సభాపతికి లేఖ రాశాను


♦ త్వరగా నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నాను

♦ మీడియాతో ఎమ్మెల్యే రోజా

 

 సాక్షి, న్యూఢిల్లీ: సుప్రీం కోర్టు సూచనల మేరకు సభాపతికి లేఖ రాశానని, దాన్ని పరిగణనలోకి తీసుకుని త్వరగా నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నట్టు ఎమ్మెల్యే ఆర్.కె.రోజా పేర్కొన్నారు. శుక్రవారం సుప్రీం కోర్టు ఆవరణలో ఆమె మీడియాతో మాట్లాడారు. ‘విచారం వ్యక్తం చేస్తే అభియోగాలు ఉపసంహరించుకుంటామని ప్రభుత్వ  న్యాయవాదులు సుప్రీంకోర్టులో చెప్పారు. రాష్ట్ర సంక్షేమం కోసం కలసి పనిచేయాలని ధర్మాసనం సూచించింది.



రాష్ట్ర ప్రయోజనాల కోసం, నా నియోజకవర్గ ప్రజల కోసం నేను ఈ లేఖ ఇచ్చాను. ఎవరినీ బాధపెట్టాలని గానీ, అగౌరవపరచాలని గానీ అసెంబ్లీలో మాట్లాడలేదు. ఒకవేళ సభ్యులను గానీ, సీఎంను గానీ బాధ పెట్టి ఉంటే ఆ మాటలను ఉపసంహరించుకుంటున్నట్టు లేఖలో రాశాం. దీనిపై అసెంబ్లీలో నిర్ణయం తీసుకోవాలి. ఈ నెల హైకోర్టులో కేసు విచారణ ఉంది. మా వాదనలు వినిపిస్తాం. నిజంగానే వాళ్లు దీన్ని క్లియర్ చేయాలనుకుంటే ఆగస్టు దాకా ఎదురుచూడరు. ముందే నిర్ణయం తీసుకుంటే ప్రజలను, ఎమ్మెల్యేలను గౌరవించుకున్నట్టు అవుతుందని ఆశిస్తున్నా..’ అని పేర్కొన్నారు. ఒకవేళ మీకు అనుకూలంగా స్పీకర్ నిర్ణయం తీసుకోకపోతే ఏంచేస్తారన్న ప్రశ్నకు.. ‘రాష్ట్ర ప్రయోజనాలను కాంక్షించే వారైతే ఈ నెల లేదా వచ్చే నెల్లో నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నా. ఇప్పటికే నా ప్రజలకు న్యాయం చేయలేకపోతున్నా’ అన్నారు.



 సోమవారం హైకోర్టులో మెన్షన్ చేస్తాం: ఇందిరా జైసింగ్

 సీనియర్ న్యాయవాది ఇందిరా జైసింగ్ ఎమ్మెల్యే రోజా, మరో న్యాయవాది నర్మదా సంపత్‌తో కలిసి ఏపీభవన్ వద్ద మీడియాతో మాట్లాడారు. ‘రోజా వివరణను సుప్రీం కోర్టు పరిగణనలోకి తీసుకుంది. స్పీకర్ ఆ లేఖను సభ ముందుంచి నిర్ణయం తీసుకుంటారు. రోజా అసెంబ్లీ ఆవరణలోని పార్టీ కార్యాలయానికి వెళ్లే అవకాశాన్ని సుప్రీం కోర్టు కల్పించింది. హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పు ప్రభావానికి లోను కావొద్దని సింగిల్ జడ్జికి సూచించింది. మా ప్రధాన పిటిషన్‌ను త్వరగా విచారించాలని సింగిల్ జడ్జి బెంచ్ వద్ద సోమవారం మెన్షన్ చేస్తాం. సుప్రీం కోర్టులో మా పిటిషన్‌ను ఉపసంహరించుకోలేదు. సభ, స్పీకర్ అన్యాయంగా వ్యవహరిస్తే కోర్టులు జోక్యం చేసుకోవచ్చని రాజ్యాంగ ధర్మాసనం అనేక తీర్పుల్లో చెప్పింది’ అని పేర్కొన్నారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top