ఢిలీల్లో జరిగిన సమావేశంలో పాల్గొన్న రేవంత్‌రెడ్డి, మీనాక్షి, భట్టి, మహేశ్‌గౌడ్, ఉత్తమ్, సీతక్క, దామోదర, వంశీచంద్ రెడ్డి తదితరులు
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికపై పీసీసీ సమన్వయ కమిటీ సమీక్ష
ఒక స్థానానికి దామోదర, మరో స్థానానికి ఇన్‌చార్జీలుగా భట్టి, ఉత్తమ్
సెప్టెంబర్ 15 తర్వాత కార్పొరేషన్ చైర్మన్ల నియామకాలు
టీపీసీసీ సమన్వయ భేటీలో నిర్ణయాలు
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రంలో పట్టభధ్రులకు మరింత దగ్గరయ్యేలా, వచ్చే ఫిబ్రవరిలో జరిగే రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలనూ గెలుచుకునేలా ఇప్పటినుంచే నేతలంతా పనిచేయాలని పీసీసీ సమన్వయ కమిటీలో నిర్ణయించారు. గ్రాడ్యుయేట్ స్థానాలకు ఆగస్టులోగా అభ్యర్థుల ఎంపికపై నిర్ణయానికి రావాలని నిశ్చయించారు. ఇందుకోసం మహబూబ్‌నగర్–హైదరాబాద్–రంగారెడ్డి జిల్లాలకు ఎన్నికల ఇన్‌చార్జిగా మంత్రి దామోదర రాజనర్సింహకు బాధ్యతలు కట్టబెట్టారు. ఆయన ఇతర మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్‌తో కలిసి అభ్యర్థిపై నిర్ణయానికి రావాలని నిర్ణయించారు. నల్లగొండ–ఖమ్మం–వరంగల్ స్థానానికి ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఉత్తమ్‌కుమార్‌రెడ్డిలను ఇన్‌చార్జీలుగా నియమించారు.
మంత్రులు తమ జిల్లాల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు (డీసీసీ), ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్య నాయకులతో విస్తృతంగా చర్చించి.. ముగ్గురు సభ్యులతో కూడిన ప్యానెల్ ద్వారా పార్టీ అధిష్టానానికి నివేదిక సమరి్పంచాలని నిర్ణయించారు. సెప్టెంబర్ నుంచి ఓటరు ఎన్‌రోల్‌మెంట్ ప్రక్రియను విస్తృతంగా జరపాలనే నిశ్చయానికి వచ్చారు. రెండు స్థానాలను గెలిపించుకునేలా ముఖ్యమంత్రి, మంత్రులు, జిల్లా నేతలు కృషి చేయాలని అధిష్టానం సూచించింది. బుధవారం ఢిల్లీలోని ఏఐసీసీ జాతీయ కార్యాలయం ’ఇందిరా భవన్’లో తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్ అధ్యక్షతన టీపీసీసీ సమన్వయ కమిటీ సమావేశం జరిగింది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనర్సింహ, సీతక్క, ఏఐసీసీ కార్యదర్శి వంశీచంద్ రెడ్డి, ఇతర ముఖ్యనేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ‘సర్’ప్రక్రియపైనా చర్చించారు. పార్టీ, ప్రభుత్వ మధ్య మరింత సమన్వయం, ప్రభుత్వ పథకాల ప్రచారంపై ఓ యాక్షన్‌ప్లాన్‌ను తయారు చేసే అంశంపై విస్తృత చర్చ జరిగింది.
సెప్టెంబర్ 15 తర్వాతే కొత్త కార్పొరేషన్లు
ఇక రాష్ట్రంలో ఇటీవల గడువు ముగిసిన కార్పొరేషన్‌లతోపాటు, కొత్త కార్పొరేషన్‌లకు చైర్మన్‌లు, ఇతర సభ్యుల నియామకాలను సెప్టెంబర్ 15 తర్వాత నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిసింది. రెండేళ్లపాటు పనిచేసిన కార్పొరేషన్ చైర్మన్‌లను కొనసాగించాలని కొందరు, వారిని పక్కనబెట్టి కొత్తవారికి అవకాశం ఇవ్వాలని మరికొందరు వాదిస్తున్న నేపథ్యంలో దీనిపై తుది నిర్ణయానికి వచ్చేందుకు కొంత గడువు తీసుకోవాలనే అభిప్రాయం వ్యక్తమైనట్లు తెలుస్తోంది. అలాగే, రాష్ట్రంలో మిగిలిపోయిన సంగారెడ్డి, రంగారెడ్డి జిల్లాల డీసీసీ అధ్యక్షుల ఎంపికకు మరోమారు ఏఐసీసీ పరిశీలకులను హైదరాబాద్ పంపాలని నిర్ణయించారు.
సంగారెడ్డి జిల్లాలో ఇద్దరు ప్రధాన పోటీదారుల్లో ఎవరిని ఎంపిక చేయాలన్న దానిపై సందిగ్ధత నెలకొనగా, రంగారెడ్డి జిల్లాలో ముగ్గురు నేతల పేర్లపై పీఠముడి నెలకొంది. ఈ నేపథ్యంలో అభ్యర్థి ఎంపికను ఆగస్టు చివరి నాటికి పూర్తి చేయాలని అధిష్టానం చెప్పినట్లు సమాచారం. ఓటరు జాబితా సమగ్ర ప్రత్యేక సవరణ (సర్)పై ఇప్పటికే బీఎల్‌ఏల పనితీరుపై కమిటీ భేటీలో సంతృప్తి వ్యక్తంకాగా, వెనకబడిన నియోజకవర్గాల్లో మరింత దూకుడుగా ప్రక్రియను పూర్తి చేయాలని నిర్ణయించారు.
పథకాలకు ఇంటింటికీ చేర్చడానికి యాక్షన్ ప్లాన్: భట్టి
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను పార్టీ కేడర్, సంస్థాగత వ్యవస్థ ద్వారా ప్రతి ఇంటికీ చేర్చేందుకు ప్రత్యేక యాక్షన్ ప్లాన్ రూపొందించినట్లు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చెప్పారు. భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాబోయే గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల గురించి సమన్వయ కమిటీలో సుదీర్ఘంగా చర్చించినట్లు చెప్పారు. పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌గౌడ్ మాట్లాడుతూ, పారీ్ట–ప్రభుత్వ సమన్వయం, సంస్థాగతంగా పార్టీ బలోపేతంపై చర్చించినట్లు తెలిపారు.


