లగడపాటి మారీచ రాజకీయం | mv mysoora reddy takes on Lagadapati Rajagopal | Sakshi
Sakshi News home page

లగడపాటి మారీచ రాజకీయం

May 4 2014 2:21 AM | Updated on May 25 2018 9:12 PM

లగడపాటి మారీచ రాజకీయం - Sakshi

లగడపాటి మారీచ రాజకీయం

తాను రాజకీయాల్లో లేనంటూనే మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ రాజకీయ ఒత్తిళ్లకు లొంగి సర్వేల పేరుతో మారీచ రాజకీయాలు చేస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విమర్శించింది.

* రాజకీయ ఒత్తిళ్లతో సర్వే అంటూ కాకిలెక్కలు: మైసూరా
* పోలింగ్‌కు ముందు ఓటర్లను ప్రలోభ పెట్టే కుయుక్తులని వ్యాఖ్య
 
 సాక్షి, హైదరాబాద్: తాను రాజకీయాల్లో లేనంటూనే మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ రాజకీయ ఒత్తిళ్లకు లొంగి సర్వేల పేరుతో మారీచ రాజకీయాలు చేస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. తెలుగుదేశం పార్టీ ఒత్తిళ్లకు లొంగో, వారితో కుమ్మక్కయ్యో ఆ పార్టీకి ప్రయోజనం కలిగించేలా సర్వే ప్రకటనలు చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ సీనియర్ నాయకుడు డాక్టర్ ఎం.వి.మైసూరారెడ్డి విమర్శించారు. తన సర్వే ఫలితమంటూ కాకి లెక్కలు చెబుతూ, పోలింగ్ ముంగిట్లో పరోక్షంగా ఓటర్లను ప్రలోభ పెట్టే ఈ కుయుక్తులను తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఇది అనైతికమే కాకుండా ఎన్నికల నిబంధనలకు విరుద్ధమని కూడా మైసూరా శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ‘నీ సర్వే ఏంటి? శాంపిల్ ఎంత? మెథడాలజీ ఏమిటి? ఇవేమీ లేకుండా తెలుగుదేశం పార్టీకి అనుకూలించే ప్రకటనలు చేయడం ఏ రకంగా సమంజసం?’ అని ప్రశ్నించారు.

ఎన్నికల నియమావళికి విరుద్ధంగా ఇటువంటి ప్రకటనలు చేయడాన్ని తాము సవాల్ చేస్తామని పేర్కొన్నారు. ‘తెలంగాణలో తెరాస ఆధిక్యత ఉందనేదే నీ సర్వే ఫలితమైతే, 30 తేదీన అక్కడ పోలింగ్ అయిన వెంటనే ఎందుకు చెప్పలేదు?’ అని నిలదీశారు. సర్వేల పేరుతో రాజకీయ దురుద్దేశాల్ని వెల్లడించడం ఆయనకు కొత్తేమీ కాదని, లోగడ ఉప ఎన్నికల  సందర్భంగా వైఎస్సార్‌సీపీ తుడిచిపెట్టుకుపోతుందన్నారని, ఆయన సర్వేలోని విశ్వసనీయత ఎంతో ఆనాటి ఫలితాలతోనే సుస్పష్టంగా తేలిపోరుుందని గుర్తు చేశారు. ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో సీమాంధ్రలో టీడీపీ, తెలంగాణలో టీఆర్‌ఎస్ సొంతంగా ప్రభుత్వాల్ని ఏర్పాటు చేస్తాయని తన సర్వేలో తేలిందని లగడపాటి శనివారం మీడియూ సమావేశంలో చెప్పారు. కేంద్రంలో ఎన్డీయే కూటమి 270కి పైగా సీట్లు సాధిస్తుందని పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement