నా భర్తపై దుష్ర్పచారం బాధిస్తోంది | My husband hurt Criticisms | Sakshi
Sakshi News home page

నా భర్తపై దుష్ర్పచారం బాధిస్తోంది

Apr 23 2014 3:52 AM | Updated on Mar 29 2019 9:24 PM

నా భర్తపై దుష్ర్పచారం బాధిస్తోంది - Sakshi

నా భర్తపై దుష్ర్పచారం బాధిస్తోంది

తన భర్త రాబర్ట్ వాద్రాపై బీజేపీ ఆరోపణలు గుప్పించడం తనను తీవ్రంగా బాధిస్తోందని ప్రియాంకా గాంధీ చెప్పారు. తన కుటుంబాన్ని అప్రతిష్టపాలు చేయడానికి బీజేపీ ప్రయత్నిస్తోందని మండిపడ్డారు.

రాజకీయ కుట్రతోనే బీజేపీ విమర్శలు: ప్రియాంక
మా కుటుంబాన్ని అవమానిస్తే..  మరింత దృఢంగా మారతాం

 
 రాయ్‌బరేలీ, కోల్‌కతా: తన భర్త రాబర్ట్ వాద్రాపై బీజేపీ ఆరోపణలు గుప్పించడం తనను తీవ్రంగా బాధిస్తోందని ప్రియాంకా గాంధీ చెప్పారు. తన కుటుంబాన్ని అప్రతిష్టపాలు చేయడానికి బీజేపీ ప్రయత్నిస్తోందని మండిపడ్డారు.ఈ విషయంలో ఆమె తొలిసారిగా మాట్లాడారు. రాజకీయ దురుద్దేశంతోనే ప్రతిపక్షం అసత్య ఆరోపణలకు దిగుతోందని, తమ కుటుంబాన్ని ఎంతగా అవమానిస్తే తాము మరింత దృఢంగా మారుతామని వ్యాఖ్యానించారు. ఢిల్లీ చుట్టుపక్కల, హర్యానాలో వాద్రా పెద్ద ఎత్తున భూములు ఆక్రమించాడని.. ఎన్డీయే అధికారంలోకి వచ్చాక వాద్రా జైలుకు వెళ్లక తప్పదని బీజేపీ నేతలు కొద్ది రోజులుగా విమర్శిస్తున్న విషయం తెలిసిందే. దీనిపై మంగళవారం ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ప్రియాంకాగాంధీ మాట్లాడారు.

‘‘మా కుటుంబాన్ని అవమానిస్తున్నారు. నా భర్తపై అసత్యపు ఆరోపణలు చేస్తున్నారు. ఇది నాకు చాలా బాధ కలిగిస్తోంది. రాజకీయ దురుద్దేశంతో మా కుటుంబంపై విమర్శలు చేస్తున్నారు. ఇందుకోసం నా భర్తను వినియోగించుకుంటున్నారు. వారెంతగా అప్రతిష్టపాలు చేయాలని చూస్తే.. అంతకంటే ఎక్కువగా నేను దృఢంగా మారుతా’’ అని ప్రియాంక పేర్కొన్నారు. తాము చేసిన అభివృద్ధి తదితర అంశాలపై నుంచి ప్రజల దృష్టి మరల్చడానికి అవాస్తవ ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. కాగా గాంధీ కుటుంబ సభ్యులను అప్రతిష్టపాలు చేసేందుకు మోడీ సహా బీజేపీ నేతలు వ్యక్తిగత ఆరోపణలకు దిగుతున్నారని కేంద్ర హోంమంత్రి షిండే పేర్కొన్నారు.
 
ఈ బాధ ముందే పడాల్సింది: బీజేపీ

 ప్రియాంక మాటలపై బీజేపీ స్పందించింది. తమ కుటుంబసభ్యులు తప్పులు చేసినప్పుడే ప్రియాంక బాధపడి ఉండాల్సిందని... తప్పు చేసినప్పుడు ఊరుకుని, అవి బయపడినప్పుడు బాధపడడం ఏమిటని ఆ పార్టీ జాతీయ కోశాధికారి పీయూష్ గోయల్ పేర్కొన్నారు.
 
 

Advertisement
 
Advertisement
Advertisement