జస్టిస్ రావు రఘునందన్ రావు దంపతులను సత్కరిస్తున్న హైకోర్టు న్యాయవాదుల సంఘం కార్యవర్గం. చిత్రంలో సంఘం ప్రధాన కార్యదర్శి తిరుమలశెట్టి కిరణ్, ఉపాధ్యక్షుడు పీటా రామన్ తదితరులు
ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికో.. సహకరించడానికో కాదు
న్యాయ పాలనను నిలబెట్టడానికి, ప్రభుత్వాలు ప్రజల హక్కులను హరించకుండా చూడటానికే
ఆడంబరాలు, గౌరవ మర్యాదలనుబట్టి జడ్జీల విశ్వనీయత ఆధారపడి ఉండదు
ప్రజలకు ఏ విధంగా న్యాయం చేశామన్న దానిపైనే గుర్తింపు ఆధారపడి ఉంటుంది
హైకోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ రావు రఘునందన్‌రావు
పదవీ విరమణ చేసిన జస్టిస్ రఘునందన్‌రావుకు హైకోర్టు ఘన వీడ్కోలు
న్యాయాన్ని ప్రజలకు చేరువ చేశారు: సీజే జస్టిస్ లీసా గిల్
సాక్షి, అమరావతి: న్యాయమూర్తులున్నది ప్రజల హక్కుల పరిరక్షణకేనని, ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికో, ప్రభుత్వానికి సహకారం అందించడానికో కాదని హైకోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ రావు రఘునందన్‌రావు తెలిపారు. తమకు చట్టం ఎనలేని అధికారాలను ఇచ్చింది న్యాయ పాలనను నిలబెట్టడానికి, ప్రజల హక్కులను ప్రభుత్వాలు హరించకుండా చూడటానికే అని పేర్కొన్నారు. తాను ఎల్లప్పుడూ ఇదే సూత్రంపై పని చేశానని, దీనికి ఎప్పుడూ చింతించలేదన్నారు.
మన చుట్టూ ఉన్న ఆడంబరాలు లేదా మనకు లభించే గౌరవ మర్యాదలను బట్టి మన గుర్తింపు, విశ్వసనీయత ఆధారపడి ఉండవని చెప్పారు. ప్రజలు కష్టాల్లో ఉండి మన తలుపు తట్టిన ప్రతిసారీ వారికి ఏ విధంగా న్యాయం చేశామనే దానిపైనే మన అసలు గుర్తింపు ఆధారపడి ఉంటుందని చెప్పారు. న్యాయమూర్తిగా జస్టిస్ రఘునందన్‌రావు సోమవారం పదవీ విరమణ చేశారు. ఈ సందర్భంగా హైకోర్టు ఆయనకు ఘనంగా వీడ్కోలు పలికింది. ఈ వీడ్కోలు సమావేశంలో ఆయన మాట్లాడారు.
పేదలకు సాయం చేయడానికి నాకు లభించిన గొప్ప అవకాశం
‘నేను అడ్వొకేట్‌గా ఉన్నప్పుడు నా ప్రాక్టీస్ స్వభావం వల్ల, ఎక్కువ వనరులు ఉన్న కక్షిదారుల పక్షాన వాదించేవాడిని. వారికి కోర్టులు వారి హక్కులను కాపాడుకోవడానికి ఉన్న అనేక మార్గాలలో ఒకటి మాత్రమే. కానీ, నేను న్యాయమూర్తి అయిన తర్వాతే.. కోర్టు మాత్రమే తమ మొదటి, చివరి ఆశ్రయం అని నమ్మే సాధారణ ప్రజల కేసులను చూసే అవకాశం దక్కింది. అటువంటి నిరుపేదలకు, హక్కులు కోల్పోయిన వారికి సహాయం చేయడానికి నాకు లభించిన ఈ అవకాశాన్ని గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను. సమాజంలో వెనుకబడిన వర్గాల వారు మనుగడ కోసం ఎంతగా పోరాడుతున్నారో, వారు ఎంత బలహీనంగా ఉన్నారో నేను న్యాయమూర్తి అయిన తరువాతే గ్రహించాను.’ అని ఆయన చెప్పారు.
భవిష్యత్ తరాలు గర్వపడేలా తీర్చిదిద్దాలి
‘ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మౌలిక సదుపాయాల పరంగా ఎంతో పురోగతి సాధించింది. త్వరలోనే కొత్త హైకోర్టు భవనం కూడా రాబోతోంది. గత రెండేళ్లుగా హైకోర్టు వంద శాతానికి పైగా కేసుల పరిష్కార రేటును సాధించింది. అంటే కొత్తగా దాఖలైన కేసుల కంటే ఎక్కువ కేసులను పరిష్కరించాం. గత ఏడాది ప్రముఖ స్వచ్ఛంద సంస్థలు నిర్వహించిన స్వతంత్ర సర్వేలో కోర్టులు, జైళ్ల పరిపాలనలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే రెండో స్థానంలో నిలిచింది. దేశంలోని 25 హైకోర్టులలో మన ఏపీ హైకోర్టు ఐదో స్థానాన్ని కైవసం చేసుకుంది. దేశంలోనే అత్యుత్తమ హైకోర్టుగా ఎదగడానికి ఇంకా శ్రమించాలి.
రాబోయే తరాలు గర్వపడేలా మన న్యాయవ్యవస్థను తీర్చిదిద్దాలి. ఈ దేశ ప్రజల కోసం, చట్టాన్ని నిలబెట్టడం కోసం ఈ కోర్టు ఎల్లప్పుడూ తన బాధ్యతను నిర్వర్తిస్తుందనే నమ్మకం నాకు ఉంది.’ అని జస్టిస్ రఘునందన్‌రావు తెలిపారు. న్యాయమూర్తిగా ఇక్కడ కూర్చోవడానికి, తన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించడానికి తోడ్పడిన వారందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. హైదరాబాద్ నుండి విజయవాడకు మారడానికి అంగీకరించి, తన సంరక్షణ కోసం కెరీర్‌ను సైతం వదులుకున్న తన సతీమణి రాజిత, పిల్లలు అనన్య, ఆదిత్య అందించిన మద్దతు వల్లే ఇక్కడ ప్రశాంతంగా పని చేయగలిగానని తెలిపారు.
సత్వర న్యాయం ఎంత ముఖ్యమో నిరూపించారు: సీజే జస్టిస్ లీసా గిల్
జస్టిస్ రఘునందన్‌రావు సేవలను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజే) జస్టిస్ లీసా గిల్ కొనియాడారు. న్యాయవ్యవస్థపై ఆయన చెరగని ముద్ర వేశారని చెప్పారు. 25 వేల కేసులను పరిష్కరించి సత్వర న్యాయం ఎంత ముఖ్యమో నిరూపించారన్నారు. సాంకేతికతను, న్యాయవ్యవస్థను అనుసంధానం చేసి న్యాయాన్ని ప్రజలకు చేరువ చేశారని తెలిపారు. ఆయన శేష జీవితం ప్రశాంతంగా, ఆయురారోగ్యాలతో సాగిపోవాలని సీజే ఆకాక్షించారు.
పౌర హక్కుల పరిరక్షణలో ముందున్నారు
ఈ కార్యక్రమంలో అదనపు సొలిసిటర్ జనరల్ (ఏఎస్‌జీ) చల్లా ధనంజయ, అడ్వొకేట్ జనరల్ (ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్, బార్ కౌన్సిల్ చైర్మన్ నల్లారి ద్వారకనాథరెడ్డి, హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు వాసిరెడ్డి ప్రభునాథ్ మాట్లాడారు. పౌరుల హక్కులను కాపాడటంలో జస్టిస్ రఘునందన్‌రావు ముందున్నారని తెలిపారు. జూనియర్ న్యాయవాదులను ప్రోత్సహించి వారు వృత్తి మెళకువలు నేర్చుకునేలా చేశారన్నారు. న్యాయమూర్తిగా పదవీ విరమణ చేయడం న్యాయ వ్యవస్థకు లోటన్నారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తులు జస్టిస్ మంతోజు గంగారావు, జస్టిస్ మఠం వెంకటరమణ, జస్టిస్ గన్నమనేని రామకృష్ణ ప్రసాద్, జస్టిస్ రఘునందన్‌రావు కుటుంబ సభ్యులు, రిజిస్ట్రార్లు, న్యాయవాదులు, అదనపు అడ్వొకేట్ జనరల్ ఇవన సాంబశివ ప్రతాప్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ మెండ లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.
హైకోర్టు న్యాయవాదుల సంఘం ఘన సన్మానం
పదవీ విరమణ చేసిన జస్టిస్ రఘునందన్‌రావును హైకోర్టు న్యాయవాదుల సంఘం ఘనంగా సన్మానించింది. జస్టిస్ రఘునందన్‌రావు, ఆయన సతీమణి రాజితకు అమ్మవారి చిత్రపటాన్ని సంఘం కార్యవర్గం బహూకరించింది. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు వాసిరెడ్డి ప్రభునాథ్, ఉపాధ్యక్షుడు పీటా రామన్, ప్రధాన కార్యదర్శి తిరుమలశెట్టి కిరణ్, కార్యవర్గ సభ్యులు, పెద్ద సంఖ్యలో న్యాయవాదులు పాల్గొన్నారు.


