కోరుట్లలో ఉద్రిక్తత | fight for korutla revenu devision | Sakshi
Sakshi News home page

కోరుట్లలో ఉద్రిక్తత

Aug 29 2016 8:38 PM | Updated on Oct 16 2018 6:27 PM

కోరుట్లలో ఉద్రిక్తత - Sakshi

కోరుట్లలో ఉద్రిక్తత

రెవెన్యూ డివిజన్‌ అంశం చర్చ కోసం ఏర్పాటుచేసిన మున్సిపల్‌ అత్యవసర సమావేశం ఉద్రిక్త పరిస్థితుల్లో వాయిదా పడింది. చైర్మన్‌ రాజీనామా చేయాలని కోరుతూ మున్సిపల్‌ ముట్టడికి కోరుట్ల రెవెన్యూ డివిజన్‌ సాధన సమితి ప్రతినిధులు యత్నించగా.. పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వారు జాతీయ రహదారిపై మున్సిపల్‌ చైర్మన్‌ శీలం వేణు దిష్టిబొమ్మను దహనం చేశారు.

  • చైర్మన్‌ రాజీనామా చేయాలని మున్సిపల్‌ ముట్టడికి యత్నం
  • సమావేశం వాయిదా
  • చైర్మన్‌ దిష్టిబొమ్మ దహనం
  • గుండు గీయించుకుని నిరసన తెలిపిన కౌన్సిలర్‌ 
  • కోరుట్ల: రెవెన్యూ డివిజన్‌ అంశం చర్చ కోసం ఏర్పాటుచేసిన మున్సిపల్‌ అత్యవసర సమావేశం ఉద్రిక్త పరిస్థితుల్లో వాయిదా పడింది. చైర్మన్‌ రాజీనామా చేయాలని కోరుతూ మున్సిపల్‌ ముట్టడికి కోరుట్ల రెవెన్యూ డివిజన్‌ సాధన సమితి ప్రతినిధులు యత్నించగా.. పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వారు జాతీయ రహదారిపై మున్సిపల్‌ చైర్మన్‌ శీలం వేణు దిష్టిబొమ్మను దహనం చేశారు.
     
    సమావేశం వాయిదా..
    రెవెన్యూ డివిజన్‌ డ్రాఫ్ట్‌ నోటిఫికేషన్‌ విడుదల తరువాత సాధన సమితి ప్రతినిధులు కోరుట్ల డివిజన్‌ ఉద్యమానికి మద్దతుగా మున్సిపల్‌ కౌన్సిల్‌ రాజీనామా చేయాలని కోరారు. దీంతో 16 మంది కౌన్సిలర్లు పదవులకు రాజీనామా ప్రకటించి అత్యవసర సమావేశం ఏర్పాటు చేయాలని కమిషనర్‌ను కోరారు. చైర్మన్‌ వేణు, కొందరు కౌన్సిలర్లు రాజీనామా ప్రకటన చేయకపోవడంతో సాధన సమితి ప్రతినిధులు ఆందోళన కొనసాగిస్తున్నారు. ఈక్రమంలో సోమవారం మధ్యాహ్నం మున్సిపల్‌ సమావేశం ఏర్పాటుచేశారు. అప్పటికే మున్సిపల్‌ చైర్మన్‌ శీలం వేణు ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా సమావేశం వాయిదా వేయాలని కోరుతూ కమిషనర్‌ వాణిరెడ్డికి లేఖ ఇవ్వగా.. వాయిదా వేసినట్లు ప్రకటించారు. సమావేశానికి బీజేపీ కౌన్సిలర్‌ ఇందూరి సత్యం, టీఆర్‌ఎస్‌ జువ్వాడి వర్గం కౌన్సిలర్లు గండ్ర రాజనర్సింగరావు, తిరుమల గంగాధర్, రియాజ్, లోకిని రంజిత్‌ హాజరయ్యారు.
     
    గుండు గీయించుకున్న కౌన్సిలర్‌
    రెవెన్యూ డివిజన్‌ అంశంపై ఏర్పాటు చేసిన కీలక సమావేశాన్ని ఎలా వాయిదా వేశారని కౌన్సిలర్లు ఇందూరి సత్యం, గండ్ర రాజు అధికారులను నిలదీశారు. మున్సిపల్‌ చైర్మన్‌ ప్రజల ఆకాంక్షలను విస్మరిస్తున్నారని ఆరోపించారు. చైర్మన్‌ సమావేశానికి రావాలని డిమాండ్‌ చేశారు. చైర్మన్‌ వైఖరిని నిరసిస్తూ బీజేపీ కౌన్సిలర్‌ ఇందూరి సత్యం గుండు గీయించుకున్నారు. ఇప్పటికైనా మున్సిపల్‌ చైర్మన్‌ శీలం వేణు రెవెన్యూ డివిజన్‌ ఉద్యమానికి మద్దతుగా పదవికి రాజీనామా చేయాలని కోరారు. 
     
    చైర్మన్‌ దిష్టిబొమ్మ దహనం
    మున్సిపల్‌ సమావేశం వాయిదా పడటం.. ముట్టడి జరగకుండా పోలీసులు బందోబస్తుతో అడ్డుపడడంతో డివిజన్‌ సాధన సమితి ప్రతినిధులు జాతీయ రహదారిపై చైర్మన్‌ దిష్టిబొమ్మను దహనంచేశారు. అనంతరం మళ్లీ నల్లజెండాలతో మున్సిపల్‌ కార్యాలయానికి వెళ్లి ముట్టడికి యత్నించారు. సాయంత్రం 4గంటల సమయంలో నల్లజెండాలతో మున్సిపల్‌కు చేరుకున్న సాధన సమితి ప్రతినిధులను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల బారికేడ్లు దాటి సాధన సమితి అధ్యక్షుడు చెన్న విశ్వనాథం ఒక్కడే మున్సిపల్‌ ఆవరణలోకి చేరుకోగా జగిత్యాల డీఎస్పీ రాజేంద్రప్రసాద్‌ ఆయనను బయటకు పంపించారు. సాయంత్రం ఆరు గంటల వరకు అక్కడే ఉన్న డీఎస్పీ పరిస్థితులను నియంత్రించారు.
     
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement