మృత్యుపాశం | mrutyu paasam | Sakshi
Sakshi News home page

మృత్యుపాశం

Aug 20 2016 11:45 PM | Updated on Apr 3 2019 7:53 PM

మృత్యుపాశం - Sakshi

మృత్యుపాశం

జిల్లాలో శనివారం మృత్యువు ముగ్గురిని కబళించింది. ఆ కుటుంబాల్లో తీరని విషాదం నింపింది. ఇసుక ట్రాక్టర్‌ ఢీకొని ఓ వివాహిత మృతిచెందగా.. రెండు మోటార్‌సైకిళ్లు ఢీకొన్న ఘటనలో మరో వ్యక్తి మరణించారు. చెరువులో పడి ఇంకొకరు దుర్మరణం పాలయ్యారు.

జిల్లాలో శనివారం మృత్యువు ముగ్గురిని కబళించింది. ఆ కుటుంబాల్లో తీరని విషాదం నింపింది. ఇసుక ట్రాక్టర్‌ ఢీకొని ఓ వివాహిత మృతిచెందగా.. రెండు మోటార్‌సైకిళ్లు ఢీకొన్న ఘటనలో మరో వ్యక్తి మరణించారు. చెరువులో పడి ఇంకొకరు దుర్మరణం పాలయ్యారు.
 
ఆస్పత్రికి వెళ్లివస్తూ.. 
చింతలపూడి : భర్తతో కలిసి ఆస్పత్రికి వెళ్లి వస్తున్న ఓ వివాహిత రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు విడిచారు. ఆమె భర్త గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పోలీసుల కథనం  ప్రకారం.. లింగపాలెం మండలం తోచలక రాయుడుపాలెం గ్రామానికి చెందిన సాగిరాల రాజారావు, పుష్పలత(46) దంపతులు శనివారం ద్విచక్ర వాహనంపై చింతలపూడికి వైద్యం నిమిత్తం వచ్చారు. పట్టణంలోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో పరీక్షలు చేయించుకుని తిరిగి వెళ్తుండగా స్థానిక బోసు బొమ్మ సెంటర్‌ వద్ద ఇసుకలోడుతో వస్తున్న ట్రాక్టర్‌ ఢీకొట్టింది. దీంతో వారిద్దరూ కింద పడ్డారు. ట్రాక్టర్‌ చక్రాలు పుష్పలత తలపై నుంచి వెళ్లిపోవడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందారు. రాజారావుకు గాయాలు కావడంతో ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. గ్రామంలో కిరాణా దుకాణం నడుపుతున్నట్లు బంధువులు తెలిపారు. ట్రాక్టర్‌ డ్రైవర్‌ పరారీలో ఉన్నాడు. ఎస్‌ఐ సైదానాయక్‌ ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. 
 
శుభకార్యానికి వెళుతూ.. 
పోలవరం రూరల్‌ : శుభకార్యానికి వెళ్తూ.. ఓ వ్యక్తి రోడ్డు ప్రమాదంలో మరణించాడు.  ఎస్సై కె.శ్రీహరి కథనం ప్రకారం..గోపాలపురం మండలం నందిగూడెం గ్రామానికి చెందిన చిడిపి శ్రీనివాసరావు(32) భార్యతో కలిసి మోటార్‌సైకిల్‌పై కొత్తపట్టిసీమ గ్రామంలో జరిగే ఒక శుభకార్యానికి వెళుతున్నారు. ఇదే సమయంలో కొత్తపట్టిసీమ గ్రామానికి చెందిన లంక బాలకృష్ణ పోలవరం వైపు వస్తున్నాడు.  పోలవరం మండలం గూటాల ఎత్తిపోతల పథకం ప్రాంతంలో ఈ రెండు మోటార్‌సైకిళ్లు ఎదురెదురుగా ఢీకొనడంతో శ్రీనివాసరావు, బాలకృష్ణ తీవ్రంగా గాయపడ్డారు. శ్రీనివాసరావు భార్య  ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడింది. క్షతగాత్రులను  స్థానికులు పోలవరం వైద్యశాలకు తరలించారు.  వైద్యాధికారి జి.సుధాకర్‌ పరీక్షలు నిర్వహించి, మెరుగైన వైద్యం కోసం రాజమండ్రి తరలించారు. చిడిపి శ్రీను రాజమండ్రి వైద్యశాలకు చేరుకునే సరికే మృతిచెందినట్లు ఎస్సై శ్రీహరిరావు తెలిపారు.  
 
చెరువులో పడి రైతు దుర్మరణం 
తాడేపల్లిగూడెం రూరల్‌ : ప్రమాదవశాత్తు చెరువులో పడి చినతాడేపల్లి గ్రామానికి చెందిన రైతు కాసాని రత్తయ్య (50) మృతి చెందాడు. తాడేపల్లిగూడెం అగ్నిమాపక కేంద్రం ఇన్‌చార్జ్‌  వి.భాస్కరరాజు  కథనం ప్రకారం.. శనివారం మధ్యాహ్నం రత్తయ్య పొలం పనులు ముగించుకుని ఇంటికి వస్తుండగా, స్థానిక పెదతాడేపల్లి రోడ్డులోని అంకుడు చెరువులో స్నానానికి దిగి జారి పడిపోయాడు. ఈ సమాచారం తెలియడంతో కుటుంబ సభ్యులు  హుటాహుటిన చెరువు వద్దకు చేరుకుని గాలింపు చేపట్టారు. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వారు వచ్చి గాలింపును ముమ్మరం చేయగా, రాత్రి 8 గంటల ప్రాంతంలో మృతదేహాన్ని బయటకు తీశారు. మృతదేహాన్ని బంధువులకు అప్పగించినట్లు ఇన్‌చార్జ్‌ అగ్నిమాపక దళాధికారి వి.భాస్కరరాజు తెలిపారు. మృతునికి భార్య రాధ, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement