దేశంలో యాపిల్ నగరంగా పేరొందిన సిటీ ఎక్కడ ఉంది?
భారతదేశం అనేక హిల్ స్టేషన్స్‌కు ప్రశాంతమైన పర్వత గ్రామాలకు నిలయం, అందులోనూ విశేషం ఏమిటంటే.. ప్రతిదానికీ దాని కంటూ ఒక స్వంత కథ ఉంటుంది. అదే విధంగా హిమాచల్ ప్రదేశ్‌లో దాగి ఉన్న అటువంటి ఒక చిన్న పట్టణం, భారతదేశపు యాపిల్ సాగులో కీలక పాత్ర పోషించింది. దట్టమైన కొండలు, స్వచ్ఛమైన పర్వత గాలి నలువైపులా యాపిల్ తోటలతో నిండి ఉండే ఈ పట్టణం ప్రశాంతంగా సహజమైన సౌందర్యంతో కనిపిస్తుంది. సమీపంలోని ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలలో కనిపించే రద్దీకి భిన్నంగా ఈ గ్రామంలో జీవనం స్లోగా ప్రశాంతంగా సాగుతుంది. సందర్శకులు దాని సహజ సౌందర్యానికి సరళమైన, ప్రశాంతమైన జీవనశైలికి ఆకర్షితులవుతారు. అయితే, ఈ చిన్న పట్టణానికి యాపిల్ పండ్ల వల్లే గొప్ప ప్రాచుర్యం వచ్చింది.హిమాచల్ ప్రదేశ్‌లోని సిమ్లా సమీపంలో ఉన్న చిన్న పట్టణమైన కోట్‌గఢ్, దేశానికి యాపిల్ సాగును పరిచయం చేయడంలో చారిత్రక పాత్ర పోషించింది. తద్వారా భారతదేశపు యాపిల్ సిటీగా గుర్తింపు పొందింది. దీనికి 20వ శతాబ్దం ప్రారంభంలో తొలి బీజం పడింది , అమెరికన్ మిషనరీ కి చెందిన శామ్యూల్ ఎవా న్స్ స్టోక్స్ వాణిజ్యపరంగా మొదటి యాపిల్ తోటలను నాటారు. కోట్‌గఢ్‌లోని సారవంతమైన నేల, చల్లని వాతావరణం అనువైన ఎత్తులో యాపిల్ సాగుకు చాలా అనుకూలంగా ఉండడంతో ఈ అభివృద్ధి చెందుతున్న ఉద్యానవన పరిశ్రమకు పునాది వేశాయి. కాలక్రమేణా, యాపిల్ సాగు కోట్‌గఢ్ నుంచి చుట్టుపక్కల ప్రాంతాలకు వ్యాపించి, హిమాచల్ ప్రదేశ్‌ను దేశంలోని ప్రముఖ యాపిల్ ఉత్పత్తిదారుగా నిలిపింది.సందర్శనీయ ప్రాంతం..ముఖ్యంగా ఆగస్టు నుంచి∙అక్టోబర్ వరకు పంట కోత కాలంలో, కోట్‌గఢ్‌లోని విస్తారమైన యాపిల్ తోటలు, ఇక్కడి ప్రధాన ఆకర్షణ. పండ్లతో నిండిన ఆపిల్ చెట్ల వరుసల మధ్య నడవడం ప్రశాంతమైన అనుభూతిని అందిస్తుంది. అనేక స్థానిక కుటుంబాలు యాపిల్ సాగు తమ తోటల నడుమ జీవితం గురించిన కథలను సంతోషంగా మనతో పంచుకుంటాయి. కోట్‌గఢ్‌కు కొద్ది దూరంలో ఉన్న తాని జుబ్బర్ సరస్సు, దేవదారు అడవులు చుట్టుముట్టిన ఒక ప్రశాంతమైన ప్రదేశం. ప్రశాంతమైన జలాలు స్వచ్ఛమైన పర్వతపు గాలి ఆహ్లాదపరుస్తాయి. ఏకాగ్రతతో ఆలోచించుకోవడానికి, ఫోటోగ్రఫీకి లేదా విశ్రాంతిని అందించే పిక్నిక్కు అనువుగా అనిపిస్తాయి. కోట్గఢ్తో తరచుగా ముడిపడి ఉండే థానేదార్ గ్రామీణ ప్రాంతంలో మొట్టమొదటి యాపిల్ మొక్కలు నాటిన ప్రదేశం ఉంటుంది. సాంప్రదాయ గృహాలు, మెట్ల పొలాలు హిమాలయాల విశాల దృశ్యాలతో ఈ గ్రామం ఆకట్టుకుంటుంది. కోట్‌గఢ్‌లో స్థానిక దేవతలకు చెందిన పురాతన ఆలయాలు అనేకం ఉన్నాయి. ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలు ప్రాంతీయ నమ్మకాల గురించి తెలియజెబుతాయి. ఇక్కడి హోమ్‌స్టేలో బస చేయడం ద్వారా సందర్శకులు కోట్‌గఢ్‌లోని రోజువారీ జీవితాన్ని అనుభవించవచ్చు. సాధారణ, ఇంట్లో వండిన భోజనం నుంచి పండ్ల తోటల యజమానులతో సంభాషణల వరకు, ఇది ఈ ప్రాంత సంస్కృతి సంప్రదాయాలతో మమేకయే అవకాశాన్ని అందిస్తుంది.కోట్గఢ్ను సందర్శించడానికి మార్చి నుంచి జూన్ నెల మధ్య అనువైనది. ఈ సమయంలో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది కొండల అంతటా పువ్వులు వికసించడం ప్రారంభమవుతుంది. సెప్టెంబర్ నుంచి అక్టోబర్ వరకు ఉండే శరదృతువు మరో విధంగా ప్రత్యేకం. ఎందుకంటే యాపిల్ పంట కోత కాలం ఈ పట్టణాన్ని చైతన్యవంతమైన కార్యకలాపాల కేంద్రంగా మారుస్తుంది. అయితే శీతాకాలాలు చల్లగా ఉంటూ మంచు కురుస్తుంది, ఇది ఈ ప్రాంతం మీదుగా ప్రయాణాన్ని సవాలుగా మారుస్తుంది,ఎలా వెళ్లొచ్చు?విమాన మార్గంలో వెళ్లాలంటే..ఈ పట్టణానికి సమీపంలోని ప్రధాన విమానాశ్రయం జుబ్బర్‌హట్టిలో ఉన్న సిమ్లా విమానాశ్రయం, ఇది కోట్‌గఢ్‌కు సుమారు 80 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. చండీగఢ్ విమానాశ్రయం కూడా మరో ఎంపిక, రైలు మార్గంలో అయితే సమీపంలోని రైల్వే స్టేషన్ సిమ్లా, ఇది వారసత్వ నారో–గేజ్ రైల్వే ద్వారా కల్కాతో అనుసంధానితమై ఉంది. సిమ్లా నుంచి కోట్‌గఢ్‌కు రోడ్డు మార్గం ద్వారా మంచి రవాణా సౌకర్యం ఉంది. సాధారణ బస్సులు టాక్సీలు అందుబాటులో ఉంటాయి.