నామినేటెడ్ జాతర | Nominated posts schedule release | Sakshi
Sakshi News home page

నామినేటెడ్ జాతర

Jun 17 2016 1:46 AM | Updated on Sep 4 2017 2:38 AM

నామినేటెడ్ జాతర

నామినేటెడ్ జాతర

జిల్లాలో నామినేటెడ్ పోస్టుల సందడి షురువైంది. ఇప్పటికే పలు మార్కెట్ కమిటీలకు చైర్మన్లను ప్రకటించిన ప్రభుత్వం..

18 ఏఎంసీలకు ఏడుగురు చైర్మన్ల    నియామకం
పెరుగుతున్న ఆశావహులు
చైర్మన్ సీటుపై  గురి
ఎమ్మెల్యేలపై  పెరుగుతున్న ఒత్తిడి

 
 
 భైంసా :  జిల్లాలో నామినేటెడ్ పోస్టుల సందడి షురువైంది. ఇప్పటికే పలు మార్కెట్ కమిటీలకు చైర్మన్లను ప్రకటించిన ప్రభుత్వం.. మిగతా మార్కెట్ కమిటీ చైర్మన్ పదవుల కోసం ఆశావహుల ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. పది నియోజకవర్గాల్లో 17 మార్కెట్ కమిటీలు ఉండేవి. ఖానాపూర్ నియోజకవర్గంలోని జన్నారం మార్కెట్‌కమిటీ కొత్తగా ఏర్పడడంతో ఈ సంఖ్య 18కి చేరింది. మార్కెట్ కమిటీ పదవుల్లోనూ ఇప్పటికే రిజర్వేషన్లు ప్రకటించారు. తొమ్మిది నెలలుగా మార్కెట్‌కమిటీ చైర్మన్ పదవులు దక్కించుకునేందుకు ఆశావహులు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. తాజాగా ఏడు మార్కెట్ కమిటీల నియామకాలు జరుగడంతో ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. ఎలాగైన ఏఎంసీ చైర్మన్ పదవి దక్కించుకునేలా ప్రయత్నాలు తీవ్రం చేశారు.


 ఏడింట నియామకం...
 ఖానాపూర్ నియోజకవర్గపరిధిలోని జన్నారం మార్కెట్ కమిటీని నూతనంగా ఏర్పాటు చేశారు. ఈ మార్కెట్ కమిటీ చైర్మన్‌గా జల్లా అక్కపెల్లిని నియమించారు. ఖానాపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్‌గా నల్ల శ్రీనివాస్, నిర్మల్ మార్కెట్ కమిటీ చైర్మన్‌గా కొమ్ముల చిన్నదేవేందర్‌రెడ్డి, సారంగాపూర్ రాజ్‌మహ్మద్, జైనథ్ టాక్రే వనిత, ఆసిఫాబాద్‌కు శ్రీనివాస్, కుభీర్ మార్కెట్ కమిటీ చైర్మన్‌గా తూము లక్ష్మిలను నియమించారు. ఖానాపూర్‌లో త్వరలోనే మంత్రుల సమక్షంలో పదవి ప్రమాణ స్వీకారం చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కమిటీల్లో డెరైక్టర్‌లను కూడా ఎన్నుకున్నారు.


 భర్తీకానివి..
 ముథోల్ నియోజకవర్గంలోని భైంసా, బోథ్, ఇచ్చోడ, ఆదిలాబాద్, ఇంద్రవెల్లి, జైనూరు, కాగజ్‌నగర్, మంచిర్యాల, లక్షెటిపేట్, బెల్లంపల్లి, చెన్నూరు మార్కెట్‌కమిటీలు నియామకం జరగలేదు. ఈ కమిటీల్లో మార్కెట్ కమిటీ చైర్మన్‌లు, వైస్‌చైర్మన్‌లు, డెరైక్టర్‌ల పదవుల కోసం ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. ఈ పదవులను దక్కించుకునేందుకు నేతలంతా ఎమ్మెల్యేలు, మంత్రుల చుట్టూ తిరుగుతున్నారు.


 పెరుగుతున్న ఆశావహులు..
మిగిలిన 12 మార్కెట్ కమిటీల్లో చైర్మన్ పీఠం దక్కించుకునేందుకు ముమ్మర ప్రయత్నాలు సాగుతున్నాయి. టీఆర్‌ఎస్ నాయకులు ఎమ్మెల్యేల అనుచరులు, ఉద్యమకారులు ప్రయత్నాలను ముమ్మరం చేశారు. జిల్లా అంతటా ఆశావహులు పెరుగుతున్నారు. ఎమ్మెల్యేల వద్ద అనుచరగణంతో వెళ్లి ఏఎంసీ చైర్మన్ పదవులు ఇప్పించాలంటూ ఒత్తిడి పెంచుతున్నారు. ఒక్కో మార్కెట్ కమిటీకి ఐదు, ఆరుగురు నాయకులు పోటీపడుతున్నారు. ద్వితీయ శ్రేణి నాయకులంతా ఈ పీఠంపైనే కన్నువేశారు. ఆశలు పెట్టుకున్న నేతలంతా హైదరాబాద్ చుట్టూ తిరుగుతున్నారు. ఒక్కో నియోజకవర్గంలో ఉన్న మార్కెట్ కమిటీల పదవుల భర్తీ ఎమ్మెల్యేల నిర్ణయమే కీలకమని తెలుసుకుని ఒత్తిడి పెంచుతున్నారు.


 పోటీ తీవ్రమైంది...
 ఇన్నాళ్లు వేచిచూసిన పదవులు భర్తీ కానుండడంతో పోటీ తీవ్రమవుతోంది. రోజురోజుకూ ఆశావహుల సంఖ్య పెరగడంతో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. చైర్మన్ పదవులను దక్కించుకునేందుకు నేతలంతా మంత్రుల చుట్టూ తిరుగుతున్నారు. జిల్లాలో భైంసా మార్కెట్ కమిటీ ఆదాయంలో ఈ యేడు మొదటిస్థానంలో నిలిచింది. ఆదాయంలో ముందంజలో ఉన్న భైంసా, ఆదిలాబాద్ మార్కెట్ కమిటీలను దక్కించుకునేందుకు నాయకులు ఆశగా ఉన్నారు. మార్కెట్‌కమిటీల నియామకంపై పెరుగుతున్న ఒత్తిళ్లతో ఎవరిపేరును ప్రతిపాదించాలో అనే విషయంలోనూ నియోజకవర్గస్థాయిలో ఎమ్మెల్యేలు ఎటూతేల్చుకోలేకపోతున్నారు. తమ వద్దకు వచ్చిన వారిని బుజ్జగించే ప్రయత్నంలోనే కనిపిస్తున్నారు. మరోవైపు ఈ పదవుల కోసం పేర్లను తేల్చడంలోనూ ఆలస్యం కావడంతో ద్వితీయశ్రేణి నాయకులు సైతం నిరాశలో కనిపిస్తున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement