ఫలించిన ‘సాగు’ సమరం | sagu samaram success | Sakshi
Sakshi News home page

ఫలించిన ‘సాగు’ సమరం

May 31 2017 11:55 PM | Updated on Sep 5 2017 12:28 PM

గోదావరి డెల్టా రైతుల సుదీర్ఘ పోరాటం ఫలించింది. తుపాన్లు, వాయుగుండాల నుంచి తమ పంటలను కాపాడుకునేందుకు డెల్టాకు బ్రిటిష్‌ విధానంలో సాగునీరు ఇవ్వాలని కోనసీమ రైతులు చేస్తున్న స్వచ్ఛందంగా పంట విరామం ఉద్యమానికి తలొగ్గి ప్రభుత్వం ఈ నిర్ణయం

  •  నేటి నుంచి డెల్టా కాలువలకు నీరు
  •  సుమారు 5 లక్షల ఎకరాల్లో ముందస్తు ఖరీఫ్‌కు రైతుల సన్నహాలు
  •  ఫలించిన రైతులు సుదీర్ఘపోరాటం
  • అమలాపురం : 
    గోదావరి డెల్టా రైతుల సుదీర్ఘ పోరాటం ఫలించింది. తుపాన్లు, వాయుగుండాల నుంచి తమ పంటలను కాపాడుకునేందుకు డెల్టాకు బ్రిటిష్‌ విధానంలో సాగునీరు ఇవ్వాలని కోనసీమ రైతులు చేస్తున్న స్వచ్ఛందంగా పంట విరామం ఉద్యమానికి తలొగ్గి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. మూడు డెల్టాలకు ముందస్తు ఖరీఫ్‌ సాగుకు వీలుగా గురువారం పంట కాలువలకు నీరు విడుదల చేయనున్నారు. దీంతో జిల్లాలో 4.80 లక్షల ఎకరాల్లో ఖరీఫ్‌ ముందస్తు సాగుకు రైతులు సిద్ధమవుతున్నారు.
     
    బ్యారేజ్‌ నిర్మాణం తరువాతే ఆలస్యం...
    సుమారు మూడు దశాబ్ధాల తరువాత (ఒకటి రెండు సందర్భాలలో మినహా) డెల్టా కాలువలకు జూన్‌ 15 నాటికి సాగునీరు విడుదల చేయడం పరిపాటిగా మారింది. బ్యారేజ్‌ నిర్మాణానికి ముందు బ్రిటీష్‌ పాలనలో మే 15 నాటికి సాగునీరు విడుదల చేసేవారు. అప్పట్లో ఎగువ నుంచి వచ్చే నీటి రాకను బట్టి ఆయా డెల్టాలకు వంతులు విధానం ఉండేది. రెండో పంట విస్తీర్ణం చాలా తక్కువ. బ్యారేజ్‌ నిర్మాణం పూర్తయిన తరువాత ఎన్టీఆర్‌ ప్రభుత్వ హయాంలో పూర్తి ఆయకట్టుకు రెండు పంటల విధానం అమలులోకి వచ్చింది. దీంతో క్లోజర్‌ (కాలువలు మూసి) పనుల కోసమంటూ తెరవడం ఆలస్యం చేసుకుంటూ పోయారు. గతంలో కాలువలు మూసిన తరువాత కనీసం పూడికతత, లాకుల మరమ్మతుల వంటి పనులు పక్కాగా జరిగేవి. ఇప్పుడు కేవలం ఆధునికీకరణ పనుల పేరుతో లక్షల రూపాయల దుర్వినియోగం తప్ప మరమ్మతులు పక్కాగా చేయడం లేదు. జూన్‌ 15 తరువాత నీరు ఇవ్వడం వల్ల అక్టోబరు 15 తరువాత కోతకు సిద్ధమవుతున్న తమ పంటచేలు తుపాను, వాయుగుండాల బారిన పడి నష్టపోతున్నామని డెల్టా రైతులు వాపోతున్నారు. దీనిపై కోనసీమ రైతులు సుదీర్ఘ పోరాటం చేస్తున్నారు. 2011 సాగు సమ్మె చేసిన సమయంలో ఇదొక ప్రధాన డిమాండ్‌. అప్పట్లో ఈ డిమాండ్‌కు తలొగ్గి మే 26న మధ్య డెల్టా కాలువకు నీరు విడుదల చేశారు. మందస్తు నీరు ఇచ్చినా రైతులు సకాలంలో సాగు చేయలేదనే వంకతో తరువాత ఏడాది నుంచి తిరిగి జూన్‌ 15న నీరు విడుదల చేయడం ఆరంభించారు. ఇదే సమయంలో గత ఏడాది పశ్చిమ ఆక్వా రైతుల ఒత్తిడికి తలొగ్గి ముందస్తుగా సాగునీరు విడుదల చేయడం ఇక్కడ గమనార్హం.
     
    గత ఏడాది స్వచ్ఛంద పంట విరామం...
    గత ఏడాది సైతం సాగునీరు ఆలస్యం కావడంతో కోనసీమ రైతులు మరోసారి స్వచ్ఛందంగా పంట విరామం ప్రకటించి సుమారు 40 వేల ఎకరాల్లో సాగుకు దూరమయ్యారు. దీనిపై ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప అమలాపురంలో రైతు సంఘాలతో సమీక్ష జరిపారు. అయినా గత ఏడాది కాకినాడలో జరిగిన జిల్లా సాగునీటి పారుదల సలహా మండలి (ఐఏబీ)లో ఎప్పటిలానే జూన్‌ 15న నీరు ఇస్తామని తీర్మానం చేయడం విశేషం. గత నెలలో అమరావతిలో జరిగిన సమీక్షలో అధికారులు జూన్‌ ఒకటిన డెల్టాకు నీరు ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. 15 నాటికి నీరు ఇస్తే రైతులు మరోసారి పంట విరామం ప్రకటించే అవకాశముందునే భయంతోనే వారు ముందస్తు సాగునీరు విడుదలకు నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయంలో ఐఏబీ తీర్మానాన్ని సైతం పక్కనబెట్టడం విశేషం. ఈ ఏడాది తూర్పు, మధ్య డెల్టాల్లో ముందస్తు ఖరీఫ్‌కు రైతులు సన్నహాలు ఆరంభించనున్నారు.
     
    శివారుకు చేరేదెప్పుడు? : 
    ముందస్తు సాగునీరు ఇవ్వడం సరే..శివారుకు ఎప్పుడు చేరుతోందననేది ప్రశ్నార్థకమే. డెల్టా కాలువలపై ఆధునికీకరణ, నీరు–చెట్టు, ఉపాధి పనులు జరుగుతున్నాయి. ముందస్తు నీరు విడుదల చేస్తారని తెలిసి కూడా పనులు ఆలస్యంగా ప్రారంభించారు. దీంతో ఇప్పుడు ఆయా ప్రాంతాల్లో కాలువలపై రాళ్లు పేర్చి నీరు అడ్డుకునేందుకు కాంట్రాక్టర్లు సిద్ధమవుతున్నారు. దీనికితోడు గోదావరిలో ఇన్‌ఫ్లో సైతం ఆశాజనకంగా లేదు. ప్రస్తుత ఇన్‌ఫ్లో 2,368 క్యూసెక్కులు కాగా, సముద్రంలోకి 1,210 విడుదల చేస్తున్నారు. మూడు డెల్టాల్లో నారుమడులు సమయంలో కనీసం ఆరువేల క్యూసెక్కులు విడుదల చేయాల్సి ఉంది. ఎగువున వర్షాలు పడితే ఇది పెద్ద ఇబ్బంది కాదుకాని, రుతు పవనాలు ఆలస్యమైతే కాస్త ఆందోళన చెందాల్సిన విషయమే. 
     

Advertisement
 
Advertisement
Advertisement