పని చేస్తే ప్రశంసలు.. లేదంటే పనిష్మెంట్‌ | if you not work got punishment | Sakshi
Sakshi News home page

పని చేస్తే ప్రశంసలు.. లేదంటే పనిష్మెంట్‌

May 2 2017 11:15 PM | Updated on Mar 21 2019 8:19 PM

పని చేస్తే ప్రశంసలు.. లేదంటే పనిష్మెంట్‌ - Sakshi

పని చేస్తే ప్రశంసలు.. లేదంటే పనిష్మెంట్‌

జిల్లాలో అ«ధికారులు చిత్తశుద్ధితో పని చేస్తే ప్రశంసించి ప్రోత్సహిస్తామని, లేకపోతే పనిష్మెంట్‌ తప్పదని జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ హెచ్చరించారు.

- వేసవి నేపథ్యంలో అప్రమత్తంగా ఉండండి
– డివిజన్‌ స్థాయి అధికారులతో సమీక్షలో కలెక్టర్‌
– మహానంది తహసీల్దార్‌పై ఆగ్రహం
నంద్యాల: జిల్లాలో అ«ధికారులు చిత్తశుద్ధితో పని చేస్తే ప్రశంసించి ప్రోత్సహిస్తామని, లేకపోతే పనిష్మెంట్‌ తప్పదని జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ హెచ్చరించారు. స్థానిక రామకృష్ణ పీజీ కాలేజీలో డివిజన్‌ స్థాయి అధికారులతో మంగళవారం ఆయన సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మరో నెల రోజులు వడగాల్పులు ఉంటాయని, అధికారులు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. ఆసుపత్రుల్లో ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లను, సెలైన్‌ బాటిళ్లను సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. డీఆర్‌డీఏ అధికారులు చలివేంద్రాలను త్వరితంగా ఏర్పాటు చేయాలని సూచించారు. చలివేంద్రాలను ఏర్పాటు చేయని అధికారులపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపాలిటీల్లో ఏర్పాటు చేసిన చలివేంద్రాల కంటే, ప్రైవేటు సంస్థలు, ఏర్పాటు చేసిన చలివేంద్రాలు బాగున్నాయని చెప్పారు. పెట్రోల్‌ బంక్‌లు, ఎల్‌పీజీ గ్యాస్‌ ఏజెన్సీల వద్ద తప్పని సరిగా చలివేంద్రాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు.  
కైజాల యాప్‌ను వినియోగించాలి:
అన్ని శాఖ అధికారులు తప్పని సరిగా కైజాల యాప్‌ను వినియోగించుకోవాలని ఆయన ఆదేశించారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ యాప్‌ ద్వారా ఎప్పటికప్పుడు జరుగుతున్న అభివృద్ధి గురించి సమీక్షిస్తుంటారని చెప్పారు. చలివేంద్రాలను త్వరితంగా ఏర్పాటు చేసి, ఫొటోలను కైజాల యాప్‌ ద్వారా పంపాలని కోరారు. పక్కా ఇళ్ల నిర్మాణాన్ని త్వరితంగా చేపట్టాలని సూచించారు. 
 
విధి నిర్వహణలో తహసీల్దార్లు జాగ్రత్త
పట్టాదారు పాసు పుస్తకాల విషయంలో మహానంది తహసీల్దార్‌పై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తల్లిదండ్రులు మృతి చెందాక, అన్నదమ్ముల ఆస్తి పంపకాలు పూర్తికాకమునుపే ఒక వ్యక్తికి వీఆర్‌ఓ పట్టాదారు పుస్తకాలను ఎలా ఇస్తారని ప్రశ్నించారు. తహసీల్దార్లు గుడ్డిగా వ్యవహరిస్తే, వీఆర్‌ఓలు ఆడిస్తారన్నారు. విధి నిర్వహణలో తహసీల్దార్లు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. 
 
నంద్యాలలో సమస్య లేదు 
నంద్యాల పట్టణంలో తాగునీటి సమస్య లేదని మున్సిపల్‌ కమిషనర్‌ సత్యనారాయణ.. కలెక్టర్‌ దృష్టికి తెచ్చారు. వీబీఆర్‌ నుంచి నీటిని తెప్పించుకోవడంతో తాగునీటి సమస్యను నివారించామన్నారు. పట్టణంలో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం ముమ్మరంగా సాగుతుందని చెప్పారు. గ్రామాల్లో పన్నులను వసూలు చేయాలని, డీపీఓ పార్వతిని ఆదేశించారు. సమావేశంలో జాయింట్‌ కలెక్టర్‌ -2 రామస్వామి,  సీఈఓ శంకర్, డీఎంఅండ్‌హెచ్‌ఓ విశాలాక్షి, డీపీఓ పార్వతి పాల్గొన్నారు.    
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement