రాష్ట్రానికి వారసత్వ హోదా ఫైల్‌

రాష్ట్రానికి వారసత్వ హోదా ఫైల్‌ - Sakshi




కడప కల్చరల్‌ :

గండికోటకు ప్రపంచ వారసత్వ హోదా ఇచ్చేందుకు అవసరమైన వివరాలు సేకరించే ఫైలు మన రాష్ట్రంలోని కేంద్ర పురావస్తు శాఖకు చేరినట్లు విశ్వసనీయ సమాచారం. గండికోటకు ప్రపంచ వారసత్వ హోదా ఇవ్వాలని గుంటూరుకు చెందిన పర్యాటక అభిమాని జాస్తి వీరాంజనేయులు కోరారు. రాష్ట్రంలోని మొత్తం 5పర్యాటక ప్రాంతాలకు హోదా ఇవ్వాలని ఆయన నేరుగా ప్రధానమంత్రి కార్యాలయంలో విజ్ఞప్తి చేశారు. వెంటనే స్పందించిన కార్యాలయం అక్కడి కేంద్ర పర్యాటక శాఖను దీనికి సంబంధించిన వివరాలను సేకరించాలని ఆదేశించింది. ఈ సందర్భంగా జాస్తి వీరాంజనేయులు వారసత్వ హోదా విషయంలో తొలి ప్రాధాన్యత గండికోటకు ఇవ్వాలని మరో వినతి పత్రమిచ్చారు. దాన్ని కూడా స్వీకరించిన పర్యాటక శాఖ అధికారులు దాన్ని కేంద్ర పురావస్తు శాఖకు బదిలీ చేస్తూ ఆ 5 ప్రాంతాల పూర్తి వివరాలను తమకు అందజేయాలని కోరారు. తొలి ప్రాధాన్యత గండికోటకే ఇస్తూ.. మన రాష్ట్రంలోని కేంద్ర పురావస్తు శాఖ కార్యాలయానికి గండికోటకు సంబంధించిన పూర్తి వివరాలను సేకరించాలని ఆదేశాలు పంపారు. ప్రస్తుతం ఆ కార్యాలయ అధికారులు గండికోటకు సంబంధించిన  భౌగోళిక వివరాలతోపాటు చారిత్రక కట్టడాలు, శాసనాలు, ఇతర పురావస్తుల వివరాల రికార్డును సిద్ధం చేస్తున్నారు. తమ పరిధిలోని మిగతా నాలుగు ప్రాంతాల వివరాలను కూడా పంపేందుకు వివరాలు సేకరిస్తున్నారు. త్వరలో గండికోటకే ప్రత్యేక కన్సల్టెంట్‌ను నియమించనున్నారు. ఆయనతో కలిసి ఈ ప్రాంతంలో కేంద్ర పురావస్తు శాఖ రాష్ట్ర అధికారులు గండికోటకు సంబంధించిన సమగ్రమైన సర్వే, వీడియో, ఫొటోలను సేకరించి కేంద్ర కార్యాలయానికి పంపనున్నారు.  మొత్తానికి గండికోటకు ప్రపంచ వారసత్వ హోదా ఇవ్వాలన్న డిమాండు ఇంత దూరం రావడంపట్ల జిల్లా పర్యాటక అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.   

 

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top