
సాక్షి, ఒంగోలు: ఒంగోలు(Ongole)లో భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. మంగళవారం అర్ధరాత్రి లాయర్‌పేట, శర్మ కాలేజీ పరిసర ప్రాంతాల్లో స్వల్పంగా ప్రకంపనలు వచ్చాయి. రెండు సెకన్ల పాటు భూమి కంపించినట్టు స్థానికులు చెబుతున్నారు. ప్రకంపనల కారణంగా ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు వచ్చారు.
వివరాల ప్రకారం.. ఒంగోలులో అర్ధరాత్రి సమయంలో స్వల్పంగా భూమి కంపించింది. రాత్రి రెండు గంటల సమయంలో 2 సెకన్ల పాటు భూమి కంపించినట్టు స్థానికులు చెబుతున్నారు.. ఒంగోలులోని సీఎస్ఆర్ శర్మ కాలేజీ ప్రాంతంలో భూమి అత్యధికంగా కనిపించినట్లు స్థానికులు తెలిపారు.. అయితే, రాత్రి సమయం కావటంతో స్థానికులు గుర్తించేలోపే భూ ప్రకంపనల తీవ్రత తగ్గినట్టుగా తెలుస్తోంది. కొందరు మాత్రం ప్రకంపనల కారణంగా భయంతో ఇళ్లలో నుంచి బయటకు వచ్చారు.
ఇక, దీనిపై సమాచారం అందుకున్న అధికారులు.. స్థానిక ప్రజల నుంచి పూర్తి వివరాలను సేకరిస్తున్నారు.. కాగా, ప్రకాశం జిల్లాలో గతంలోనూ భూ ప్రకంపనలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే.. ఈ ఏడాది మే నెలలో ఓసారి.. గత ఏడాది డిసెంబర్‌లోనూ ఓసారి ప్రకాశం జిల్లా ప్రజలను భూ ప్రకంపనలు భయాందోళనకు గురిచేశాయి.. అయితే, తాజాగా సంభవించిన భూప్రకంపనలపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.