breaking news
mary matha utsavam
-
వైభవంగా గుణదల మేరీమాత ఉత్సవాలు
గుణదల (విజయవాడ తూర్పు): దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధి గాంచిన క్రైస్తవ ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రమైన విజయవాడ గుణదలలో మేరీమాత ఉత్సవాలు ఆదివారం వైభవంగా ప్రారంభమయ్యాయి. మూడ్రోజులపాటు జరిగే ఈ ఉత్సవాలను పుణ్యక్షేత్ర ప్రధానాలయం దిగువన ఉన్న బిషప్ గ్రాసి పాఠశాల ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై విజయవాడ కతోలిక పీఠం బిషప్ తెలగతోటి జోసెఫ్ రాజారావు జ్యోతి ప్రజ్వలన చేసి ఉత్సవాలను ప్రారంభించారు. అనంతరం వికార్ జనరల్ ఫాదర్ ఎం.గాబ్రియేలు, మోన్సిగ్నోర్ ఫాదర్ మువ్వల ప్రసాద్, గుణదల మాత పుణ్యక్షేత్రం రెక్టార్ ఫాదర్ ఏలేటి విలియం జయరాజు తదితర గురువులతో కలిసి బిషప్ తెలగతోటి జోసెఫ్ రాజారావు సమష్టి దివ్యబలి పూజ సమర్పించారు. బిషప్ రాజారావు మాట్లాడుతూ కుల, మతాలకు అతీతంగా భక్తులు మరియమాతను సందర్శించి ఆమె చల్లని దీవెనలు పొందుతున్నారన్నారు. క్రైస్తవ మత గురువులు భక్తులకు దివ్య సత్ప్రసాదం అందజేశారు. కతోలిక పీఠం చాన్సలర్ ఫాదర్ వల్లె విజయజోజిబాబు, సోషల్ సర్వీస్సెంటర్ డైరెక్టర్ ఫాదర్ పసల థామస్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఫాదర్ కొలకాని మరియన్న, ఫాదర్లు పాల్గొన్నారు. -
కిక్కిరిసిన గుణదల: మేరీమాత ఉత్సవాలు ప్రారంభం
గుణదల: విజయవాడ నగరంలోని గుణదల పుణ్యక్షేత్రం భక్తులతో కిక్కిరిసింది. మంగళవారం నుంచి మేరీమాత ఉత్సవాలు ప్రారంభం కావడంతో రాష్ట్రం నలుమూలల నుంచేకాక తెలంగాణకు చెందిన భక్తులు కూడా పెద్ద ఎత్తున పుణ్యక్షేత్రానికి తరలివస్తుండటంతో మేరీమాత ఆలయ పరిసరాల్లో కోలాహలం నెలకొంది. బిషప్ గ్రాసి పాఠశాల ప్రాంగణంలో మంగళవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విజయవాడ క్యాథలిక్ పీఠం బిషప్ తెలగతోటి జోసఫ్ రాజారావు, పుణ్యక్షేత్ర రెక్టర్ ఫాదర్ ఎం.చిన్నప్ప తదితర గురువులు జ్యోతి ప్రజ్వలన చేసి లాంఛనంగా ఉత్సవాలను ప్రారంభించారు. ఉత్సవాల తొలి సమష్టి దివ్యబలి పూజను గోల్డెన్ జుబిలేరియన్ గురువులు టీహెచ్ జాన్మాథ్యూ, ఫాదర్ వెంపని జోసెఫ్, సిల్వర్ జుబిలేరియన్ గురువులు ఫాదర్ పి.జ్వాకీమ్, లాము జయరాజు తదితర గురువులు సమర్పించారు. ఈ సందర్భంగా బిషప్ రాజారావు ప్రారంభ సందేశమిస్తూ, లోకరక్షకుడైన యేసుక్రీస్తును ఈ లోకానికి అందించిన మరియమాతను ప్రార్థించడం ద్వారా సర్వజనులకు దీవెనలు లభిస్తాయని తెలిపారు. మధ్యాహ్నం 3 గంటలకు మరియమాత విగ్రహాన్ని గుణదల పురవీధులలో ఊరేగించారు. మరియమాత స్వరూపాన్ని దర్శించుకుని భక్తులు కొబ్బరికాయలు సమర్పించారు. సాయంత్రం 6 గంటలకు రెండో సమష్టి దివ్యబలి పూజ జరిగింది. వరంగల్ పీఠాధిపతి ఉడుముల బాల, బిషప్ తెలగతోటి రాజారావు, ఫాదర్ చిన్నప్ప తదితర గురువులు రెండోసారి దైవ సందేశం అందించి బలిపూజ సమర్పించారు.