బైక్‌ ప్రమాదంలో యువకుడి మృతి | road accident | Sakshi
Sakshi News home page

బైక్‌ ప్రమాదంలో యువకుడి మృతి

Aug 2 2016 11:42 PM | Updated on Sep 28 2018 3:41 PM

ఆ కుటుంబాన్ని రోడ్డు ప్రమాదాలు ఛిన్నాభిన్నం చేశాయి. గతంలో తండ్రి యాక్సిడెంట్‌లో మరణించడాన్ని మరువకముందే కొడుకు కూడా బైక్‌ ప్రమాదంలో దూరం కావడంతో ఆ కుటుంబంలో ఆవేదన మిన్నంటింది.

బంటుమిల్లి:
ఆ కుటుంబాన్ని రోడ్డు ప్రమాదాలు ఛిన్నాభిన్నం చేశాయి. గతంలో తండ్రి యాక్సిడెంట్‌లో మరణించడాన్ని మరువకముందే కొడుకు కూడా బైక్‌ ప్రమాదంలో దూరం కావడంతో ఆ కుటుంబంలో ఆవేదన మిన్నంటింది.  స్థానిక మెయిన్‌ రోడ్డులో సోమవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో కృత్తివెన్ను మండలం నీలిపూడి గ్రామానికి చెందిన యువకుడు యర్రంశెట్టి వినయ్‌ (19) మృతి చెందాడు. స్వగ్రామానికి చెందిన బొలిశెట్టి విష్ణుతో కలసి బంటుమిల్లి సమీపంలోని పెట్రోల్‌ బంక్‌లో వినయ్‌  పనిచేస్తూ కుటుంబానికి ఆసరాగా ఉంటున్నారు. కొత్త పల్సర్‌ మోటార్‌సైకిల్‌పై వినయ్, విష్ణులు ప్రయాణిస్తుండగా వాహనం అదుపుతప్పి కిందపడ్డారు.  ఈ ప్రమాదంలో  ఇద్దరి తలలకు బలమైన గాయాలు తీవ్రంగా రక్తస్రావమైంది. స్థానికులు హుటాహుటిన 108 ద్వార చికిత్స నిమిత్త బందరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం విజయవాడ తరలిస్తుండగా మార్గమధ్యంలో వినయ్‌ మరణించాడు. విష్ణు విజయవాడ ప్రైవేటు ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతున్నాడు. 
వినయ్‌ తండ్రి కూడా గతంలో దుర్మరణం
మృతుడు వినయ్‌ తండ్రి గతంలో రోడ్డు ప్రమాదంలో మరణించడం గమనార్హం. అప్పటినుంచి వినయ్‌ తల్లి కుమారుడు, కుమార్తెతో పెడన మండలం చెన్నూరు నుండి వచ్చి నీలిపూడిలో ఉంటోంది. భర్తలాగా ఒక్కగానొక్క కొడుకు రోడ్డు ప్రమాదంలో దూరం కావడంతో ఆమె రోదనలు మిన్నంటాయి. గ్రామ సర్పంచ్‌ పుప్పాల చిన్నాతోపాటు పలువురు గ్రామస్తులు వినయ్‌ కుటుంబ సభ్యులను  ఓదార్చారు. విష్ణు ఆరోగ్య పరిస్తితిపై కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. ఘటనపై స్థానిక పోలీసులు రెండు కేసులు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement