశ్నించారు. 2009లో శత్రువైన చంద్రబాబు .... 2014కు వచ్చేసరికి మిత్రుడైపోయాడని ఎద్దేవా చేశారు.

ఎన్నికల్లో చంద్రబాబు గెలవడం ఈనాడు రామోజీరావుకు, ఆంధ్రజ్యోతి వేమూరి రాధాకృష్ణకు అవసరమని వాసిరెడ్డి పద్మ ఎత్తి పొడిచారు. బాబును నమ్ముకున్న పారిశ్రామికవేత్తలకు ఆయన గెలుపు అవసరం అని, అలాగే పారిశ్రామికవేత్తల నుండి ఎంపీలుగా అవతారం ఎత్తినవారికి చంద్రబాబు గెలుపు అంతే అవసరమని వాసిరెడ్డి పద్మ వ్యాఖ్యలు చేశారు. పదేళ్లుగా వీరందరి ఆరాటం ఇదేనన్నారు. సీఎం పీఠంపై ఇక కూర్చోలేనని చంద్రబాబుకు తెలుసునని అందుకే వెనకనుంచి వీరంతా చక్రం తిప్పుతున్నారన్నారు.

చంద్రబాబును అడ్డం పెట్టుకుని తమ ప్రయోజనాలు నెరవేర్చుకోవాలని చూస్తున్నారని, అందుకే ఎన్నికలు వచ్చిన ప్రతిసారి నొప్పి తెలియని ఇంజెక్షన్ల రూపంలో పాఠకుల మెదళ్లలోకి ఎక్కించాలని ఈనాడు ప్రయత్నిస్తుందన్నారు. బాబు భావజాలమంతా చెప్పకనే ఈనాడు చెప్తుందన్నారు. చంద్రబాబును కుర్చీలో కూర్చోబెట్టాలన్న ఆరాటం ఈనాడు ప్రతి అక్షరంలో కనిపిస్తుందని వాసిరెడ్డి పద్మ అన్నారు.

నరేంద్ర మోడీని ఆకాశానికి ఎత్తాలని ఈనాడు రామోజీరావుకు ఇప్పుడే ఎందుకు అనిపిస్తోందని ప్రశ్నించారు. చంద్రబాబుతో బీజేపీకి బంధం కుదిరిన తర్వాత మోడీగారిని ఆకాశానికి ఎత్తాలని రామోజీరావుకు అనిపిస్తోందన్నారు. మోడీ గెలుపు చారిత్రక అవసరమని అంతకు ముందు ఎప్పుడూ ఈనాడు ఎందుకు చెప్పలేదన్నారు. అందుకే మోడీ కోసం మూడు పేజీలు కేటాయించారని మండిపడ్డారు.

పవన్ కల్యాణ్ ఇంటర్వ్యూ కూడా దీనిలో భాగమేనని వాసిరెడ్డి పద్మ ధ్వజమెత్తారు. చంద్రబాబు-పవన్ కల్యాణ్ కాంబినేషన్లో ఓట్లు వస్తాయన్న ఆశతో పవన్ను ఈనాడు ఆకాశానికి ఎత్తేస్తోందన్నారు. పవన్ కొత్తగా రాజకీయాల్లోకి రాలేదని ...2009లో పవన్ రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఆయనలో..
ఇన్ని గొప్ప లక్షణాలు రామోజీకి ఎందుకు కనిపించలేదన్నారు. పవన్ పెట్టిన పార్టీని పార్టీ అనాలో...క్లబ్బు అనాలో తెలియని పరిస్థితిలో మాట్లాడుతున్నారన్నారు.

పవన్ గొప్పరాజకీయ వేత్తలా ఈనాడుకు కనిపించడంలో ఆశ్చర్యం లేదని వాసిరెడ్డి పద్మ వ్యాఖ్యానించారు. కొత్త పార్టీగా పవన్ వ్యాఖ్యలను మేం ముందు స్వాగతించామని, ప్రజాస్వామ్యబద్ధంగా తాము ఆహ్వానిస్తామన్నారు. అయితే చంద్రబాబు గొంతును పవన్‌ కల్యాణ్ అద్దెకు తెచ్చుకున్నారని, పవన్ పరిజ్ఞానం ఏంటో... అవగాహన ఏంటో.. ఇంటర్వ్యూలో చెప్పకనే చెప్పారన్నారు. ఇదంతా చూస్తుంటే  పెద్దగ్రాండ్ స్కీం కనిపిస్తోందని వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డిని ప్రత్యక్షంగా ఎదుర్కొనే దమ్ము, ధైర్యం లేక చంద్రబాబుకు ఇవాళ పవన్‌ కావాలి, ఒక మోడీ కావాల్సి వచ్చిందన్నారు. రామోజీరావుకు చంద్రబాబు ముఖం ఒక్కటే సరిపోవడం లేదని ఎద్దేవా చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement