పుర సమరం నేడే | today muncipal elections polling | Sakshi
Sakshi News home page

పుర సమరం నేడే

Mar 29 2014 11:33 PM | Updated on Aug 14 2018 4:32 PM

పుర సమరం నేడే - Sakshi

పుర సమరం నేడే

మున్సిపల్ పోరు తుది దశకు చేరింది.ఓట్ల మిషన్లతో ఎన్నికల సంఘం.. నోట్ల కట్టలతో నేతలు ఎవరికి వారుగా సిద్ధమయ్యారు.

 పోలింగ్ సమయం
 ఉ. 7 నుంచి సా.5 గం.ల వరకు


 సంగారెడ్డి మున్సిపాలిటీ, న్యూస్‌లైన్: మున్సిపల్ పోరు తుది దశకు చేరింది. ఓట్ల మిషన్లతో ఎన్నికల సంఘం.. నోట్ల కట్టలతో నేతలు ఎవరికి వారుగా సిద్ధమయ్యారు. మరోవైపు ఆదివారం జరిగే పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. కాగా రాత్రికి రాత్రే నోట్లు పంచి ఓట్లు కొల్లగొట్టేందుకు అభ్యర్థులు సిద్ధమయ్యారు. పోటీని బట్టి ఓటుకు రూ. 500 నుంచి రూ. 3 వేల వరకు పంచుతున్నట్టు సమాచారం. గజ్వేల్‌లో నాలుగు ఓట్లున్న కుటుంబానికి బంగారు నాణెం కూడా పంచుతున్నట్లు వినికిడి. ఈసీ ఆంక్షల నేపథ్యంలో రాష్ట్రీయంగా మద్యం సరఫరా చాలినంత లేకపోవడంతో అభ్యర్థులు కర్ణాటక రాష్ట్రం నుంచి తెప్పించి పంపిణీ చేస్తున్నట్టు తెలుస్తోంది.

 ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగే పోలింగ్ ప్రక్రియకు 192 పోలింగ్ కేంద్రాలు, 192 ఈవీఎంలు ఏర్పాటు చేశారు. నాలుగు మున్సిపాలిటీలు, రెండు నగర పంచాయతీల్లో మొత్తం 145 వార్డులకు గాను 845 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. మొత్తం 1,91,212 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మరో వైపు ఎలాంటి అక్రమాలు, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా  3,287 మందితో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.

 పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్ స్లిప్‌ల పంపిణీ

 వివిధ మున్సిపాలిటీలోని పోలింగ్ కేంద్రా  ల వద్ద ఓటర్లకు అవసరమైన ఓటర్ స్లిప్‌లను అందజేసేందుకు మున్సిపల్ సిబ్బంది ద్వారా ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయాలని కలెక్టర్ స్మితా సబర్వాల్ సంబంధిత అధికారులకు ఆదేశించారు. కాగా ఇదివరకే మున్సిపల్ సిబ్బంది ఇంటింటికి వెళ్లి ఓటరు స్లిప్‌లను జారీ చేశారని, దీనివల్ల పోలింగ్ కేంద్రంలో కాలయాపన లేకుండా ఓటరు జాబితాలో ఓటర్‌ను వెంటనే గుర్తించే ఆవకాశం ఉందన్నారు.

ఓటర్లు విధిగా ఓటర్ స్లిప్‌తో పాటు ఎన్నికల గుర్తింపు కార్డు లేదా ఆధార్ కార్డుతో హాజరుకావాలని కలెక్టర్ సూచించారు. పోలింగ్ కేంద్రంలో ఒక అభ్యర్థికి ఒక పోలింగ్ ఏజెంట్‌ను మాత్రమే అనుమతించనున్నట్లు తెలిపారు. పోలింగ్ కేంద్రానికి 100 మీటర్ల దూరంలో ఓటర్లు తప్ప ఇతరులకు అనుమతించేది లేదని, పోలింగ్ కేంద్రంలోకి సెల్‌ఫోన్‌లను అనుమతించేది లేదన్నారు.

 ఓటరు తీర్పుపైనే ఆశలు..

 పోలింగ్ మరికొద్ది సమయంలోప్రారంభం కానుండటంతో అభ్యర్థులంతా ఓటరు తీర్పుపైనే ఆశలు పెట్టుకున్నారు. ఇన్నిరోజులు చేసిన ప్రచారం కలిసివస్తుందో, లేదోనని అభ్యర్థుల్లో ఆందోళన నెలకొంది. తమ గుర్తు పలానా అంటూ అభ్యర్థులు ఓటర్లకు చూపిస్తూ.. తమకే ఓటు వేయాలని ఒట్టేయించుకుంటున్నారు. చివరి సమయం కీలకం కానుండటంతో పోలింగ్ కేంద్రాల సమీపంలో తమక గుర్తు గుర్తుంచుకోవాలని చెప్పించేందుకు యువతను పోగేసే పనిలో నిమగ్నమయ్యారు.

ఎన్నికల కమిషన్ నిర్దేశించిన గీత దాటకుండా.. పోలింగ్ కేంద్రానికి దూరంలో అభ్యర్థుల వారీగా.. కేంద్రాలు ఏర్పాటు చేసుకొని ‘గుర్తు.. గుర్తుంచుకోండి..’ అంటూ చివరి అస్త్రాన్ని ఉపయోగించుకునేందుకు సమాయత్తమయ్యారు. ఓటరన్న ఎవరికి పట్టం కడతారో ఫలితాల తర్వాతే తేలనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement