'హోదా' పేరెత్తలేదు.. 'మట్టి' ఇచ్చారు!

'హోదా' పేరెత్తలేదు.. 'మట్టి' ఇచ్చారు! - Sakshi


పార్లమెంటు ఆవరణ నుంచి గుప్పెడు మట్టిని, ఢిల్లీలో ప్రవహించే యమునా నది నుంచి చెంబుడు నీటిని తీసుకొచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. తన ప్రసంగంలో ఎక్కడా రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశాన్ని మాత్రం ప్రస్తావించలేదు. ఎన్నికల సమయంలో ఐదు కాదు.. పదేళ్ల పాటు రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని, అందుకోసం తాను పోరాడతానని ప్రగల్భాలు పలికిన ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆ విషయాన్ని మాటమాత్రంగా కూడా ప్రధానమంత్రి వద్ద ప్రస్తావించిన పాపాన పోలేదు. రాష్ట్రం కొత్తగా ఏర్పడిందని, అందువల్ల తమకు అన్ని రకాలుగా సాయం చేయాలని, తగిన ప్యాకేజి ఇవ్వాలని చెప్పారే తప్ప.. ప్రత్యేక హోదా విషయం గురించి కోరనే లేదు.తొందరపాటుతో రాష్ట్రాన్ని విభజించారని వ్యాఖ్యానించిన మోదీ.. రెండు రాష్ట్రాలు కలిసి పరస్పరం సహకరించుకోవాలని నాలుగు మంచి మాటలు చెప్పారే గానీ, అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల ఏకైక ఆకాంక్ష అయిన 'ప్రత్యేక హోదా' అంశం గురించి ఒక్కటంటే ఒక్క మాట కూడా చెప్పలేదు. మానవ వనరుల అభివృద్ధి కోసం ఇక్కడ పలు జాతీయ స్థాయి విద్యా సంస్థలను ఏర్పాటు చేశామన్నారు గానీ, ఇక్కడి పారిశ్రామికాభివృద్ధికి ప్రాణవాయువు లాంటి ప్రత్యేక హోదా విషయం గురించి అసలేమీ అనలేదు. పునర్విభజన చట్టంలో ఉన్న ప్రతి అక్షరాన్ని దాని అసలైన స్ఫూర్తితో అమలుచేస్తామని అన్నారు గానీ.. అసలు విషయం గురించి ఏమీ చెప్పలేదు.ప్రధానమంత్రి వస్తున్నారంటూ.. ఆయనకు మరోసారి ప్రత్యేక ప్యాకేజి, ప్రత్యేక హోదా విషయాలు గుర్తుచేస్తున్నానని ముందురోజు సాయంత్రం జాతీయ మీడియా సంస్థలకు ఇచ్చిన ఇంటర్వ్యూలలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఊదరగొట్టారే గానీ, అసలు ప్రధానమంత్రికి ఆ విషయాన్ని తన ప్రసంగంలో కూడా గుర్తుచేయలేదు. మొత్తానికి ఇటు ముఖ్యమంత్రి గానీ, అటు ప్రధానమంత్రి గానీ.. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎంతగానో ఎదురుచూస్తున్న ఒక్క మాట చెప్పకుండానే రాజధాని నగర శంకుస్థాపన కార్యక్రమాన్ని, తమ ప్రసంగాలను పూర్తి చేసేశారు.రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తేనే పారిశ్రామికాభివృద్ధి జరుగుతుందని, ఉద్యోగావకాశాలు వెల్లువలా వచ్చి యువత భవితకు భరోసా ఉంటుందని మేధావులు ఎప్పటి నుంచో చెబుతున్నారు. ఎన్నికల ప్రచార సభల్లో కూడా ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదా గురించి పదే పదే ప్రస్తావించారు. కానీ, ఇప్పుడు మాత్రం అసలు దాని ప్రసక్తే లేదు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్‌సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 7 రోజుల పాటు నిరవధిక నిరాహార దీక్ష కూడా చేశారు. అప్పుడు, అంతకుముందు పార్టీలకు అతీతంగా అన్ని వర్గాల వాళ్లు కూడా కొత్తగా ఏర్పడిన రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ప్రత్యేక హోదా ఉండి తీరాల్సిందేనని యూనివర్సిటీల ప్రొఫెసర్లు, విద్యార్థులు అందరూ ముక్తకంఠంతో నినదించారు. ప్రధాని వస్తున్నారు.. ఏవేవో ప్రకటనలు చేసేస్తారని ఎదురుచూసిన ఆంధ్రుల ఆశల మీద సీఎం, పీఎం ప్రసంగాలతో నీళ్లు చల్లినట్లయింది.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top