దూసుకెళ్తున్న వెన్నపూస | mlc election counting | Sakshi
Sakshi News home page

దూసుకెళ్తున్న వెన్నపూస

Mar 21 2017 11:59 PM | Updated on Sep 5 2017 6:42 AM

దూసుకెళ్తున్న వెన్నపూస

దూసుకెళ్తున్న వెన్నపూస

పశ్చిమ రాయలసీమ పట్టభద్ర నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి వెన్నపూస గోపాల్‌రెడ్డి విజయం దిశగా దూసుకెళ్తున్నారు.

- గెలుపు దిశగా వైఎస్సార్‌సీపీ అభ్యర్థి గోపాల్‌రెడ్డి
- ప్రతి రౌండ్‌లోనూ స్పష్టమైన ఆధిక్యత
-‘మొదటి ప్రాధాన్యత’లో 12,677 ఓట్ల మెజార్టీ
- ‘మ్యాజిక్‌ ఫిగర్‌’ దాటాలంటే మరో 14,173 ఓట్లు అవసరం
– కొనసాగుతోన్న ద్వితీయ ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు
– నేడు ఫలితం వెలువడే అవకాశం
- రెండు, మూడు స్థానాల్లో కేజేరెడ్డి, గేయానంద్‌
– నూతనోత్సాహంలో వైఎస్సార్‌సీపీ శ్రేణులు


(సాక్షి ప్రతినిధి, అనంతపురం)
     పశ్చిమ రాయలసీమ పట్టభద్ర నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి వెన్నపూస గోపాల్‌రెడ్డి విజయం దిశగా దూసుకెళ్తున్నారు. ప్రతి రౌండ్‌లోనూ స్పష్టమైన ఆధిక్యతను చాటారు. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయ్యే సరికి తన సమీప ప్రత్యర్థి, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కేజేరెడ్డి కంటే 12,677 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. పీడీఎఫ్‌ అభ్యర్థి, సిట్టింగ్‌ ఎమ్మెల్సీ డాక్టర్‌ గేయానంద్‌ మూడోస్థానంలో నిలిచారు. అయితే.. విజయానికి అవసరమైన ‘మ్యాజిక్‌ ఫిగర్‌’ గోపాల్‌రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓట్లలో రాకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపును ప్రారంభించారు. మొదటి ప్రాధాన్యతలో కేజేరెడ్డి,  గేయానంద్‌కు పోలైన ఓట్లు, ‘మ్యాజిక్‌ ఫిగర్‌’కు అవసరమయ్యే ఓట్లను పరిగణనలోకి తీసుకుంటే గోపాల్‌రెడ్డికే విజయావకాశాలు ఉన్నట్లు స్పష్టమవుతోంది. తుది ఫలితం నేడు వెలువడే అవకాశముంది. వైఎస్సార్‌సీపీ అభ్యర్థి గెలుపు ముంగిట ఉండటంతో ఆ పార్టీ శ్రేణులు నూతనోత్సాహంతో ఉన్నాయి.

ప్రతి రౌండ్‌లోనూ వైఎస్సార్‌సీపీకి మెజార్టీ
    పట్టభద్రుల కోటా మండలి ఎన్నికల్లో 1,55,711 ఓట్లు పోలయ్యాయి. వీటిని సగటున 26 వేల ఓట్ల చొప్పున విభజించి ఆరు రౌండ్లలో లెక్కింపు పూర్తిచేశారు. సోమవారం రాత్రి ఎనిమిది గంటలకు ప్రారంభమైన మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు మంగâ¶ళవారం సాయంత్రం ఆరు గంటలకు ముగిసింది. 22 గంటల పాటు సుదీర్ఘంగా కొనసాగింది. మొదటి రౌండ్‌ నుంచి ఆరో రౌండ్‌ వరకు  ప్రతి రౌండ్‌లోనూ గోపాల్‌రెడ్డికి ఆధిక్యత లభించింది. ఆరు రౌండ్ల లెక్కింపు పూర్తయ్యే సరికి ఆయనకు 53,714 ఓట్లు లభించాయి. టీడీపీ అభ్యర్థి కేజేరెడ్డికి 41,037, పీడీఎఫ్‌ అభ్యర్థి, సిట్టింగ్‌ ఎమ్మెల్సీ గేయానంద్‌కు 32,810 ఓట్లు పోలయ్యాయి. తక్కిన వారంతా స్వల్ప ఓట్లు సాధించారు. మొత్తమ్మీద మొదటి ప్రాధాన్యత ఓట్లలో గోపాల్‌రెడ్డి సమీప ప్రత్యర్థి  కేజేరెడ్డి కంటే 12,677 ఓట్లు అధికంగా సాధించారు.

మ్యాజిక్‌ ఫిగర్‌కు 14,173 ఓట్ల దూరంలో..
            పోలైన ఓట్లలో చెల్లని ఓట్లు మినహాయిస్తే తక్కిన 1,35,772 ఓట్లలో 50శాతం కంటే ఒక్క ఓటు ఎక్కువ అంటే 67,887 ఓట్లను ‘మ్యాజిక్‌ ఫిగర్‌’గా ఎన్నికల అధికారులు నిర్ధారించారు. ఈ సంఖ్యకు గోపాల్‌రెడ్డి 14,173 ఓట్ల దూరంలో ఉన్నారు. అలాగే ద్వితీయ స్థానంలోని కేజేరెడ్డి 26,850 , గేయానంద్‌ 35,077 ఓట్ల దూరంలో ఉన్నారు. దీంతో విజయానికి అవసరమైన మ్యాజిక్‌ ఫిగర్‌ను చేరుకునేందుకు ముగ్గురిలో గోపాల్‌రెడ్డికే అవకాశాలు ఉన్నాయి. బరిలోని 25మంది అభ్యర్థులలో తక్కువ ఓట్లు పోలైన అభ్యర్థుల నుంచి మొదలు పెట్టి.. ప్రాధాన్యత క్రమంలో అభ్యర్థులను ‘ఎలిమినేట్‌’ చేస్తూ వస్తారు. వారికి పోలైన ఓట్లను ఇతర అభ్యర్థులకు జత చేస్తారు.

ఈ క్రమంలో 22 మంది అభ్యర్థులు ఎలిమినేట్‌ అయినా ఫలితం తేలే అవకాశం లేదు. దీంతో ఎలిమినేట్‌ రౌండ్‌లో 23వ అభ్యర్థి అయిన గేయానంద్‌కు పోలైన ఓట్లలో కూడా రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కిస్తారు. ఈ ఓట్ల లెక్కింపుతో అభ్యర్థి విజయం ఖరారయ్యే అవకాశం ఉన్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. గేయానంద్‌కు 32,810 ఓట్లు పోలయ్యాయి. వీటిలో కనీసం 40–50 శాతం ద్వితీయ ప్రాధాన్యత ఓట్లు తమకు వచ్చిఉంటాయని వైఎస్సార్‌సీపీ శ్రేణులు భావిస్తున్నాయి. వీటి లెక్కింపు పూర్తవ్వాలంటే మరో పది గంటలకుపైగా పట్టే అవకాశం ఉంది. బుధవారం తెల్లవారుజామున లేదా ఉదయం ఫలితం వెలువడనుంది.

పాలిటెక్నిక్‌ కళాశాల వద్దే పడిగాపులు
        ఓట్ల లెక్కింపు ప్రక్రియ సుదీర్ఘంగా కొనసాగుతుండటంతో ఫలితాల కోసం బరిలోని రాజకీయ పార్టీల శ్రేణులు, అభ్యర్థుల సన్నిహితులు కౌంటింగ్‌ కేంద్రమైన ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల బయట రెండురోజులుగా పడిగాపులు కాస్తున్నారు. ఫలితాలపై స్పష్టత వచ్చేందుకు మరింత సమయం పడుతుందని తెలిసినా ఇక్కడే వేచిచూస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement