
ఆదివారం రాత్రి గుణదల కొండకు పోటెత్తిన భక్తులు
గుణదల (విజయవాడ తూర్పు): దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధి గాంచిన క్రైస్తవ ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రమైన విజయవాడ గుణదలలో మేరీమాత ఉత్సవాలు ఆదివారం వైభవంగా ప్రారంభమయ్యాయి. మూడ్రోజులపాటు జరిగే ఈ ఉత్సవాలను పుణ్యక్షేత్ర ప్రధానాలయం దిగువన ఉన్న బిషప్ గ్రాసి పాఠశాల ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై విజయవాడ కతోలిక పీఠం బిషప్ తెలగతోటి జోసెఫ్ రాజారావు జ్యోతి ప్రజ్వలన చేసి ఉత్సవాలను ప్రారంభించారు.
అనంతరం వికార్ జనరల్ ఫాదర్ ఎం.గాబ్రియేలు, మోన్సిగ్నోర్ ఫాదర్ మువ్వల ప్రసాద్, గుణదల మాత పుణ్యక్షేత్రం రెక్టార్ ఫాదర్ ఏలేటి విలియం జయరాజు తదితర గురువులతో కలిసి బిషప్ తెలగతోటి జోసెఫ్ రాజారావు సమష్టి దివ్యబలి పూజ సమర్పించారు. బిషప్ రాజారావు మాట్లాడుతూ కుల, మతాలకు అతీతంగా భక్తులు మరియమాతను సందర్శించి ఆమె చల్లని దీవెనలు పొందుతున్నారన్నారు. క్రైస్తవ మత గురువులు భక్తులకు దివ్య సత్ప్రసాదం అందజేశారు. కతోలిక పీఠం చాన్సలర్ ఫాదర్ వల్లె విజయజోజిబాబు, సోషల్ సర్వీస్‌సెంటర్ డైరెక్టర్ ఫాదర్ పసల థామస్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఫాదర్ కొలకాని మరియన్న, ఫాదర్లు పాల్గొన్నారు.