‘ప్రాదేశికం’ లెక్క తేలేది రేపు | tomorrow ZPTC votes Counting , MPTC votes Counting | Sakshi
Sakshi News home page

‘ప్రాదేశికం’ లెక్క తేలేది రేపు

May 12 2014 2:09 AM | Updated on Sep 2 2017 7:14 AM

ప్రాదేశిక ఎన్నికల ఫలితాలు మంగళవారం వెల్లడికానున్నాయి. రాత్రి 8 నుంచి 9 గంటలకల్లా చివరి ఫలితం వెల్లడయ్యే అవకాశం ఉంది.

ఒంగోలు, న్యూస్‌లైన్: ప్రాదేశిక ఎన్నికల ఫలితాలు మంగళవారం వెల్లడికానున్నాయి. రాత్రి 8 నుంచి 9 గంటలకల్లా చివరి ఫలితం వెల్లడయ్యే అవకాశం ఉంది. జిల్లాలో మొత్తం 790 ఎంపీటీసీ, 56 జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగ్గా 21 ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన వాటికి ఏప్రిల్ 6న తొలిదశ, ఏప్రిల్ 11న రెండోదశలో ఎన్నికలు పూర్తయి బ్యాలెట్ బాక్సుల్లో అభ్యర్థుల భవితవ్యం  నిక్షిప్తమై ఉంది. మంగళవారం ఉదయం 8 గంటల నుంచి లెక్కింపు ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఈ సందర్భంగా మున్సిపాలిటీలు మినహా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరిగిన ప్రాంతాల్లో మంగళవారం మద్యం విక్రయాలు నిషేధించారు.  

 ఏప్రిల్ 5న  జరిగిన మొదటి దశ ఎన్నికల్లో 385 ఎంపీటీసీ స్థానాలకుగాను 1056 మంది అభ్యర్థులు, 28 జెడ్పీటీసీ స్థానాలకు 111 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.

 ఏప్రిల్ 11న జరిగిన రెండో దశ ఎన్నికల్లో 374 ఎంపీటీసీ స్థానాలకు 969 మంది, 28 జెడ్పీటీసీ స్థానాలకు వంద మంది అభ్యర్థులు పోటీ పడ్డారు.

 మొత్తంగా 769 ఎంపీటీసీ స్థానాలకు 2025 మంది అభ్యర్థులు, 56 జెడ్పీటీసీ స్థానాలకు 211 మంది పోటీలో ఉన్నారు.

 ఎస్‌ఎస్‌ఎన్ ఇంజినీరింగ్ కాలేజీలో 20 మండలాలు, రావ్‌అండ్ నాయుడు ఇంజినీరింగ్ కాలేజీలో 5, టీఆర్‌ఆర్ డిగ్రీ కాలేజీలో ఒక మండలం, ప్రకాశం ఇంజినీరింగ్ కాలేజీలో 15, శామ్యూల్ జార్జి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ కాలేజీలో 8, ఇందిరా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీలో 7 మండలాలకు కౌంటింగ్ నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఎన్నికల కౌంటింగ్ సజావుగా పూర్తిచేసేందుకు 1811 మంది కౌంటింగ్ అసిస్టెంట్స్‌ని, 906 మంది కౌంటింగ్ సూపర్‌వైజర్లను నియమించారు.
 
 లెక్కింపు ఇలా:
మొదట పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తారు. అనంతరం బ్యాలెట్ బాక్సుల్లోని బ్యాలెట్ పత్రాలను పాతిక చొప్పున కట్టలు కడతారు.

ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఓట్లను విడగొడతారు. అనంతరం ఎంపీటీసీ బ్యాలెట్‌లను, జెడ్పీటీసీ బ్యాలెట్‌లను 50 చొప్పున కట్టలు కడతారు.

ఎంపీటీసీల ఓట్ల లెక్కింపు అనంతరం మండలంలో పోలైన జెడ్పీటీసీ ఓట్లన్నింటినీ లెక్కించి ఫలితాన్ని ప్రకటిస్తారు. ఇందుకుగాను ఒక్కో రౌండ్‌కు కనీసంగా 10 నుంచి 14 టేబుళ్లను గది సామర్థ్యాన్ని బట్టి ఏర్పాటు చేస్తారు.

 అత్యల్పంగా ఒంగోలు, యద్దనపూడి మండలాల్లో కేవలం 8 ఎంపీటీసీ స్థానాలు మాత్రమే ఉండడంతో తొలి ఫలితం ప్రకటించే అవకాశం ఉంది. ఒకే రౌండ్‌తో కౌంటింగ్ ప్రక్రియ పూర్తవుతుంది. దర్శి మండలంలో 25 ఎంపీటీసీ స్థానాలుండడంతో రెండు రౌండ్లలో లెక్కింపు పూర్తిచేయాల్సి ఉంది. చివరగా దర్శి నియోజకవర్గం ఫలితం వెలువడొచ్చు. దాదాపు 26 మండలాల్లో కౌంటింగ్ ప్రక్రియ మొత్తం ఒకే రౌండ్‌లో పూర్తవుతుండగా... మిగిలిన మండలాల్లో మాత్రం రెండో రౌండ్ తప్పనిసరి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement