
తెలుగు రాష్ట్రాలలో ప్రసిద్థి చెందిన అమ్మవారి ఆలయాలలో ప్రకాశంజిల్లా టంగుటూరు మండలం వల్లూరు గ్రామంలోని వల్లూరమ్మ ఆలయం ఒకటి. మూడు వందల సంవత్సరాల క్రితం హోమ గుండంనుండి ఉల్కాముఖిగా ఆవిర్భవించిన ఆదిశక్తి వల్లూరు గ్రామనామంతో వల్లూరమ్మగా వ్యవహరింపబడుతూ భక్తుల పూజలందుకుంటున్నది. ప్రజలను, పశుసంపదను వ్యాధి బాధలనుండి, దుష్టశక్తులనుండి కాపాడే చల్లనితల్లిగా విరాజిలుతోంది.
రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు, మంత్రులు, ఉన్నతాధికారులు వంటివారు వల్లూరమ్మను తప్పక దర్శించి పూజలు నిర్వహిస్తారు. నాయకులకు వల్లూరమ్మ ఆలయం వద్ద ఘనంగా స్వాగతం పలికి ఊరేగింపుగా తీసుకురావడం నేటికీ అమలు జరుగుతున్న సంప్రదాయం. వల్లూరమ్మ ఆవిర్భావం వెనుక ఆసక్తిదాయక కథనం ఉంది. 17వ శతాబ్దిలో ఒంగోలుతోపాటు పరిసర ప్రాంతాలను ఒంగోలు రాజులుగా పేరొందిన మందపాటి జమీందారులు పాలించేవారు. రామభద్రరాజు, రామచంద్రరాజు హైదరాబాద్, కర్నాటక నవాబులకు అనుకూలంగా వ్యవహరిస్తూ తమ రాజ్యాన్ని విస్తరించుకున్నారు. వీరిలో రామచంద్రరాజు అమిత ధైర్యశాలిగా, పరాక్రమవంతునిగా పేరొందాడు. ఒంగోలు రాజుల ప్రాబల్యం వెంకటగిరి రాజులకు కంటగింపైంది. చిలికిచిలికి గాలివాన అన్నట్లు కొన్ని విషయాలలో ఉభయుల మధ్య ఏర్పడిన తగాదా చివరకు యుద్ధానికి దారితీసే పరిస్థితి ఏర్పడింది.
ఒంగోలు రాజులు పరాక్రమంలో గొప్పవారు కాగా వెంకటగిరి రాజులు ఆర్థికంగా, సైనికపరంగా బలోపేతులు. యుద్ధంవల్ల జననష్టం, ధన నష్టం జరుగక తప్పదనే భావన కలిగింది. దీనితో వెంకటగిరి రాజులను ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా జయించాలనే ఆలోచన ఒంగోలు రాజులలో కలిగింది. ఒంగోలు రాజులకు సన్నిహితుడు, దేవీ ఉపాసకుడు, మంత్రతంత్ర శాస్త్రాలలో అపార ప్రావీణ్యం కలిగిన అద్దంకి రామచంద్రయ్య బరూరి నరసింహ యోగీంద్రుల సహకారంతో అగ్నిగుండంనుండి దివ్యశక్తిని ఉద్భవింపచేసి వెంకటగిరి రాజులను జయింవచ్చని సలహా ఇచ్చాడు. అద్దంకి రామచంద్రయ్య యజ్ఞకర్తగా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఈ సంగతి గూఢచారులద్వారా తెలుసుకున్న వెంకటగిరి రాజులు ΄ోలూరి వంశజుల సహకారంతో, పరాంకుశవారి తోడ్పాటుతో ఒంగోలు రాజులు తలపెట్టిన హోమానికి విఘాతం కలిగించే మంత్రతంత్ర ప్రక్రియలకు శ్రీకారం చుట్టారు.
ప్రధాన యజ్ఞకర్తౖయెన బరూరి నరసింహ యోగీంద్రునిపై మంత్రతంత్ర ప్రయోగం చేసారు. దాని ప్రభావంతో ఆయనకు తీవ్రమైన కడుపు నొప్పి ప్రారంభమైంది. యజ్ఞగుండంనుండి అమ్మవారుఆవిర్భవించే సమయం ఆసన్నమైందని, ఆమె ఆవిర్భవించగానే ఆమెకు హారతి ఇచ్చి, బలి సమర్పించి సంప్రీతురాలిని చేయవలసినదిగా చెప్పి ఆయన బహిర్భూమికి వెళ్లారు. జ్వాలలు వెలిగక్కుతూ యజ్ఞగుండంనుండి 12 సంవత్సరాల బాలిక రూపంలో అమ్మవారు బయలువెడలడంతో అది చూసిన అద్దంకి రామచంద్రయ్య చేష్టలుడిగి అమ్మవారికి నివేదన చేయలేదు. దాంతో ఆమె అలిగి ముందుకు సాగింది. ఆమె చూపులు ప్రసరించిన మేర అంతా మంటలు వ్యాపించి కాలి బూడిద అయ్యాయి. ఆందువల్ల ఆమెకు జ్వాలాముఖి అనే పేరు కలిగింది. ఆమె ఈతముక్కల ప్రాంతానికి చేరగానే గ్రామ రైతు రామచంద్రారెడ్డి అమ్మవారిని గమనించి ఆమెకు పాలను సమర్పించి సంతోషపరచాడు. తాను గ్రామాన్ని, ప్రజలను చల్లగా కాపాడుతూ అక్కడనే ఉంటానని పలికి జ్వాలాముఖి ఈతముక్కల గ్రామ పొలిమేరలో వెలసింది.
ఇదీ చదవండి: Sravana Sukravaram: ‘శ్రావణ లక్ష్మీ రావే మా ఇంటికి’... సెల్ఫీ షేర్ చేయండి!
ఉల్కాముఖి ఆవిర్భావం..
వెంకటగిరి రాజుల వంచనవల్ల తమ కార్యం విఫలమైందని మందపాటి రాజులు, అద్దంకి రామచంద్రయ్య బాధపడుతుండగా బరూరి నరసింహ యోగీంద్రులు శుచిౖయె యజ్ఞస్థలికి వచ్చి పరిస్థితిని గ్రహించారు. యజ్ఞగుండం నుండి మరో దివ్యశక్తిని ఆవిర్భవింపచేయవచ్చని పలికి యజ్ఞాన్ని కొనసాగించారు. కొంతసేపటికి యజ్ఞగుండంనుండి చిటపటలతో, ఉల్కలను వెదజల్లుతూ ఉల్కాముఖి ఆవిర్భవించింది. ఉల్కాముఖి ఆవిర్భవించ గానే అద్దంకి రామచంద్రయ్య, బరూరి నరసింహ యోగీంద్రులు ఆమెకు నివేదనలు సమర్పించి సంతృప్తిపరిచారు. ప్రజలను ఆపదలనుండి కాపాడవలసినదిగా వారు ఆమెను ప్రార్థించారు. వారి ప్రార్థన మేరకు ముందుకు సాగిన ఉల్కాముఖి వల్లూరు చెరువు కట్ట వద్దకు రాగానే అక్కడ నిలిచి΄ోయింది. తాను అక్కడనే ఉండి ప్రజలను, పశుసంపదను చల్లగా కాపాడుతుంటానని ఆమె వారికి హామీ ఇచ్చింది. ఆ ప్రకారమే ఉల్కాముఖి ప్రజలను దుష్టశక్తులనుండి, వ్యాధి బాధలనుండి కాపాడుతూ చల్లనితల్లిగా పూజలందుకుంటున్నది. యజ్ఞకుండంలో ఉల్కల మధ్యనుండి ఆవిర్భవించినందున ఉల్కాముఖిగా ఆమె పేరొందింది. వల్లూరు గ్రామంలో వెలసినందున వల్లూరమ్మ అనే పేరు ఆమెకు స్థిరమైంది. వల్లూరమ్మ ఆవిర్భావానికి కారణభూతులైన అద్దంకి వారి ఆడపడుచుగా వల్లూరమ్మ ప్రసిద్థి చెందింది. ఆ తర్వాత ్ర΄ాణప్రతిష్ఠ జరిగింది. తరువాతి కాలంలో అమ్మవారి విగ్రహాన్ని తయారు చేయించి ప్రతిష్ఠించారు. మరికొద్దికాలం తర్వాత శిథిలావస్థకు చేరి నిరాదరణకు గురైన ఆలయం ఆ తర్వాత జరిగిన శతచండీ యాగం లనంతరం నూతన విగ్రహ ప్రతిష్ఠ, విమాన గోపురం, ముఖ మండపం, ప్రహరీ గోడ, సింహద్వార నిర్మాణం జరిగాయి. ఆలయంలో పరివార దేవతలుగా గంగమ్మ. పొలేరమ్మ విగ్రహాలను ప్రతిష్ఠించారు.
ఆలయంలో సుందరశిల్పాల ఏర్పాటు : దాతలు, భక్తుల సహకారంతో ఆలయం లోపలి భాగంలో అష్టలక్ష్ములతోపాటు గాయత్రి, సరస్వతి, రాజరాజేశ్వరి, శివ పార్వతులు, వినాయకుడు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, దక్షిణామూర్తి వంటి పలు దేవతామూర్తులను ఏర్పాటు చేశారు. ఇవి జీవకళ ఉట్టిపడుతూ భక్తులనుఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.
విశేష కార్యక్రమాలు : వల్లూరమ్మ ఆలయంలో శ్రావణ మాసంలో సామూహిక వరలక్ష్మి వ్రతాలను నిర్వహిస్తారు. వెయ్యిమందికిపైగా మహిళలు పాల్గొంటారు. ఆశ్వయుజ మాసంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. కనుమ పర్వదినంనాడు అమ్మవారికి గ్రామోత్సవంతోపాటు వల్లూరు చెరువులో వల్లూరమ్మకు తెప్పోత్సవం నిర్వహిస్తారు. ప్రతి శుక్రవారం గుడి ఉత్సవం జరుగుతుంది.
వాహన పూజలు : వల్లూరమ్మ ఆలయం వాహన పూజలకు ప్రసిద్ధి చెందింది. జిల్లాకు చెందినవారే గాక గుంటూరు, నెల్లూరు జిల్లాలనుండి కూడా ఎంతోమంది భక్తులు తాము నూతనంగా కొనుగోలు చేసిన వాహనాలను ఆలయానికి తీసుకువచ్చి పూజలు జరిపిస్తారు. ఆలయం చుట్టూ వాహనంపై ప్రదక్షిణ చేస్తారు. అలాచేస్తే అమ్మవారి అనుగ్రహంతో ఏ విధమైన ప్రమాదాలు జరగకుండా రక్షిస్తుందని విశ్వాసం.
పొంగళ్ల సమర్పణ : ప్రతి ఆదివారం ఆలయంలోని వల్లూరమ్మకు భక్తులు పొంగళ్లను, మొక్కుబడులను సమర్పిస్తారు. సంతానం లేనివారు, వివాహం కానివారు తమ ఈప్సితాలు నెరవేరేలా చూడమంటూ అమ్మవారిని ప్రార్థిస్తారు. ఆలయం బయట పొర్లుదండాలు పెడతారు. గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. రైతులు, వ్యాపారులు కూడా తమ కోరికలు తీర్చాలంటూ అమ్మవారికి పాల పొంగళ్లు సమర్పిస్తారు. ఆదివారం వల్లూరమ్మ ఆలయం భక్తజన సందోహంతో కళకళలాడుతుంటుంది
చేరుకునే మార్గం..
వల్లూరమ్మఆలయం విజయవాడ–చెన్నై ప్రధాన జాతీయ రహదారిలో ఉండడంతో రవాణాపరంగా ప్రయాణీకులకు, భక్తులకు అనుకూలమే. ఉంటుంది. పల్లెవెలుగు బస్సులతోపాటు ఆటోలు, ఇతర ప్రైవేటు వాహనాలు అందుబాటులో ఉంటాయి.