
కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రుడో
వేరే దేశాల అధినేతలు అధికారిక పర్యటనకు వచ్చినప్పుడు వారికి సాదరంగా ఆహ్వానం పలకడం, మంచి అతిథి సత్కారాలు అందించి వీడ్కోలు పలకడం దౌత్య మర్యాదల్లో భాగం. ప్రధాని నరేంద్ర మోదీ ఇంకో అడుగు ముందుకేసి స్వయంగా విమానాశ్రయానికెళ్లి ఆ అధినేతలకు స్వాగతం పలికి, వారిని హత్తుకుని ప్రేమాభిమానాలు చాటుతున్నారు.
కొందరిని తన స్వరాష్ట్రం గుజరాత్ తీసుకెళ్లారు. ఆ అధినేతల రాకను హర్షిస్తూ ట్వీటర్ ద్వారా సందేశాలివ్వడం కూడా మోదీయే ప్రారంభించారు. ఇవన్నీ వారిని మనకు మరింత దగ్గర చేసే చర్యలు. పరస్పర ఆధారిత ప్రపంచంలో ఇవి మేలు కలిగించేవే. చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ, జపాన్ ప్రధాని షింజో అబేలకు ఇలాంటి ఘన సత్కారాలే లభించాయి. కానీ ఈ నెల 17 నుంచి 24 వరకూ మన దేశంలో సకుటుంబ సమేతంగా ఎనిమిది రోజులపాటు పర్యటించిన కెనడా ప్రధాని జస్టిన్ ట్రుడోకు మాత్రం ఆ మాదిరి ఆదరణ లభించలేదు.
కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి మాత్రమే వెళ్లి ఆయనకు స్వాగతం పలికారు. ఆయన కుటుంబం తాజ్‌మహల్‌కు వెళ్లినప్పుడు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌గానీ, ఆయన కేబినెట్‌లో మరెవరైనాగానీ అక్కడ లేరు సరిగదా జిల్లా అధికారులు మాత్రమే ఆయనను పలకరించారు. జస్టిన్ ట్రుడో, ఆయన కుటుంబ సభ్యులు మన దేశ పర్యటన కోసం కొంత కసరత్తు కూడా చేసినట్టున్నారు.
విమానం నుంచి వెలుపలికి వచ్చి ఆ దంపతులు, వారితోపాటు పిల్లలు ముకుళిత హస్తాలతో నిల్చున్నారు. ఆ తర్వాతే మెట్లు దిగి కిందికొచ్చారు. వారందరి వస్త్ర ధారణలో భారతీయం మెరిసింది. ఈ వారం రోజుల పర్యటనలోనూ అధికారిక కార్యక్రమం ఉన్నది ఒక్క అరపూట మాత్రమే. అయితే ఏ మాటకా మాటే చెప్పుకోవాలి. ఆ కార్యక్రమం సందర్భంగా నరేంద్ర మోదీ ట్రుడోను హత్తుకున్నారు. వారి పిల్లలతో ఉల్లాసంగా కబుర్లు చెప్పారు. పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్‌ను ట్రుడో కలిసినా ఆయన ముక్తసరిగా, ముభావంగా ఉన్నారు.
సరిగ్గా ఆరేళ్లక్రితం అప్పటి కెనడా ప్రధాని స్టీఫెన్ హార్పర్ ఆరు రోజుల పర్యటనకు వచ్చినప్పుడు సైతం ఇప్పుడు ట్రుడోకు లభించిన నిరాదరణ వంటిదే ఎదురైంది. కెనడా జనాభా 3.6 కోట్లు కాగా అందులో 10 లక్షలమంది భారత సంతతి పౌరులుంటారు. వీరిలో సగంమంది సిక్కులు. కొన్ని ప్రాంతాల్లో వీరి జనాభా అత్యధికం. రాజకీయంగా నిర్ణయాత్మకం. ఈ సిక్కుల్లో అధిక శాతంమంది ట్రుడో నేతృత్వంలోని పార్టీకి గట్టి మద్దతుదారులు. ట్రుడో ప్రభుత్వంలో నలుగురు సిక్కు మతస్తులున్నారు.
డోనాల్డ్ ట్రంప్ దేశాధ్యక్షుడయ్యాక అమెరికా ఎడాపెడా వీసా నిబంధనలను కఠినం చేస్తున్న వర్తమానంలో అనేకులు కెనడావైపు ఆశగా చూస్తున్నారు. మన సాఫ్ట్‌వేర్ నిపుణులపై అమెరికా అడుగడుగునా ఆంక్షలు విధిస్తూ వేధిస్తుంటే వారికి కెనడా స్వాగతం పలుకుతోంది. పర్మినెంట్ రెసిడెన్సీ ఇవ్వడానికి సిద్ధపడుతోంది. ‘ఎక్స్‌ప్రెస్ ఎంట్రీ’ప్రారంభించి దానికింద సాఫ్ట్‌వేర్ అభివృద్ధి, ఇంజనీరింగ్, వైద్యవిద్య తదితర రంగాల్లో నిపుణులైనవారు ఉద్యోగం లేకున్నా ఆర్నెల్ల వీసాపై రావడానికి అవకాశం ఇస్తోంది. ఫలితంగా ఆయా రంగాల్లో నిపుణులైనవారు కెనడాకు వెళ్లి ఉపాధి వెదుక్కునే వీలుంటుంది. అక్కడి విశ్వవిద్యాలయాల్లో మన విద్యార్థులకు పుష్కలంగా అవకాశాలున్నాయి.
ఈ నేపథ్యంలో మన దేశంలో ట్రుడోకు ఘన స్వాగతం లభించాలి. కానీ సిక్కు వేర్పాటువాదుల విషయంలో ఆ దేశం విధానాలు మన దేశానికి ససేమిరా నచ్చడం లేదు. వారిపట్ల కఠినంగా ఉండాలని మన దేశం డిమాండు చేస్తుంటే కెనడా పట్టించుకోవడం లేదు. ఇది ఇటీవల తలెత్తిన ధోరణి కాదు. పంజాబ్‌లో ఉగ్రవాదం పెచ్చరిల్లిన 80వ దశకం నుంచీ ఈ సమస్య ఉంది. 1985 జూన్‌లో కెనడాలోని టొరంటో నుంచి ఢిల్లీ వస్తున్న ఎయిరిండియా విమానాన్ని మిలిటెంట్లు పేల్చే యడంతో 329మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు.
కెనడాలో స్థిరపడ్డ సిక్కు నేతలు ఈ మిలిటెంట్లకు అండదండలిచ్చారని, వారిపై చర్య తీసుకోవాలని మన దేశం కోరినా అక్కడి ప్రభుత్వం పెద్దగా స్పందించలేదు. అందువల్లే లోగడ హార్పర్‌కు గానీ, ఇప్పుడు ట్రుడోకు గానీ ఘనస్వాగతం లభించలేదు. ఇదంతా చాలదన్నట్టు ట్రుడో రాక సందర్భంగా ఢిల్లీలోని కెనడా హైకమిషనర్ ఇచ్చిన విందులో ఖలిస్తాన్ మాజీ నాయకుడు జస్పాల్ సింగ్ అత్వాల్ పాల్గొన్నాడు. 1986లో కెనడా వెళ్లిన పంజాబ్ మంత్రి మాలిక్‌సింగ్ సిద్ధుపై హత్యాయత్నం చేసిన కేసులో అత్వాల్ 20 ఏళ్లు శిక్ష అనుభవించాడు.
అతడు నిషేధిత అంతర్జాతీయ సిక్కు ఫెడరేషన్ కార్యకర్త. అలాంటి చరిత్ర ఉన్న వ్యక్తికి ట్రుడో కార్యక్రమాల్లో చోటివ్వడం కెనడా చేసిన తప్పే కావొచ్చుగానీ... అసలు అతనికి భారత్ వీసా ఎలా లభించింది? ఈ మధ్యకాలంలో విదేశీయులు కొందరిని విమానాశ్రయాలనుంచే వెనక్కి పంపిన మన అధికారుల కన్నుగప్పి అతడెలా రాగలిగాడు? ట్రుడో పర్యటనలో కొన్ని ద్వైపాక్షిక ఒప్పందాలు కుదిరాయి. అణు సరఫ రాదార్ల బృందం(ఎన్‌ఎస్‌జీ)లో భారత్ ప్రవేశానికి తమ మద్దతుంటుందని ట్రుడో చెప్పారు.
రెండు దేశాల మధ్య 840 కోట్ల డాలర్ల వాణిజ్యం ఉంది. కానీ ఈ అనుకూలాంశాలన్నీ అత్వాల్ ఉదంతం మింగేసింది. అధినేతల పర్య టనలున్నప్పుడు ఇరు దేశాల మధ్యా రెండు మూడు నెలల ముందు నుంచి కసరత్తు జరుగుతుంది. ఎవరెలాంటి పరిమితులు పాటించాలి...ఏ అంశాల్లో కలిసి కదలాలన్న అవగాహన ఉంటుంది. అవి ముగియకుండానే ట్రుడో వచ్చిన పర్య వసానంగా అంతా రసాభాసగా ముగిసినట్టు కనబడుతోంది. కెనడాతో సమస్యలుంటే ప్రస్తుతం రాకపోవడమే మంచిదన్న సంకేతాలు పంపాలి. అంతా సవ్యంగా ఉన్నదనుకున్నప్పుడే పిలవాలి. ట్రుడోను అవమానించారంటూ కెనడా మీడియా చేసిన వ్యాఖ్యల ప్రభావం అక్కడి మన పౌరులపై కూడా ఉంటుంది. ప్రపంచ దేశాల్లోనూ పలచనవుతాం. ఇలాంటి ఇరకాట పరిస్థితులు పునరావృతం కాకుండా చూడటం అవసరం.