మన్యంలో సిమ్లా యాపిల్‌ | Simla Apple cultivation in Visaka agency | Sakshi
Sakshi News home page

మన్యంలో సిమ్లా యాపిల్‌

Aug 30 2016 9:53 PM | Updated on Jun 4 2019 5:04 PM

మన్యంలో సిమ్లా యాపిల్‌ - Sakshi

మన్యంలో సిమ్లా యాపిల్‌

మన్యంలో గిరిజన రైతుల పొలాల్లో ప్రయోగాత్మకంగా యాపిల్‌ సాగు చేపట్టేందుకు ఉద్యానవన శాఖ అధికారులు కసరత్తు ప్రారంభించారు. ఐటీడీఏ ఆధ్యర్యంలో వంద మంది రైతులతో 10 వేల సిమ్లా రకం యాపిల్‌ మొక్కలు నాటేందుకు ప్రణాళికలు పొందించారు.

  • గిరిజన రైతుల పొలాల్లో పరిశోధనలు 
  • ఉద్యాన శాఖ అధికారుల కసరత్తు
  • చింతపల్లి: మన్యంలో గిరిజన రైతుల పొలాల్లో ప్రయోగాత్మకంగా యాపిల్‌ సాగు చేపట్టేందుకు ఉద్యానవన శాఖ అధికారులు కసరత్తు ప్రారంభించారు. ఐటీడీఏ ఆధ్యర్యంలో వంద మంది రైతులతో 10 వేల సిమ్లా రకం యాపిల్‌ మొక్కలు నాటేందుకు ప్రణాళికలు పొందించారు. అరుకు, పాడేరు, చింతపల్లి మండలాల్లో మొక్కలు నాటేందుకు ఉద్యాన శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. ఏజన్సీలో వేసవిలో కూడా  వాతావరణం చల్లగా ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు అతి స్వల్పంగా నమోదవుతుంటాయి. ఆంధ్రా కశ్మీర్‌గా గుర్తింపు పొందుతున్న లంబసింగితో పాటు మరి కొన్ని ప్రాంతాల్లో శీతాకాలంలో సున్నా డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతుంటాయి. దీంతో మూడేళ్ల క్రితమే హైదరాబాద్‌ సీసీఎంబీ శాస్త్రవేత్తలు చింతపల్లి వ్యవసాయ పరిశోధన స్థానంలో అన్నా, సెలక్షన్, మైకెల్‌ వంటి రకాల యాపిల్‌ మొక్కల సాగు ప్రయోగాత్మకంగా  చేపడుతున్నారు. యాపిల్‌ మొక్కలకు కాయలు కూడా వచ్చాయి. రుచి కూడా బాగుండడంతో రంగు, నాణ్యత మరింత మెరుగు పరిచేందుకు శాస్త్రవేత్తలు పరిశోధనలు ముమ్మరం చేశారు. మరో ఏడాదిలో 
    యాపిల్‌ సాగుపై పరిశోధనలు ఒక కొలిక్కి వస్తాయి. 
                            ఈ నేపథ్యంలో ఐటీడీఏ అధికారులు నేరుగా గిరిజన రైతులతో యాపిల్‌ సాగు చేయించేందుకు ముందుకు వచ్చారు. ఉద్యాన శాఖ పర్యవేక్షణలో సిమ్లా రకం యాపిల్‌ను అరుకులో 20 మంది రైతులతో, పాడేరులో 30 మంది, చింతపల్లిలోని లంబసింగి, బౌడ, గెత్తంపాకలు, సిగినాపల్లిలో 50 మంది రైతులతో సాగు చేయించాలని ప్రణాళికలు తయారు చేశారు. ఈ మేరకు ఉద్యాన శాఖ పీహెచ్‌వో ప్రభాకర్‌ ఆదేశాల మేరకు ఇటీవల ఆయా ప్రాంతాలు, అక్కడ వాతావరణ పరిస్థితులను  ఆ శాఖ ఉద్యోగులు పరిశీలించారు. ఎంపిక చేసిన ఒక్కో రైతుతో 100 మొక్కలు నాటించాలన్నది అధికారుల ఆలోచన. రైతు పొలాల్లో ప్రత్యక్ష పరిశోధనలు చేసి, మంచి ఫలితాలు వస్తే మన్యంలో కాఫీ మాదిరిగా యాపిల్‌ సాగును విస్తరించాలని అధికారులు భావిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement