తెలంగాణ ప్రజలకు జేజేలు!

Sakshi Editorial On Five States Results

తెలంగాణ, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్తాన్, మిజోరం రాష్ట్రాల అసెంబ్లీలకు నవంబర్‌ 12తో మొదలై ఈనెల 7వరకూ వివిధ దశల్లో జరిగిన ఎన్నికల్లో మంగళవారం ప్రజాభిప్రాయం వెల్లడైంది. రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లలో కాంగ్రెస్‌ గెలుపు ఖాయమవుతుండగా... మిజోరంలో మిజోరం నేషనల్‌ ఫ్రంట్‌(ఎంఎన్‌ఎఫ్‌) గెలుపొందింది. హోరాహోరీగా జరిగిన తెలంగాణ పోరులో జనం టీఆర్‌ఎస్‌కు పట్టంగట్టారు. అయిదేళ్లకోసారి పాలకుల్ని మార్చే అలవాటున్న రాజస్తాన్‌లో నైనా... మూడు దఫాలనుంచి వరసగా బీజేపీవైపే మొగ్గుచూపుతూ వస్తున్న మధ్యప్రదేశ్‌లోనైనా విజేతలకూ, పరాజితులకూ మధ్య సీట్ల సంఖ్యలో పెద్దగా వ్యత్యాసం లేకపోవడం గమనించదగ్గది.

బీజేపీకి గత మూడు దఫాలు పట్టంగట్టిన ఛత్తీస్‌గఢ్‌లో మాత్రం కాంగ్రెస్‌ మంచి మెజారిటీ దిశగా సాగిపోతోంది. మరో ఆర్నెల్లలో జరగబోయే సార్వత్రిక ఎన్నికలకు సెమీ ఫైనల్స్‌గా అభివర్ణిస్తున్న ఈ అయిదు రాష్ట్రాల ఎన్నికల్లో ప్రజల నాడి ఎలా ఉందో అర్ధమైంది గనుక జాతీయ పార్టీలూ, ప్రాంతీయ పార్టీలూ కూడా తమ తమ ఆచరణలనూ, ఎత్తుగడలనూ సవరించుకుంటాయి. భవి ష్యత్తు వ్యూహాలకు పదును పెట్టుకుంటాయి. ఎన్ని కబుర్లు చెప్పినా, ఎన్ని సిద్ధాంతాలు వల్లించినా ప్రజాప్రయోజనాలు ఇరుసుగా చేసుకుని పనిచేయని పార్టీలకు–అవి అధికారంలో ఉన్నా, ప్రతి పక్షంలో ఉన్నా జనం గట్టిగా గుణపాఠం చెప్పారు. నైతిక విలువలకు తిలోదకాలిచ్చి, అవకాశవాద పొత్తులతో అందలం ఎక్కుదామనుకున్నవారిని చాచికొట్టారు.

తెలంగాణలో టీఆర్‌ఎస్‌ అధినేత కె. చంద్రశేఖరరావు అక్షరాలా ఒంటరి పోరాటం చేశారు. పొలోమంటూ తరలివచ్చిన జాతీయపార్టీల అతిరథమహారథులను ఎదుర్కొన్నారు. ‘నే తగుదు నమ్మా...’ అంటూ పొరుగు రాష్ట్రమన్న స్పృహ కూడా లేకుండా తెలంగాణలో కాళ్లూ చేతులూ పెట్ట బోయిన ఆంధప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు మరిచిపోలేని గుణపాఠం నేర్పారు. ప్రధాని నరేంద్రమోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా, పలువురు బీజేపీ సీఎంలు, కేంద్రమంత్రులు ఇక్కడ ప్రచారం చేశారు.

ఈ నాలుగున్నరేళ్లలో ఏనాడూ, ఎక్కడా బహిరంగసభల్లో పాల్గొనని కాంగ్రెస్‌ అధినేత సోనియాగాంధీ హైదరాబాద్‌ నగరంలో జరిగిన బహిరంగసభలో పాల్గొన్నారు. తెలంగాణ స్థితిని చూసి తల్లిగా తల్లడిల్లుతున్నానని జనంలో సెంటిమెంటు పండించేందుకు ప్రయ త్నించారు. ప్రచారం ముగిసేరోజు సైతం వీడియో సందేశమిచ్చారు. పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ విస్తృతంగా పర్యటించారు. చంద్రబాబుతో కలిసి సభల్లో, విలేకరుల సమావేశాల్లో పాల్గొ న్నారు. కానీ విషాదమేమంటే సోనియాగాంధీ అయినా, రాహుల్‌ అయినా చంద్రబాబు స్క్రిప్టును మించి మరేమీ చెప్పలేకపోయారు. సొంత రాష్ట్రంలో అన్నిటా విఫలమైన బాబు ఇక్కడికొచ్చి కేసీ ఆర్‌ను విమర్శించడాన్ని చూసి జనం నవ్వుకున్నారు.

 రాజకీయాల్లో ఆత్మహత్యలే తప్ప హత్యలుండవని అంటారు. తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఎవరూ హత్య చేయలేదు. అదే ఆత్మహత్య చేసుకుంది. తన మరణశాసనాన్ని తానే లిఖించుకుంది. ఒంటరిగా పోటీ చేస్తే మెజారిటీ రాకపోయినా, ఆ పార్టీకి గౌరవనీయమైన సంఖ్యలో సీట్లు లభిం చేవి. దురాశకు పోకుండా టీజేఎస్, సీపీఐలతోపాటు సీపీఎంని కూడా ఒప్పించి వాటితో కూటమికి సిద్ధపడితే పరిస్థితి మరింత మెరుగ్గా ఉండేది. కానీ కాంగ్రెస్‌ అందుకు విరుద్ధంగా ‘టీఆర్‌ఎస్‌ పొమ్మన్నది గనుక మీతో చెలిమి చేస్తాన’ంటూ వచ్చిన చంద్రబాబును వెనకా ముందూ చూడ కుండా వాటేసుకుంది. వచ్చింది మనవాడా... మనకు పరాయివాడా అన్న సోయి లేకుండా పోయింది. కూటమి కట్టేముందు ఏ పార్టీ అయినా దానికి అర్ధం, పరమార్ధం ఏమిటో గ్రహించగల గాలి. తమ సిద్ధాంతాలేమిటో, లక్ష్యాలేమిటో, ప్రయోజనాలేమిటో... వాటిని సాధించడానికి కూటమి  దోహదపడుతుందో, గండికొడుతుందో చూసుకోవాలి.

చంద్రబాబుకు ఈ బాదరబందీ ఉండదు. అవకాశవాదమే ఆయన వేదం. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి నిరంత రాయంగా సాగిస్తున్న ఉద్యమ ఫలితంగా ‘ప్రత్యేకహోదా’ అంశం ఆంధ్రప్రదేశ్‌లో సజీవంగా ఉన్న దని, అది వచ్చే ఎన్నికల్లో తనకు శరాఘాతం కాబోతున్నదని బాబు గ్రహించారు. అందువల్ల ఏదో ఒకసాకు చూపించి ఎన్‌డీఏ గోడ దూకి బయటికొచ్చారు. జాతీయ స్థాయిలో హడావుడి చేసి ఆంధ్ర ప్రదేశ్‌ ప్రజలను మభ్యపెట్టాలంటే అర్జెంటుగా ఒక వేదిక అవసరమని భావించారు.

అందుకోసం ఆయన తొలుత టీఆర్‌ఎస్‌ను కదిపి చూశారు. ‘తెలుగువాళ్లం ఏకమవుదాం’ అని కబురంపారు. కానీ టీఆర్‌ఎస్‌ తిరస్కరించడంతో గత్యంతరం లేక కాంగ్రెస్‌ తలుపుతట్టారు. తన అవకాశవాదాన్ని కప్పిపుచ్చుకోవడానికి ‘జాతీయప్రయోజనాలు, ప్రజాస్వామ్య వ్యవస్థల పరిరక్షణ’ వంటి అమూ ర్తమైన పడికట్టు పదాలను అరువు తెచ్చుకున్నారు. ఆయన వందలకోట్లు నిధులు పారిస్తానని చెప్పి ఉండొచ్చు. కొమ్ములు తిరిగిన మీడియా సంస్థలతో హోరెత్తిస్తానని హామీ ఇచ్చి ఉండొచ్చు. కానీ కాంగ్రెస్‌ విజ్ఞత ఏమైంది? ఎంత చెడ్డా బాబు సీనియారిటీతో పోలిస్తే ఆ పార్టీ అనుభవం ఎంతో ఎక్కువ. కానీ అదంతా బూడిదలో పోసినట్టయింది.

తొమ్మిదేళ్ల క్రితం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి నాయకత్వంలో ఒంటరిగా బరిలోకి దిగి సునాయాసంగా గెలిచిన ప్రముఖులంతా ఇప్పుడు బోర్లాపడ్డారు. తమ చరిత్రను తామే మరిచి పోయి, అలవాటులేని రాజకీయాల్లో తలదూర్చి టీజేఎస్‌ అధినేత కోదండరాం, ప్రజా గాయకుడు గద్దర్‌ చేతులు కాల్చుకున్నారు. తెలంగాణ ప్రజలు డబ్బుకూ, ఇతర వ్యామోహాలకూ లొంగలేదు. తమకు మేలు చేసేదెవరో, ఆషాఢభూతులెవరో సులభంగా గ్రహించారు. అనైతిక రాజకీయాలనూ, అవకాశవాదాన్నీ తిరస్కరించారు. దొంగ సర్వేలతో మభ్యపెట్టబోయినవారిని బేఖాతరు చేశారు. తమ ఓటుతో జాతీయ రాజకీయాలకు ఎగబాకాలనుకున్నవారికి గుణపాఠం నేర్పిన తెలంగాణ ప్రజలు శతథా అభినందనీయులు! 

Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top