నయా బాస్‌లెవరో..? | high tension on new boses of new districts | Sakshi
Sakshi News home page

నయా బాస్‌లెవరో..?

Oct 10 2016 12:14 AM | Updated on Sep 4 2017 4:48 PM

అవిభక్త రంగారెడ్డి జిల్లా విడిపోవడం ఖాయమైంది.జిల్లాలకు కొత్త బాస్‌లెవరనేది ఉత్కంఠగా మారింది.

అవిభక్త రంగారెడ్డి జిల్లా విడిపోవడం ఖాయమైంది. విజయదశమి రోజున ఉదయం 10:31 గంటలకు కొత్త జిల్లాల ప్రారంభానికి ముహూర్తం కూడా ఖరారైంది. ఈ తరుణంలో మంగళవారం పురుడు పోసుకునే జిల్లాలకు కొత్త బాస్‌లెవరనేది ఉత్కంఠగా మారింది. జిల్లాల పునర్విభజన నేపథ్యంలో ఐఏఎస్‌లను భారీగా బదిలీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. నూతనంగా ఏర్పడుతున్న 21 జిల్లాలకు కలెక్టర్లు, జాయింట్‌ కలెక్టర్ల నియామకానికి రంగం సిద్ధం చేసింది. ఇదే సమయంలో ఇప్పటికే పనిచేస్తున్న అధికారులకు కూడా స్థానచలనం కలిగించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.     – సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి

ప్రస్తుత రంగారెడ్డి జిల్లా దసరా నుంచి మూడు జిల్లాలు కానుంది. రంగారెడ్డి సహా కొత్తగా వికారాబాద్, మేడ్చల్‌ పేరిట కొత్త జిలా ్లలు ఏర్పడనున్నాయి. దీంతో ప్రస్తుతం జిల్లాలో పనిచేస్తున్న ఐఏఎస్‌ అధికారులు మొదలు స్పెషల్‌ గ్రేడ్‌ డిప్యూటీ కలెక్టర్ల వరకు బదిలీలు తప్పకపోవచ్చు. ఇద్దరు జేసీలు సహా సబ్‌కలెక్టర్, నలుగురు స్పెషల్‌ గ్రేడ్‌ డిప్యూటీ కలెక్టర్లకు సీటు మార్పిడి అనివార్యంగా కనిపిస్తోంది.

రఘువైపే మొగ్గు!
ప్రస్తుత కలెక్టర్‌ రఘునందన్ రావు సీటుకు ఢోకా లేనట్లే. వివాదరహిత, సమర్థ అధికారిగా గుర్తిం పు పొందిన ఆయననే రంగారెడ్డి జిల్లాకు కొనసాగించే అవకాశం కనిపిస్తోంది. ఇటీవల సీఎం కేసీఆర్‌ను కలిసిన జిల్లా ఎమ్మెల్యేలు, ఎంపీ కూడా రఘునందన్ రావు పనితీరు పట్ల సంతప్తి వ్యక్తం చేశారు. ఆయనను కొనసాగిస్తేనే బాగుం టుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ‘మీ అభిమానాన్ని చూరగొన్న కలెక్టర్‌ను మీ జిల్లాలోనే ఉంచుతానని’ సీఎం భరోసా ఇచ్చారు.

మరోవైపు తాజాగా జిల్లాల పునర్విభజనతో రంగారెడ్డి జిల్లాకు ప్రత్యేక స్థానం ఉంది. కీలకమైన ఈ జిల్లాలో సమర్థపాలనాధికారి ఉండాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ సమీకరణల్లో భాగంగా రఘునందన్ రావును కొనసాగించాలనే దృఢనిశ్చయానికి వచ్చినట్టు తెలుస్తోంది. జాయింట్‌ కలెక్టర్‌ –1 రజత్‌కుమార్‌ సైనీని మహబూబ్‌నగర్‌ లేదా నల్లగొండ జిల్లా కలెక్టర్‌గా పంపించే అవకాశాలున్నాయి. ముక్కుసూటి అధికారిగా పేరున్న రజత్‌కు ప్రాధాన్యత గల పోస్టు ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తోంది.

మేడ్చల్‌ రేసులో ఎంవీ రెడ్డి
ప్రతిపాదిత మేడ్చల్‌ జిల్లాకు తొలి కలెక్టర్‌ ఎవరనేది ఆసక్తిని రేకెత్తిస్తోంది. కొత్తగా ఏర్పడే ఈ జిల్లా కలెక్టర్‌ కుర్చీ రేసులో రాష్ట్ర ఎస్సీల అభివృద్ధి సంస్థ ఎండీ ఎంవీ రెడ్డి ముందంజలో ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో జిల్లాలో పశుసంవర్థకశాఖ ఆర్‌జేడీగా, జేసీగా పనిచేసిన అనుభవం ఉన్న ఆయనను కలెక్టర్‌గా నియమించాలని స్థానిక ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రిని అభ్యర్థించారు. దీంతో ఆయన నియామకానికి ఆమోదముద్ర పడవచ్చనే ప్రచారంవిస్తృతంగా జరుగుతోంది. ఎంవీ రెడ్డితోపాటు వరంగల్‌ కలెక్టర్‌ వాకాటి కరుణ పేరుకూడా ప్రముఖంగా వినిపిస్తోంది.  

వికారాబాద్‌కు ఆమ్రపాలి..
వికారాబాద్‌ జిల్లా కలెక్టర్‌గా కాట ఆమ్రపాలి పేరు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో ఇక్కడ సబ్‌కలెక్టర్‌గా.. ప్రస్తుతం జేసీగా పనిచేస్తున్న ఆమెకు సమర్థ అధికారిగా పేరుంది. ఈ నేపథ్యంలో తొలి కలెక్టర్‌గా ఆమెకు పోస్టింగ్‌ ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. ఒకవేళ చివరి నిమిషంలో సమీకరణలు మారితే తప్ప... ఆమ్రపాలికే అవకాశాలెక్కువ. ఇదిలా ఉండగా, ఇక్కడ సబ్‌కలెక్టర్‌గా పనిచేస్తున్న శృతి ఓజాను బదిలీ చేయాలని ప్రభుత్వం దాదాపుగా నిర్ణయించింది.

రెవెన్యూ డివిజన్  పరిధి తగ్గినందున.. సబ్‌కలెక్టర్‌ స్థాయి అధికారి అవసరం లేదని భావిస్తున్న సర్కారు.. శృతిని కొత్త జిల్లాల్లో జేసీగా నియమించే అవకాశాన్ని చురుగ్గా పరిశీలిస్తోంది. ఇక సరూర్‌నగర్, మల్కాజిగిరి, రాజేంద్రనగర్‌ ఆర్డీఓలు, డీఆర్‌ఓల బదిలీకి సంకేతాలు అందాయి. స్పెషల్‌ గ్రేడ్‌ డిప్యూటీ కలెక్టర్‌ హోదాలో పనిచేస్తున్న వీరికి జేసీలుగా పోస్టింగ్‌లు ఇవ్వాలని యోచిస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement