కిక్కిరిసిన గుణదల: మేరీమాత ఉత్సవాలు ప్రారంభం | gunadala filled with devoties as mary matha utsavam bigins | Sakshi
Sakshi News home page

కిక్కిరిసిన గుణదల: మేరీమాత ఉత్సవాలు ప్రారంభం

Feb 9 2016 8:25 PM | Updated on Sep 3 2017 5:17 PM

కిక్కిరిసిన గుణదల: మేరీమాత ఉత్సవాలు ప్రారంభం

కిక్కిరిసిన గుణదల: మేరీమాత ఉత్సవాలు ప్రారంభం

మంగళవారం నుంచి మేరీమాత ఉత్సవాలు ప్రారంభం కావడంతో విజయవాడ నగరంలోని గుణదల పుణ్యక్షేత్రం భక్తులతో కిక్కిరిసింది.

గుణదల: విజయవాడ నగరంలోని గుణదల పుణ్యక్షేత్రం భక్తులతో కిక్కిరిసింది. మంగళవారం నుంచి మేరీమాత ఉత్సవాలు ప్రారంభం కావడంతో రాష్ట్రం నలుమూలల నుంచేకాక తెలంగాణకు చెందిన భక్తులు కూడా పెద్ద ఎత్తున పుణ్యక్షేత్రానికి తరలివస్తుండటంతో మేరీమాత ఆలయ పరిసరాల్లో కోలాహలం నెలకొంది.

బిషప్ గ్రాసి పాఠశాల ప్రాంగణంలో మంగళవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విజయవాడ క్యాథలిక్ పీఠం బిషప్ తెలగతోటి జోసఫ్ రాజారావు, పుణ్యక్షేత్ర రెక్టర్ ఫాదర్ ఎం.చిన్నప్ప తదితర గురువులు జ్యోతి ప్రజ్వలన చేసి లాంఛనంగా ఉత్సవాలను ప్రారంభించారు. ఉత్సవాల తొలి సమష్టి దివ్యబలి పూజను గోల్డెన్ జుబిలేరియన్ గురువులు టీహెచ్ జాన్‌మాథ్యూ, ఫాదర్ వెంపని జోసెఫ్, సిల్వర్ జుబిలేరియన్ గురువులు ఫాదర్ పి.జ్వాకీమ్, లాము జయరాజు తదితర గురువులు సమర్పించారు.

ఈ సందర్భంగా బిషప్ రాజారావు ప్రారంభ సందేశమిస్తూ, లోకరక్షకుడైన యేసుక్రీస్తును ఈ లోకానికి అందించిన మరియమాతను ప్రార్థించడం ద్వారా సర్వజనులకు దీవెనలు లభిస్తాయని తెలిపారు. మధ్యాహ్నం 3 గంటలకు మరియమాత విగ్రహాన్ని గుణదల పురవీధులలో ఊరేగించారు. మరియమాత స్వరూపాన్ని దర్శించుకుని భక్తులు కొబ్బరికాయలు సమర్పించారు. సాయంత్రం 6 గంటలకు రెండో సమష్టి దివ్యబలి పూజ జరిగింది. వరంగల్ పీఠాధిపతి ఉడుముల బాల, బిషప్ తెలగతోటి రాజారావు, ఫాదర్ చిన్నప్ప తదితర గురువులు రెండోసారి దైవ సందేశం అందించి బలిపూజ సమర్పించారు.

Advertisement
 
Advertisement
Advertisement