పూడి శ్రీహరి ‘రిమాండ్ తిరస్కరణ ఆదేశాల’ అమలును నిలిపివేసిన హైకోర్టు
ఆదేశాలను రద్దుచేయలేదు కాబట్టి పోలీసులు అరెస్ట్ చేయలేరని స్పష్టీకరణ
అరెస్ట్ చేస్తే, అరెస్ట్ చేయమనండి.. మేమూ చూస్తామన్న న్యాయమూర్తి
శ్రీహరి, గిరీష్ కుమార్‌రెడ్డిలకు నోటీసులు.. విచారణ 21కి వాయిదా
సాక్షి, అమరావతి: సోషల్ మీడియా పోస్టుల వ్యవహారంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి (మీడియా) పూడి శ్రీహరి, సోషల్ మీడియా యాక్టివిస్ట్ గిరీష్ కుమార్‌రెడ్డికి రిమాండ్ విధించేందుకు నిరాకరిస్తూ కుప్పం కోర్టు జారీ చేసిన ఉత్తర్వుల అమలును హైకోర్టు నిలిపేసింది. ప్రతివాదులుగా ఉన్న శ్రీహరి, గిరీష్ కుమార్‌రెడ్డిలకు నోటీసులు జారీ చేసింది.
రిమాండ్ తిరస్కరణ ఆదేశాల అమలును మాత్రమే నిలిపివేశామని, రద్దు చేయలేదని పేర్కొన్న హైకోర్టు ఈ నేపథ్యంలో నిందితులను పోలీసులు అరెస్ట్ చేయలేరని వివరించింది. ‘అయినా కూడా పోలీసులు అరెస్ట్ చేస్తే, అరెస్ట్ చేయమనండి.. మేమూ చూస్తాం..’ అంటూ ఘాటుగా వ్యాఖ్యానించింది. తదుపరి విచారణను ఈ నెల 21కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ యడవల్లి లక్ష్మణరావు శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు.
పోలీసుల లంచ్‌మోషన్ పిటిషన్
కుప్పం కోర్టు గురువారం జారీ చేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ పోలీసులు హైకోర్టులో అత్యవసర లంచ్‌మోషన్ పిటిషన్లు దాఖలు చేశారు. శ్రీహరిని రిమాండ్‌కు పంపేలా ఆదేశాలు ఇవ్వాలని పోలీసుల తరఫున అడ్వకేట్ జనరల్ (ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపించారు. వాదనలు విన్న న్యాయమూర్తి కుప్పం కోర్టు ఉత్తర్వుల అమలును నిలిపివేస్తూ, ప్రతివాదులు శ్రీహరి, గిరీష్ కుమార్‌రెడ్డిలకు నోటీసులు జారీ చేశారు.
ఇంతలో ఈ విషయం తెలుసుకున్న శ్రీహరి తరఫున సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌రెడ్డి కోర్టులోకి వచ్చారు. కుప్పం కోర్టు ఉత్తర్వుల అమలును నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడంపై ఆయన అభ్యంతరం తెలిపారు. తమ వాదన వినకుండా ఎక్స్ పార్టీ ఆదేశాలు ఇవ్వడం సరికాదన్నారు. ఈ సమయంలో పబ్లిక్ ప్రాసిక్యూటర్ (పీపీ) మెండ లక్ష్మీనారాయణ, సుధాకర్‌రెడ్డి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. కుప్పం కోర్టు ఇచ్చిన రిమాండ్ తిరస్కరణ ఉత్తర్వుల వల్ల శ్రీహరి, గిరీష్ లను పోలీసులు తిరిగి అరెస్ట్ చేసే అవకాశం ఉందని పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.
తమ ఆందోళనలో న్యాయం ఉందని ఆయన కోర్టుకు నివేదించారు. ఈ సమయంలో న్యాయమూర్తి స్పందిస్తూ, తాము రిమాండ్ తిరస్కరణ ఉత్తర్వులను రద్దు చేయలేదని స్పష్టం చేశారు. ఒకవేళ రద్దు చేసి ఉంటే, అప్పుడు శ్రీహరి, గిరీష్ ల అరెస్ట్‌కు ఆస్కారం ఉండేదన్నారు. అయినా కూడా పోలీసులు అరెస్ట్ చేస్తే, అరెస్ట్ చేయమనండి.. మేమూ చూస్తాం.. అంటూ న్యాయమూర్తి ఘాటుగా వ్యాఖ్యానించారు.
పోలీసులు చట్టం విధి విధానాలను పాటించడం లేదు: హైకోర్టు
వ్యక్తులను అదుపులోకి తీసుకునే సమయంలో పోలీసులు చట్టం నిర్దేశించిన విధి విధానాలను పాటించడం లేదని, ఇందుకు ప్రాథమిక ఆధారాలున్నాయని హైకోర్టు పేర్కొంది. చట్ట నిబంధనలను పాటించకుండా వ్యక్తుల స్వేచ్ఛను హరించడానికి వీల్లేదంది. శ్రీహరి అక్రమ అరెస్ట్ విషయంపై దాఖలైన పిటిషన్‌పై న్యాయమూర్తులు జస్టిస్ రవినాథ్ తిల్హరి, జస్టిస్ మెడమల్లి బాలాజీ ధర్మాసనం శుక్రవారం ఈ కీలక వ్యాఖ్యలు చేసింది.
శ్రీహరి అరెస్ట్ విషయంలో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను ఆదేశించింది. ఆ కౌంటర్‌కు పేరాల వారీగా సమాధానం ఇవ్వాలని పిటిషనర్‌కు సూచించింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. పోలీసులమంటూ సివిల్ దుస్తుల్లో వచ్చిన కొందరు వ్యక్తులు శ్రీహరిని బలవంతంగా తమ వెంట తీసుకెళ్లారని, ఆయన్ను కోర్టు ముందు హాజరుపరిచేలా ఆదేశాలు ఇవ్వాలంటూ డ్రైవర్ పోతల సింహాచలం నాయుడు హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు.
ఈ వ్యాజ్యంపై గురువారం విచారణ జరిపిన జస్టిస్ తిల్హరీ ధర్మాసనం పూర్తి వివరాలను తమ ముందుంచాలని పోలీసులను ఆదేశించిన విషయం తెలిసిందే. శుక్రవారం ఈ వ్యాజ్యం మరోసారి విచారణకు రాగా, పిటిషనర్ తరఫు న్యాయవాది సానేపల్లి రామలక్ష్మణ్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ శ్రీహరి అరెస్ట్ చట్ట విరుద్ధమన్నారు. ‘‘చట్టవిరుద్ధంగా వ్యక్తులను అదుపులోకి తీసుకుంటున్న పోలీసులు, ఆ అక్రమ నిర్భంధంపై హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేయగానే విడుదల చేస్తున్నారు. అదుపులోకి తీసుకున్న వ్యక్తిని విడుదల చేశాం కాబట్టి, హెబియస్ కార్పస్ పిటిషన్ నిరర్థకమైందంటూ చెబుతున్నారు’’ అని హైకోర్టు ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది.


