హత్య కేసులో నలుగురి అరెస్టు

హత్య కేసులో నలుగురి అరెస్టు - Sakshi


ధర్మవరం అర్బన్‌: బైక్‌తో ఢీకొట్టాడనే అక్కసుతో స్కూటరిస్టును చితకబాది ఆ తరువాత హత్య చేసిన కేసులో నలుగురు నిందితులను అరెస్టు చేసినట్లు ధర్మవరం డీఎస్పీ వేణుగోపాల్‌ తెలిపారు. వాటి వివరాలను ఆయన విలేకరులకు బుధవారం తెలిపారు. ఆయన కథనం ప్రకారం...


ధర్మవరంలోని మహాత్మగాంధీ కాలనీకి చెందిన సాకే నరసింహులు, వడ్డే గోగుల రమేశ్, గొల్లవాండ్లపల్లికి చెందిన గొల్ల లక్ష్మినారాయణ, మోటుమర్ల గ్రామానికి చెందిన బోయకనుమ మల్లికార్జున స్నేహితులు. ఈ నెల ఒకటిన రాత్రి మద్యం తాగి లక్ష్మీచెన్నకేశవపురం సమీపంలో తిరుగుతున్నారు. అదే ప్రాంతానికి చెందిన చిన్న కదిరప్ప టీవీఎస్‌లో వస్తూ నరసింహులు అనే వ్యక్తిని ఢీకొన్నాడు. దీంతో ఆగ్రహించిన నరసింహులు కదిరప్పను తిట్టాడు. వారి మధ్య మాటామాటా పెరగడంతో చివరకు పైన పేర్కొన్న నలుగురూ కలసి కదిరప్పను చితకబాదారు.


అంతటితో ఆగక అతని టీవీఎస్‌లోనే బలవంతంగా రైల్వేట్రాక్‌ వద్దనున్న బీడు భూమిలోకి తీసుకెళ్లి చితకబాదారు. అనంతరం కదిరప్పను తీసుకొచ్చి లక్ష్మిచెన్నకేశవపురంలోని కరుణాకర్‌ జనరల్‌ స్టోర్‌ వద్ద వదిలేసి వెళ్లిపోయారు. 2వతేదిన ఆదివారం తెల్లవారుజామున జనరల్‌ స్టోర్‌ నిర్వాహకుడు కరుణాకర్‌ తీవ్రగాయాలతో ఉన్న కదిరప్పను గమనించి వెంటనే 108కు సమాచారం అందించారు. 108 అంబులెన్స్‌ వచ్చేలోపు కదిరప్ప మృతి చెందాడు. 4న నిందితులు వీఆర్‌ఓ రాజశేఖర్‌ ఎదుట హాజరై నేరం అంగీకరించారు. వారిని సీఐ ఎదుట హాజరుపరిచారు. ఆ తరువాత అరెస్టు చూపారు. అనంతరం వారిని కోర్టులో హాజరుపరచగా, రిమాండ్‌కు ఆదేశించారు.


 

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top